Begin typing your search above and press return to search.

బీహార్ దంగ‌ల్‌: టీచ‌ర్లు, న్యాయ‌వాదుల‌కు ఎంఐఎం టికెట్లు

బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముహూర్తం స‌మీపిస్తున్న స‌మ‌యంలో హైద‌రాబాద్‌కు చెందిన ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ దూకుడు పెంచారు.

By:  Garuda Media   |   20 Oct 2025 4:00 PM IST
బీహార్ దంగ‌ల్‌: టీచ‌ర్లు, న్యాయ‌వాదుల‌కు ఎంఐఎం టికెట్లు
X

బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముహూర్తం స‌మీపిస్తున్న స‌మ‌యంలో హైద‌రాబాద్‌కు చెందిన ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ దూకుడు పెంచారు. ఇప్ప‌టివ‌ర‌కు ఆయ‌న పొత్తుల కోసం వేచి చూశారు. అయితే.. కాంగ్రెస్ నేతృత్వంలోని మ‌హాఘ‌ట్ బంధ‌న్ నుంచి నిరాశే ఎదురైంది. దీంతో పూర్వాంచ‌ల్ స‌హా.. రాష్ట్ర వ్యాప్తంగా త‌మ అభ్య‌ర్థుల‌ను నిలబెట్టేందుకు ఎంఐఎం ప్ర‌య‌త్నాలు సాగించింది. ఈ క్ర‌మంలో తాజాగా 25 మంది అభ్య‌ర్థుల‌తో కూడిన తొలిజాబితాను అస‌దుద్దీన్ ప్ర‌క‌టించారు. వీరంతా ఆర్థికంగా సంప‌న్నులు కార‌ని.. విజ్ఞానం ప‌రంగా.. బీహారీల మ‌న‌సు తెలిసిన వారిగా గొప్ప‌వార‌ని పేర్కొన్నారు.

ఇక‌, ఎంపిక చేసిన అభ్య‌ర్థుల్లో 22 మంది ఉన్న‌త‌స్థాయి విద్య‌ను అభ్య‌సించిన వారే కావ‌డం గ‌మ‌నార్హం. కొంద‌రు ఉపాధ్యాయులు మ‌రికొంద‌రు న్యాయ‌వాదులు కూడా ఉన్నారు. ఇంకొంద‌రు రిటైర్డ్ ఎంప్లాయిస్ కూడా ఉన్నారు. వీరంతా బీహార్‌లోని అణ‌గారిన వ‌ర్గాల‌కు హ‌క్కులు సాధించేందుకు వారి అభ్యున్న‌తికి కృషి చేసేందుకు ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతున్నార‌ని అస‌దుద్దీన్ సుదీర్ఘ పోస్టు చేశారు. బీహార్‌లో నెల‌కొన్న అనిశ్చితి రాజ‌కీయాల్లో ఎంఐఎం అభ్య‌ర్థుల‌ను ప్ర‌జ‌లు ఎన్నుకోవాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ప్ర‌జ‌ల త‌ర‌ఫున బ‌ల‌మైన గ‌ళం వినిపించేందుకు వారు సిద్ధంగా ఉన్నార‌ని తెలిపారు.

మ‌రోవైపు.. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మ‌హాఘ‌ట్ బంధ‌న్‌లో ఇప్ప‌టికీ సీట్ల స‌ర్దుబాటు కొలిక్కిరాలేదు. దీంతో కాంగ్రెస్ స‌హా ఆర్జేడీ, కూట‌మి పార్టీల నాయ‌కులు ఒక్కొక్క‌రు బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. త‌మ త‌మ స్థానాల్లో స్వతంత్రంగా పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకుంటున్న‌ట్టు వారు చెబుతున్నారు. ఇదిలావుంటే.. జార్ఖండ్‌(బీహార్ నుంచి విడిపోయిన రాష్ట్రం) అధికార పార్టీ జేఎంఎం కూడా బీహార్ ఎన్నిక‌ల బ‌రిలో నిలిచింది. రాష్ట్రంలో 243 స్థానాల్లోనూ అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్ట‌నున్న‌ట్టు జేఎంఎం అధినేత‌, సీఎం హేమంత్ సొరేన్ స్ప‌ష్టం చేశారు. తాజాగా ఆయ‌న ప‌ట్నాలో నిర్వ‌హించిన పార్టీ స‌మావేశంలో అభ్య‌ర్థుల ఎంపిక‌ను పూర్తి చేసిన‌ట్టు కూడా చెప్పుకురావ‌డం గ‌మ‌నార్హం.