Begin typing your search above and press return to search.

నితీష్ తగ్గిన చోట నాయుడు హెచ్చుతారా ?

బీహార్ లో ఎన్డీయే మళ్ళీ గెలిచి బీజేపీకి చెందిన వారే సీఎం పీఠం అధిరోహిస్తే ఏమి జరుగుతుంది అన్నది ఒక చర్చ. అలా కాకుండా ఏకంగా మహా ఘట్ బంధన్ గెలిచి తేజస్వి యాదవ్ సీఎం అయితే ఎలా ఉంటుంది అన్నది మరో చర్చ.

By:  Satya P   |   28 Oct 2025 10:00 PM IST
నితీష్ తగ్గిన చోట నాయుడు హెచ్చుతారా ?
X

దేశంలో ఇపుడు బీహార్ పొలిటికల్ ఫీవర్ పట్టుకుంది. ఇది రాజకీయంగా చూస్తే పెద్ద విశేషం అనడానికి లేదు. జస్ట్ ఒక అసెంబ్లీకి ఎన్నికలు కదా జాతీయ స్థాయిలో ప్రభావం ఏమి ఉంటుంది అని కొట్టిపారేయడానికి అంతకంటే లేదు. ఎందుకంటే రాజకీయంగా బాగా అవగాహన ఉన్న వారికి బీహార్ రిజల్ట్ కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అన్నది అర్ధం అవుతుంది. బీహార్ లో బీజేపీతో కలసి అధికారంలో ఉన్న జేడీయూకి 12 మంది ఎంపీలు ఉన్నారు. వారంతా ఇపుడు ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. ఈ ప్రధాన కారణం వల్లనే కేంద్రంలో నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేయగలిగారు.

నితీష్ ఓడితే :

బీహార్ లో నితీష్ కుమార్ ఓడితే ఏమి జరుగుతుంది అన్నదే ఇపుడు అంతటా చర్చ. నిజం చెప్పాలంటే బీహార్ లో ఎన్డీఎ ప్రచారం ఈసారి ఏమంత జోరుగా లేదు, అదే సమయంలో జనాలు కూడా మార్పు కోరుకుంటున్నారు అన్నది గట్టిగానే వినిపిస్తోంది. నితీష్ కుమార్ గురించి పార్టనర్ బీజేపీయే ఏమంత గొప్పగా చెప్పడం లేదు అని అంటున్నారు నితీష్ కుమార్ ని కేవలం ఎన్నికల్లో ఎన్డీయేకు సారధ్యం వహించే నాయకుడిగానే చూపిస్తున్నారు. అంతకు మించి కాబోయే సీఎం గా ప్రొజెక్ట్ చేయడం లేదు. దాంతో నితీష్ కుమార్ విషయంలో బీజేపీ ఆలోచనలు ఏమిటి అన్నది అర్ధం అవుతున్నాయని అంటున్నారు ఇంకో వైపు చూస్తే కనుక నితీష్ కుమార్ మీద ప్రత్యర్ధి పార్టీలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. ఆయన మానసికంగా శారీరకంగా అలసిపోయారు అని ఒకనాటి మిత్రుడు అలాగే జేడీయూకి ఒకనాటి ఎన్నికల వ్యూహకర్త అయిన జన సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ చెప్పాల్సింది అంతా జనాలకు నేరుగా చెబుతున్నారు.

మాజీ సీఎం గా :

ఇక బీహార్ ఎన్నికలు బీజేపీకి ప్రాణ ప్రదం అని చెప్పక తప్పదు, ఎందుకంటే ఏ మాత్రం తేడా వచ్చినా ఓటమి కనుక సంభవిస్తే దాని ప్రభావం నేరుగా కేంద్రం మీద ఉండొచ్చు అన్నది కమలనాథులకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు అనుకోవచ్చు. అయినా సరే నితీష్ కుమార్ ని సీఎం అభ్యర్ధిగా ప్రకటించకుండా బీజేపీ తనదైన రాజకీయ క్రీడను బీహార్ లో ఆడుతోంది. దానికి కారణం కూడా ఉంది. ఇక్కడే బీజేపీ తెలివిడి ఉంది అని అనుకోవాలి. నితీష్ కుమార్ పట్ల జనంలో ఉన్న వ్యతిరేకత తమ మీద పడకుండా చూసుకోవాలని కూడా బీజేపీ భావిస్తోంది అని అంటున్నారు. అలాంటపుడు పొత్తు ఎందుకు అంటే జేడీయూ వెనకాల ఉన్న ఓటు బ్యాంక్ కోసం అని అంటున్నారు. ఇక బీహార్ లో ఎన్డీయే గెలిచినా నితీష్ మాజీ సీఎం అవుతారు అని అంటున్నారు. ఆయనకు ఒక విధంగా ఈసారి ఎన్నికలు దాదాపుగా చివరివి అని అంటున్నారు.

ఏమి జరుగుతుందంటే :

బీహార్ లో ఎన్డీయే మళ్ళీ గెలిచి బీజేపీకి చెందిన వారే సీఎం పీఠం అధిరోహిస్తే ఏమి జరుగుతుంది అన్నది ఒక చర్చ. అలా కాకుండా ఏకంగా మహా ఘట్ బంధన్ గెలిచి తేజస్వి యాదవ్ సీఎం అయితే ఎలా ఉంటుంది అన్నది మరో చర్చ. ఈ రెండింటిలో ఏది జరిగినా ఒకటి మాత్రం తధ్యమని అంటున్నారు. అదే నితీష్ మాజీ సీఎం కావడం. మరి ఆ విధంగా అయితే కనుక నితీష్ కుమార్ ఊరుకుంటారా అన్నది పెద్ద ప్రశ్న. నిజానికి ఆయన తనకు రాజకీయంగా ఏది అనుకూలిస్తే ఆ వైపు దూకుతారు అని పేరు. గతంలో అనేక సార్లు ఆయన కాంగ్రెస్ బీజేపీ ఇలా క్యాంపులను మార్చిన పరిస్థితిని అంతా గుర్తు చేస్తున్నారు. మరి అలా జరిగితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి భారీ ప్రభావం ఉంటుంది కదా అన్నది కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే జేడీయూకి 12 మంది ఎంపీలు ఎన్డీయేకు అసలైన ఆక్సిజన్ అని చెప్పాల్సి ఉంటుంది అని గుర్తు చేస్తున్నారు.

నాయుడే కీలకమా :

ఇక బీహార్ విషయంలో రేపటి రోజున ఏమి జరుగుతుంది అన్నది అంతగా గమనంలోకి తీసుకోని స్థితిలో కమలనాధులు లేరని అంటున్నారు కచ్చితంగా ప్లాన్ ఏ పాటు ప్లాన్ బీ కూడా వారి వద్ద ఉంటుందని చెబుతున్నారు. నితీష్ తగ్గిన చోట కచ్చితంగా చంద్రబాబు నాయుడు పెరుగుతారని అంటున్నారు. ఆ విధంగా ఎన్డీయే పెద్దలు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఇంకా గట్టిగా చెప్పాలీ అంటే జాతీయ రాజకీయాలలో నవంబర్ 14 తరువాత బాబు ఇంకా కీలకం అవుతారు అని అంటున్నారు. ఆయన పార్టీకి 16 మంది ఎంపీలు ఉన్నారు. ఎన్డీయేలో బీజేపీ తరువాత ఇదే పెద్ద నంబర్ గా చూడాల్సి ఉంటుంది. దాంతో పాటుగా చూస్తే జాతీయ రాజకీయాల్లో బాబు ప్రభావవంతమైన నాయకుడు అన్నది కూడా తెలిసిందే. ఆయన ఏ వైపు ఉంటే ఆ వైపునకు త్రాసు మొగ్గుతుంది అని కూడా గతంలో ఉదంతాలు రుజువు చేశాయి. దాంతో బాబు ప్రాధాన్యత మరింతగగ పెంచెదిగా బీహార్ ఎన్నికలు ఉంటాయని అంటున్నారు. ఇవన్నీ ఆలోచించిన మీదటనే కేంద్ర పెద్దలు బాబుకు ఇప్పటికే విశేష ప్రాధాన్యత ఇస్తున్నారు అని అంటున్నారు. రానున్న రోజులలో అది మరింతగా పెరగడం ఖాయమని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.