నితీష్ కి ఫుల్ క్లారిటీ ఇచ్చిన మోడీ
బీహార్ సీఎం గా నితీష్ కుమార్ ది రెండు దశాబ్దాల చరిత్ర. మధ్యలో కొద్ది నెలలు తప్పించి 2005 నుంచి 2025 దాకా బీహార్ పీఠాన్ని నితీష్ కుమార్ ఏలారు
By: Satya P | 24 Oct 2025 9:00 PM ISTబీహార్ సీఎం గా నితీష్ కుమార్ ది రెండు దశాబ్దాల చరిత్ర. మధ్యలో కొద్ది నెలలు తప్పించి 2005 నుంచి 2025 దాకా బీహార్ పీఠాన్ని నితీష్ కుమార్ ఏలారు. ఆయన దాదాపుగా అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. ఆయన రాజకీయాలో సీఎం గా ఉండాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నారు తనను ముఖ్యమంత్రిగా అంగీకరించే పార్టీ అయినా పక్షం అయినా ఆయనకు పెద్దగా తేడా ఏమీ లేదు, వారితో కలసి ప్రయాణించారు. అలా నితీష్ సీఎం గా బీహార్ వరకూ చూస్తే లాంగ్ టెర్మ్ సీఎం గా ఒక రికార్డు క్రియేట్ చేశారు. అంతే కాదు దేశంలో కూడా రెండు పదుల పాటు వరసగా సీఎం గా కొనసాగిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ జాబితాలో నితీష్ కుమార్ చేరిపోయారు.
ఈసారి డౌటేనా :
అయితే ఈసారి మాత్రం నితీష్ సీఎం గా అయ్యే చాన్స్ కనిపించడం లేదు, పైగా అది డౌట్ లో పడింది అని అంటున్నారు. దానికి కారణం ఎన్డీయేలో మరో పెద్ద పార్టీ కేంద్రంలో కూడా అధికారంలో ఉన్న బీజేపీ ఎందుకో నితీష్ కుమార్ ని సీఎం ని చేయడానికి అంగీకరించడం లేదు అని అంటున్నారు. నిజం చెప్పాలీ అంటే 2020లోనే నితీష్ ని సీఎం గా చేయకుండా తమ పార్టీ నేతనే సీఎం పీఠం మీద కూర్చోబెట్టాలని బీజేపీ భావించింది అని అంటారు. ఆ ఎన్నికల్లో వందకు పైగా సీట్లలో పోటీ చేసిన జేడీయూ తెచ్చుకున్నది జస్ట్ 43 సీట్లు మాత్రమే. అదే ఎన్నికల్లో బీజేపీ 80 సీట్లకు దగ్గరగా వచ్చింది. దాంతో పెద్ద పార్టీగా సీఎం తమ పార్టీ నుంచే రావాలని అనుకుంది. అయితే జేడీయూ నుంచి వచ్చిన ఒత్తిడి కాచుకున్న విపక్షం అన్నీ చూసి బీజేపీ తన ఆలోచనలు మార్చుకుంది. ఈసారి కూడా అవే పరిస్థితులు ఉన్నాయి. కానీ బీజేపీ ఈసారి ఎంతమాత్రం తన పట్టుదలను చూపించాల్సిందే అని అంటోంది. ఈసారి కాకపోతే మరెప్పుడు అన్నట్లుగా నితీష్ విషయంలో బీజేపీ వ్యవహరిస్తోంది అని విశ్లేషణలు ఉన్నాయి.
ఘట్ బంధన్ సవాల్ కి :
ఇదిలా ఉంటే మహా ఘట్ బంధన్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్ధిగా తేజస్వి యాదవ్ ని కూటమి ప్రకటించింది. మొదట్లో చూస్తే కాంగ్రెస్ ఆయన అభ్యర్ధిత్వం పట్ల అంగీకరించడం లేదని అంతా అనుకున్నారు. అలాగే ప్రచారం సాగింది. కానీ తాజాగా కాంగ్రెస్ తేజస్వి తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించి ఎన్డీయేతో సహా అందరినీ ఖంగు తినిపించింది. ఇక విపక్షం కూటమి తరఫున సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న తేజస్వి యాదవ్ అదే ఊపులో ఎన్డీయేకు సవాల్ చేశారు. ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అని ఆయన ప్రశ్నిస్తున్నారు. దానికి బీహార్ లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ అయితే జవాబు చెప్పారు కానీ నేరుగా సూటిగా కాదు, పరోక్షంగా అని అంటున్నారు.
నితీష్ నాయకత్వంలోనే :
బీహార్ ఎన్నికలను ఎన్డీయే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలోనే ఎదుర్కొంటోందని సమస్త పూర్ లో జరిగిన సభలో నరేంద్ర మోడీ చెప్పారు. నితీష్ కుమార్ ఎన్నికల యుద్ధాన్ని ముందుండి నడిపిస్తారు అని ఆయన చెప్పారు. అదే సమయంలో ఎన్డీయే కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమార్ ని ప్రకటిస్తున్నట్లుగా ఎక్కడా ప్రకటించలేదు, పైగా జాగ్రత్తగానే మాట్లాడారు అని అంటున్నారు. అంటే నితీష్ కుమార్ కి ఉన్న చరిష్మాను ఎన్నికల వరకూ మాత్రమే ఉపయోగించుకోవాలని బీజేపీ డిసైడ్ అయింది అని అంటున్నారు. ఎన్నికల తరువాత మాత్రం బీజేపీ నుంచే సీఎం వచ్చేలా కమలనాధుల ప్లాన్ ఉందని అంటున్నారు.
అమిత్ షా అదే చెప్పారు :
ఇక కొద్ది రోజుల క్రితం ఒక చానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఇదే విషయం చెప్పారని అంటున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్ధిని ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశం నిర్ణయిస్తుంది అని ఆయన చెప్పుకొచ్చారు. ఇవన్నీ చూస్తూంటే నితీష్ కుమార్ ఈసారి సీఎం అయ్యే అవకాశాలు బాగా తగ్గిపోతున్నాయని అంటున్నారు. రెండు దశాబ్దాలుగా ఆయన సీఎం సీట్లో ఉండడం వల్ల ఆయన ఇమేజ్ క్రమంగా తగ్గిపోతోంది అని అంటున్నారు. దాంతో పాటు బీజేపీ ఆధిపత్యం బీహార్ ఎన్డీయేలో ఉందని అంటున్నారు. ఇక బీహార్ ఎన్నికలు అయితే హోరాహోరీగా సాగుతున్నాయి. ఎన్డీయే ఒకవేళ గెలిచినా సరే నితీష్ సీఎం అయ్యే అవకాశాలు లేవని స్పష్టంగా తేలిపోతోంది. చూడాలి మరి నితీష్ కి ఏమైనా వ్యూహాలు సొంతంగా ఉన్నాయో ఏమో.
