బీజేపీతో బంధం.. లాస్ ఎంతో చెప్పే బిహార్
మర్రిచెట్టు నీడలో మరే చెట్టు కూడా ఎదగదన్న సామెతలో నిజమెంతో.. బీజేపీతో దీర్ఘకాలం సాగే పొత్తు బంధం మిత్రపక్షాలకు షాకుల మీద షాకులు ఇస్తుందన్నది నిజం.
By: Garuda Media | 14 Oct 2025 10:05 AM ISTమర్రిచెట్టు నీడలో మరే చెట్టు కూడా ఎదగదన్న సామెతలో నిజమెంతో.. బీజేపీతో దీర్ఘకాలం సాగే పొత్తు బంధం మిత్రపక్షాలకు షాకుల మీద షాకులు ఇస్తుందన్నది నిజం. బిహార్ లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ఈ విషయాన్ని మరోసారి రుజువు చేస్తున్నాయని చెప్పాలి. తాజాగా బీజేపీ - జేడీయూ మధ్య కుదిరిన సీట్ల ఒప్పందమే ఇందుకు నిదర్శనం. 1996 నుంచి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య నెలకొన్న పొత్తు బంధాన్ని చూస్తే.. ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది.
ఇప్పటివరకు సీట్ల సర్దుబాటులో బీజేపీ కంటే ఒక్క సీటు అయినా అధికంగా ఉండాలనే దానికి భిన్నంగా ఈసారి సమంగా సీట్లు పంచుకునే వరకు వెళ్లటమే ఇందుకు నిదర్శనంగా చెప్పాలి. ఈ రెండు పరా్టీల మధ్య తొలిసారి 1996లో జరిగిన లోక్ సభ ఎన్నికల వేళ పొత్తు కుదిరింది. ఈ పొత్తు సందర్భంగా తమ సీట్ల విషయంలో జేడీయూ పట్టుదలగా ఉండేది. బిహార్ లో తమదే పెద్ద పార్టీ కాబట్టి.. అత్యధిక స్థానాలు తమకే చెందాలన్న వాదన వినిపించేది. అంతిమంగా తమ వాదనను నెగ్గించుకునేలా పొత్తు సర్దుబాట్లు ఉండేలా చూసుకునేది.
బిహార్ లో జేడీయూ.. బీజేపీ బంధాన్ని చూసినప్పుడు ఏడాదికేడాది బీజేపీ తన బలాన్ని పుంజుకోగా.. జేడీయూ తన బలాన్ని కోల్పోయిన పరిస్థితి కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ఈ రెండు పార్టీలకు మధ్య తొలిసారి (1996)లో పొత్తు కుదిరినప్పుడు జేడీయూ తనకు దక్కాల్సిన సీట్ల విషయంలో పట్టుదలగా ఉండటమే కాదు.. అంతిమంగా తన డిమాండ్ కు తగ్గట్లే సీట్లను దక్కించుకుంది.అలా మొదలైన బంధం.. తర్వాతి కాలంతో జేడీయూ డిమాండ్ చేసే స్థాయి తగ్గుతూ వచ్చింది. చివరకు 2020 ఎన్నికల వేళలో బీజేపీ కంటే తాము పోటీ చేసే సీట్ల సంఖ్య ఒక్కటైనా ఎక్కువగా ఉండాలన్నట్లుగా చెబుతూ.. 122 స్థానాల్ని సొంతం చేసుకుంది.
అప్పట్లో జరిగిన ఒప్పందంలో భాగంగా తాము తీసుకున్న 122 స్థానాల్లో హిందుస్తానీ అవామ్ మోర్చా పార్టీకి 11 సీట్లు కేటాయించింది. అంటే.. అప్పటి ఎన్నికల్లో జేడీయూ మొత్తంగా 111 చోట్ల పోటీ చేస్తే.. గెలిచింది మాత్రం 43 స్థానాల్లోనే. అదే సమయంలో బీజేపీ 110 స్థానాల్లో పోటీ చేసి ఏకంగా 74 స్థానాల్లో విజయం సాధించటం ద్వారా బీజేపీ..బిహార్ లో తానెంతగా బలపడిన విషయాన్ని స్పష్టం చేసింది. ఆ తర్వాతి కాలంలో బీజేపీతో బంధాన్ని తెంచుకొని బయటకు వెళ్లి.. మహాకూటమితో చెలిమి చేసిన నితీశ్ అధికారాన్ని కాపాడుకున్నా.. ఆ తర్వాత మళ్లీ ఎన్డీయూలోకి వచ్చి.. సీఎం పదవిని కాపాడుకున్నారు.
అయితే.. తాజాగా జరుగుతున్న ఎన్నికలు బీజేపీ అనుకున్నట్లే సాగుతున్నాయి. బిహార్ లో నితీశ్ శకం ముగిసిందన్న స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా జరిగిన సీట్ల సర్దుబాటుతో పాటు.. ఎన్డీయే సీఎం అభ్యర్థి ప్రకటన విషయంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు ఈ వాదనకు బలాన్ని చేకూరేలా చేస్తున్నాయి. తాజాగా సీట్ల పంపకాన్ని చూస్తే.. జేడీ(యూ).. బీజేపీలు 101 సీట్లకు పోటీ చేయాలని డిసైడ్ అయ్యాయి. తాజాగా 29 స్థానాల్ని పొందిన ఎల్ జేపీ పూర్తిగా బీజేపీ కంట్రోల్ లో ఉంటుందన్నది తెలిసిందే. అలా అని.. ఆ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించటం ద్వారా నితీశ్ సాధించేది ఏమీ లేదు. అందుకే.. ఆయన మాట్లాడలేని పరిస్థితి. అలా అని బంధాన్ని వదులుకోలేని దుస్థితి.
ఇంతేనా.. గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ సీఎం అభ్యర్థి నితీశే అని చెప్పిన ఎన్డీయే ఈసారి మౌనంగా ఉండటం చూస్తే.. ఆయన స్థానానికి బీజేపీ గండి కొట్టిందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో గత ఎన్నికల మాదిరి జేడీ(యూ) కంటే బీజేపీకే ఎక్కువ సీట్లలో గెలిస్తే.. ముఖ్యమంత్రి కుర్చీలో బీజేపీకి చెందిన నేతే ఉంటారన్నది కాదనలేని వాస్తవం.
అదే జరిగితే.. దేశ రాజకీయాల్లో బీజేపీ బలం మరింత పెరుగుతుంది. అదే సమయంలో బిహార్ లో మండల్ రాజకీయాలకు చెక్ పడినట్లు అవుతుంది. ఏమైనా.. వచ్చే నెలలో వెల్లడయ్యే బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితం దేశ రాజకీయాల మీద ప్రభావం చూపుతుందని మాత్రం చెప్పక తప్పదు. అంతేకాదు.. బీజేపీతో దీర్ఘకాల మైత్రి.. ఆయా పార్టీలకు పెను నష్టంగా మారుతుందన్న మాటలో నిజముందని తేలుతుంది. అయితే.. ఇందులో నిజమెంత? అన్నది డిసైడ్ అయ్యేందుకు వచ్చే నెల వరకు వెయిట్ చేయక తప్పదు.
