Begin typing your search above and press return to search.

బిహార్ సీఎం అభ్యర్థి ఇతనే.. అన్ని పార్టీలు ఏకతాటిపైకి..

కూటమిలో ఇంకా విభేదాల మంట చల్లారనేలేదు. కాంగ్రెస్‌ 61 స్థానాల్లో పోటీ చేయనుందని ప్రకటించగా, ఆర్జేడీ 143, వామపక్షాలు 13 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.

By:  Tupaki Political Desk   |   23 Oct 2025 3:34 PM IST
బిహార్ సీఎం అభ్యర్థి ఇతనే.. అన్ని పార్టీలు ఏకతాటిపైకి..
X

బిహార్‌ రాజకీయాలు మళ్లీ తేజస్వీ యాదవ్‌ చుట్టూ తిరుగుతున్నాయి. విపక్ష కూటమి మహాగఠ్‌ బంధన్‌ నిర్ణయానికి వచ్చింది. ‘మా సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్‌’ అని స్పష్టంగా ప్రకటించింది. ఒకప్పటి ఉపముఖ్యమంత్రిగా, లాలూ యాదవ్‌ వారసుడిగా.. రాజకీయ వారసత్వం చిహ్నంగా తేజస్వీ మళ్లీ ప్రధాన వేదికపైకి రావడం బిహార్‌లో కొత్త సమీకరణాలను సూచిస్తోంది. కూటమి భాగస్వామ్య పార్టీలు ఆర్జేడీ, కాంగ్రెస్‌, వామపక్షాలు, వికాస్‌శీల్‌ ఇన్‌సాన్‌ పార్టీ ఒకే వేదికపై నిలబడి ఈ ప్రకటన చేయడం రాజకీయంగా ఆసక్తిని కలిగించింది. ‘తేజస్వీ మా అభ్యర్థి, మరి మీ అభ్యర్థి ఎవరు?’ అని ఆర్జేడీ నేతలు ఎన్డీయే కూటమిపై నేరుగా సవాల్‌ విసరడం కేవలం రాజకీయ ప్రకటన కాదు.. అది ఎన్నికల సన్నివేశంలో స్ఫూర్తిదాయక యుద్ధానికి తెర లేపుతుంది.

తేజస్వీకి ఇచ్చిన పూర్తి అధికారం

పట్నాలో గురువారం (అక్టోబర్ 23) సంయుక్త మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అశోక్‌ గహ్లోత్‌, వామపక్షాల ప్రతినిధులు, వికాస్‌శీల్‌ పార్టీ అధినేత ముకేశ్‌ సహనీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తేజస్వీతో పాటు డిప్యూటీ సీఎంగా ముకేశ్‌ సహనీ పేరును కూడా ప్రకటించారు. ఇది రాజకీయంగా వ్యూహాత్మకమైన అడుగు. తేజస్వీ యాదవ్‌ ‘యువ నాయకత్వం’కు ప్రతీక అయితే.. సహనీ మత్స్య సమాజం, తీరప్రాంత ఓటర్లకు ప్రతినిధి. అంటే కూటమి తన సామాజిక సమీకరణాన్ని సరిగ్గా అర్థం చేసుకుంది అని అనుకోవచ్చు. మహాగఠ్‌ బంధన్‌ పోస్టర్లలో తేజస్వీ యాదవ్‌ ఫొటో మాత్రమే ఉంది, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఫొటో కనిపించలేదు. ఇది కేవలం డిజైన్‌ లోపమా.. లేక రాజకీయ దూరమా? ఇది కాంగ్రెస్‌ స్థానంపై చర్చలకు తావిచ్చింది. బీజేపీ కూడా ఈ అవకాశాన్ని వదలలేదు. ‘ఇది సంయుక్త సమావేశమా? లేక ఒక పార్టీ షోనా?’ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరింది.

అంతర్గత సర్దుబాట్లు

కూటమిలో ఇంకా విభేదాల మంట చల్లారనేలేదు. కాంగ్రెస్‌ 61 స్థానాల్లో పోటీ చేయనుందని ప్రకటించగా, ఆర్జేడీ 143, వామపక్షాలు 13 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఆసక్తికరంగా, 8 నియోజకవర్గాల్లో మూడు పార్టీలు ఒకే చోట అభ్యర్థులను ప్రకటించడం కూటమి క్రమశిక్షణపై ప్రశ్నలు లేవనెత్తింది. ‘కూటమి లోపల పోటీ’ అనే పదం ఇప్పుడు బిహార్‌ మీడియా శీర్షికల్లో మార్మోగుతోంది. విపక్షం ఏకతాటిపై ఉందని చెప్పుకుంటున్నప్పటికీ, ఈ సీట్ల వివాదం దాని భవిష్యత్తును సవాలు చేస్తోంది. లాలూ యాదవ్‌ సమయాల్లో కూటములు ఒకే మాట, బాటపై ఉండేవి. కానీ తేజస్వీ నేతృత్వంలో ఈ సారి ‘ఒకే మాట’ కంటే ‘స్వతంత్ర స్వరం’ దిశగా కదులుతున్నా అని ఆర్జేడీ ప్రతినిధి మృత్యుంజయ్‌ తివారీ స్పష్టంగా అన్నారు. ‘మేమే ప్రధాన పార్టీ, మా సీట్ల ప్రాధాన్యాన్ని ఇతరులు అర్థం చేసుకోవాలి’.

యంగ్ వర్సెస్ ఎక్స్‌పీరియెన్స్‌

బిహార్‌ ఎన్నికలు ఎప్పుడూ కేవలం ఓట్ల పోరు కాదు.. అది ఒక భావజాల పోరాటం. ఈ సారి కూడా అలాగే కనిపిస్తోంది. తేజస్వీ యాదవ్‌ యువత, మార్పు, నూతన బిహార్‌ అనే నినాదంతో ముందుకు వస్తే, ఎన్డీయే పక్షం స్థిరత్వం, అనుభవం, అభివృద్ధి అనే భావనతో వెళ్తోంది. నితీష్‌ కుమార్‌ ఇంకా ఎన్డీయే ఫేస్ కావడం ఖాయం, కానీ ఆయన వయసు, వృద్ధాప్యం, తేజస్వీ ఉత్సాహం మధ్య తేడా ఓటర్లలో ఆసక్తి రేకెత్తిస్తోంది. 2020 ఎన్నికల్లో తేజస్వీ యాదవ్‌ పార్టీ గెలుచుకున్న 75 సీట్లు ఆయన భవిష్యత్తుకు పునాదులు వేశాయి. ఆ సమయంలో ఆయన అనుభవం తక్కువగా ఉన్నప్పటికీ.. ఇప్పుడు ఆయనకు వ్యవస్థపై అవగాహన, యంగ్ స్టర్స్ మద్దతు, లాలూ వారసత్వం అనే 3 బలమైన అస్త్రాలు ఉన్నాయి.

కూటమి భవిష్యత్తు

మహాగఠ్‌బంధన్‌ ఈసారి ఒకే ఫేస్ ను చూపించింది. ఒకవైపు సీట్ల సర్దుబాట్లలో లొసుగులు, మరోవైపు అంతర్గత అసంతృప్తి, పైగా కాంగ్రెస్‌ దూరంగా ఉండే సంకేతాలు ఇవన్నీ తేజస్వీ యాదవ్‌ ముందు సవాళ్లుగా నిలుస్తున్నాయి. తేజస్వీకి ఈ ఎన్నికలు కేవలం రాజకీయ పరీక్ష కాదు.. అది ఒక ‘తరం మార్పు’ పరీక్ష కూడా. బిహార్‌ రాజకీయాలు లాలూ, నితీష్‌ శకం నుంచి బయటపడతాయా? కొత్త నాయకత్వం శాసిస్తుందా..? అన్నది నవంబర్‌ 14 వరకు వేచి చూడాల్సిందే.. అయితే ఇప్పుడున్న చిత్రమేమిటంటే.. బిహార్‌ ప్రజలు ఒక కొత్త కథ కోసం ఎదురుచూస్తున్నారు. తేజస్వీ ఆ కథలో నాయకుడా, లేక మరో ప్రయోగం లోపల పాత్రధారుడా? అనేది ఇక బిహార్‌ ఓటర్లే నిర్ణయిస్తారు.