బిహార్ ఎన్నికల్లో ఢిల్లీ నేత ఎంట్రీ.. మరింత హీటెక్కిన రాజకీయం..
బిహార్ లోని 243 స్థానాల్లో అన్నింటిలో ఒంటరిగా బరిలోకి దిగుతామని కేజ్రీవాల్ ప్రకటించడంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా కదిలిపోయాయి.
By: Tupaki Political Desk | 7 Oct 2025 12:23 PM ISTదేశం దృష్టి మొత్తం ఆ రాష్ట్రంపైనే ఉంది. అదేదో యూపీ అంత పెద్ద రాష్ట్రం కాదు.. అయినా అక్కడి రాజకీయం వైపునకే దేశం మొగ్గు చూపుతోంది. కారణం అక్కడ మొదలైన ‘ఓట్ చోరీ’ స్టోరీ. దేశ వ్యాప్తంగా అటెన్షన్ క్రియేట్ చేసిన ఈ అంశం బిహార్ ఎన్నికల నేపథ్యంలో తెరపైకి వచ్చింది. దీంతో ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు అధికారంలో ఉన్న బీజేపీ ఓడుతుందా..? గెలుస్తుందా..? అని దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
బిహార్ రాజకీయ రంగం ఒక్కసారిగా వేడెక్కింది. నవంబర్ 6, 11 తేదీల్లో జరగనున్న రెండు దశల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల కావడంతో పార్టీలు మైదానంలోకి దిగాయి. ఇప్పటి వరకు జేడీయూ–బీజేపీ కూటమి, ఆర్జేడీ–కాంగ్రెస్–ఎల్జీపీ కూటమి, పీకే నేతృత్వంలోని జన సురాజ్ పార్టీ మధ్య త్రిపాక్ష పోరు కనిపించగా.. ఈ ఎన్నికలు ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంట్రీ ఇవ్వబోతోంది. బిహార్ లోని 243 స్థానాల్లో అన్నింటిలో ఒంటరిగా బరిలోకి దిగుతామని కేజ్రీవాల్ ప్రకటించడంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా కదిలిపోయాయి.
విశ్లేషకుల వింత వాధన..
బిహార్‌లో అధికార కూటమి జేడీయూ–బీజేపీ దూకుడుతో ముందుకు సాగుతున్నా, ప్రత్యామ్నాయ శక్తిగా పీకే జన్ సురాజ్ పార్టీ దూసుకుపోతోంది. పలు సర్వేల ప్రకారం ఆయనకు సుమారు 7 శాతం ఓట్లు లభించే అవకాశం ఉందని తేలింది. అదే నిర్ణయాత్మక స్థాయిలో ఉంటే.. ఈ ఎన్నికల్లో ‘కింగ్ మేకర్’ పాత్రను పీకే పోషించే అవకాశం ఖాయం అని విశ్లేషకులు చెబుతున్నారు.
వేగంగా మారుతున్న సమీకరణాలు..
ఇదిలా ఉండగా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంట్రీతో ఈ సమీకరణాలన్నీ కొత్త మార్గంలోకి మళ్లే ప్రమాదం కనిపిస్తోంది. ఢిల్లీ పాలనలో ప్రదర్శించిన విద్య, ఆరోగ్య నమూనాలను బిహార్ ప్రజలకు పరిచయం చేయడం ద్వారా ఆప్ తటస్థ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. దీంతో కాంగ్రెస్–ఆర్జేడీ కూటమికి తలనొప్పి తప్పదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
రాహుల్ వ్యూహం.. మోడీ చతురత పని చేస్తుందా..?
మరోవైపు, ప్రధాని నరేంద్ర మోదీకి ఈ ఎన్నికలు అగ్ని పరీక్షలాంటివి. జీఎస్టీ-2.0, స్వదేశీ ఆర్థిక విధానం, ‘ఆపరేషన్ సింధూర్’ వంటివి చేపట్టిన తర్వాత భవితవ్యాన్ని ఈ ఎన్నికల ఫలితాలు నిర్ణయించనున్నాయి. ఈ సారికి బిహార్ ఎన్నికలు కేవలం స్థానిక రాజకీయం కాదు. జాతీయ స్థాయిలో వచ్చే రాజకీయ తుఫానుకు ఇది దిశా నిర్దేశం చేయబోతోంది. ‘ఆప్’ ఎంట్రీతో ఆ సమీకరణాలు మరింత వేడెక్కడం.. భవిష్యత్ భారత రాజకీయ పటంలో బీహార్ మరోసారి ప్రధాన కేంద్రంగా మారింది.
