Begin typing your search above and press return to search.

లాలూ ఇంట్లో కొత్త కుంపటి...బీజేపీకి రాచబాటేనా ?

లాలూ ప్రసాద్ కి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడికి కూడా ఆ మధ్య దాకా ఆర్జేడీలో కీలక పాత్ర ఉండేది.

By:  Satya P   |   27 Sept 2025 9:28 AM IST
లాలూ ఇంట్లో కొత్త కుంపటి...బీజేపీకి రాచబాటేనా ?
X

బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఎన్నో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. బీహార్ మాజీ సీఎం ఆర్జేడీ అధినేత అయిన లాలూ ప్రసాద్ యాదవ్ ఇంట్లోనే కొత్త కుంపటికి రంగం సిద్ధం అయిపోయింది. ఇంతకాలం ఒక్కటిగా ఉన్న పార్టీ ఇక మీదట రెండుగా చీలిపోయేలా పరిణామాలు కనిపిస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో బీహార్ లో బీజేపీ జేడీయూల ఎండీయేని గద్దె దించాలని విశ్వ ప్రయత్నం చేస్తున్న ఆర్జేడీకి ఏకంగా ఇంట్లోనే అగ్గి రాజుకుంది.

పార్టీ పెడుతున్న కొడుకు :

లాలూ ప్రసాద్ కి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడికి కూడా ఆ మధ్య దాకా ఆర్జేడీలో కీలక పాత్ర ఉండేది. అయితే ఆయన వ్యక్తిగత జీవితం విషయంలో వివాదం చెలరేగడంతో లాలూ ఆయనను పార్టీ నుంచి బయటకు పంపించేశారు. దాంతో పెద్ద కొడుకు వేరు పడిపోయారు. ఆయనే తేజ్ ప్రతాప్ యాదవ్. ఆయన తాను కొత్త పార్టీని స్థాపిస్తున్నట్లుగా ప్రకటించారు. దానికి జనశక్తి జనతాదళ్ అన్న పేరు కూడా పెట్టారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆయన తెలియచేశారు. ఇక తన కొత్త పార్టీకి బ్లాక్ బోర్డుని గుర్తుగా ఆయన ఎంచుకున్నారు.

వారి బొమ్మలతో :

మరో వైపు చూస్తే ఈ కొత్త పార్టీ పోస్టర్ చూస్తే చాలా మంది ప్రముఖుల ఫోటోలు ఉన్నాయి. మహాత్మా గాంధీ అంబేద్కర్, రాం మనోహర్ లోహియా, జయప్రకాష్ నారాయణ్, కర్పూరీ ఠాకూర్ వంటి ప్రముఖుల చిత్రాలతో పార్టీ పోస్టర్ ని నింపేశారు. ఇక నినాదాల గురించి చూస్తే కనుక సామాజిక న్యాయం, సామాజిక హక్కులు, సంపూర్ణ మార్పు అని వాటిని పోస్టర్ లో పొందుపరచారు.

తండ్రి తమ్ముడికి పోటీగా :

బీహార్ రాష్ట్ర అభివృద్ధి కోసమే పార్టీ పెడుతున్నట్లుగా తేజ్ ప్రతాప్ యాదవ్ చెబుతున్నారు. బీహార్ సమగ్రమైన అభివృద్ధి తన లక్ష్యమని కూడా ఆయన అంటున్నారు. ఏకంగా సుదీర్ఘమైన కాలం ప్రజల మధ్య పోరాటానికి సిద్ధమని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఆయనను లాలూ యాదవ్ ఈ ఏడాది మే 25న పార్టీ నుంచి ఏకంగా ఆరేళ్ళ పాటు బహిష్కరించారు. అయితే ఇపుడు ఏకంగా పార్టీ పెడుతూ తండ్రి పార్టీ ఓట్లనే కొల్లగొట్టడానికి ఆయన రెడీ అవుతున్నారా అన్న చర్చ సాగుతోంది. మరి ఈ పార్టీ కనుక రేపటి ఎన్నికల్లో జనం ముందుకు వస్తే గెలుపు సంగతి పక్కన పెడితే లాలూ ఆర్జేడీ ఓట్లను చీలుస్తుందా అలా అయితే అది కాస్తా చివరికి ఇండియా కూటమికే నష్టం కదా అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ పరిణామాలు సహజంగానే బీజేపీ శిబిరంలో ఆనందాన్ని కలిగిస్తున్నాయని అంటున్నారు.