Begin typing your search above and press return to search.

బిహార్ ఎన్నికల్లో కొత్త వింత.. ఇక కూటమి ఎందుకు..?

ఇక కాంగ్రెస్‌ వైపు చూద్దాం. అసిత్‌ తివారీ ‘మేము సంకీర్ణ ధర్మం పాటిస్తాం’ అంటున్నారు. కానీ అదే ధర్మం ప్రకారం ముందు ప్రకటించిన సీట్లపై పోటీ నుంచి ఎందుకు వెనక్కి తగ్గలేకపోతున్నారు?

By:  Tupaki Political Desk   |   22 Oct 2025 3:00 PM IST
బిహార్ ఎన్నికల్లో కొత్త వింత.. ఇక కూటమి ఎందుకు..?
X

బిహార్‌.. ఈ పేరు వినగానే రాజకీయ చర్చలు మిన్నంటుతాయి. ఈ సారి బిహార్ ఎన్నికలు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మొదట ఓట్ చోరీతో మొదలైన ప్రతిపక్ష యుద్ధం పెద్దగా విజయం సాధించకుండానే ముగిసిపోయింది. కూటమిలో ఉన్న పార్టీల నుంచి ఒక్కో స్థానంలో ఇద్దరిద్దరు చొప్పున బరిలో నిలుస్తున్నారు. ఇక ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీ కూటమితో సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తోంది. ఎన్నికల వేదికపై రాజకీయ నాటకం కొత్త మలుపు తిరిగింది. ప్రజల ముందు ‘ఐక్యత’ పాట పాడుతున్న ఇండియా కూటమి లోపల మాత్రం కుర్చీల మధ్య ఫీట్లు చేస్తుంది. సీట్ల సర్దుబాటు అంటే ఇక్కడ రాజకీయ చర్చ కాదు.. అది ఒక అల్జీబ్రా సమీకరణం. ఇప్పుడు ఆ సమీకరణంలో మారిపోయే విలువల వల్లే కూటమి సూత్రం గణిత రీత్యా కాకుండా.. రాజకీయ రీత్యా కష్టతరంగా మారింది.

మహా గజిబిజిగా మారిన మహా గఠ్ బంధన్..

ఎన్నికల పోలింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ మహా గఠ్‌బంధన్‌ అంటే ‘మహా గజిబిజి’గా మారిపోతోంది. కూటమి పేరు పెద్దదే.. కానీ లోపల మాత్రం ఎవరిని నమ్మాలో నమ్మద్దో తెలియని పరిస్థితి. కాంగ్రెస్‌, ఆర్జేడీ, వామపక్ష పార్టీలు ఈ ముగ్గురు భాగస్వాములు ‘ఒకే వేదిక’ మీద ఉన్నా, ‘ఒకే అభ్యర్థి’ విషయంలో వేర్వేరు సీట్లు లెక్కపెడుతున్నారు. ఫలితంగా, బిహార్‌లో 8 స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులే పరస్పరం పోటీ పడే పరిస్థితి!

సొంత వారితోనే పోటీ..

ఒకప్పుడు ఈ కూటమి ‘మోడీని ఓడించాలి’ అని సపథం చేసింది. కానీ ఇప్పుడు ‘మోడీ’ పేరు పక్కనపెట్టి ‘మై సీట్‌ ఇజ్‌ మైన్‌’ అని యుద్ధం మొదలుపెట్టింది. ఆర్జేడీ నేత మృత్యుంజయ్‌ తివారీ చెప్పిన మాటలలోనూ ఆ స్వభావం స్పష్టంగా కన్పిస్తోంది. ‘మేమే పెద్ద పార్టీ, మాకు ఎక్కువ సీట్లు కావాలి.’ అది నిజమే కావచ్చు. కానీ పెద్ద అనేది సీట్ల సంఖ్యలో కాదు.. సహకార ధోరణిలో ఉండాలన్న విషయాన్ని నాయకులు ఎప్పుడో మరచిపోయారు.

కాంగ్రెస్ పరిస్థితి మరింత అగమ్య గోచరం..

ఇక కాంగ్రెస్‌ వైపు చూద్దాం. అసిత్‌ తివారీ ‘మేము సంకీర్ణ ధర్మం పాటిస్తాం’ అంటున్నారు. కానీ అదే ధర్మం ప్రకారం ముందు ప్రకటించిన సీట్లపై పోటీ నుంచి ఎందుకు వెనక్కి తగ్గలేకపోతున్నారు? అనేది చెప్పడం లేదు. ‘మేమే మొదట ప్రకటించాం’ అని చెబుతున్నారు. వినడానికి బాగానే ఉన్నా, అది పిల్లల ఆటలాగా మారింది. ‘ముందు నేను చెప్పా, కాబట్టి అది నాదే!’ అన్నట్టుగా వ్యవహరించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

సమాన గొడవలుగా మారుతున్న వైనం.

ఇప్పుడు ఈ కూటమిలోని భాగస్వామ్యాలు ‘సమాన హక్కులు’ కాదు, ‘సమాన గొడవలు’గా మారాయి. ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయి, ఎవరికి ప్రధానమంత్రి ఫోటో వెనుక ఉండే స్థానం వస్తుంది. ఇవే చర్చల కేంద్రం. ప్రజల సమస్యలు? అభివృద్ధి? అవన్నీ కూటమి ప్రకటనలో మచ్చుకైనా కనిపించడం లేదు.

వామపక్ష పార్టీల స్థితి మరింత విచిత్రం. వారు ‘సిద్ధాంతాలు’ అమ్ముతారు. కానీ ‘సీట్లు’ కొంటారు. ‘మేము వామపక్షం, మాకు ధర్మం ఉంది’ అంటూనే వారు అదే ధర్మాన్ని ఉల్లంఘిస్తూ అభ్యర్థులను ప్రకటించారు. ఈ నేపథ్యంలో బిహార్‌ ప్రజల మదిలో ఒకే ప్రశ్న ‘ఇండియా కూటమి ప్రజల కోసం పోటీ పడుతుందా, లేక పరస్పరం మీదే పోటీ పడుతుందా?’ అనేది చూడాలి.

నవంబర్ 6 వరకు ఎన్ని మార్పులు జరుగుతాయో..

నవంబరు 6, 11 తేదీల్లో పోలింగ్ ఉంటుంది. అంటే ఈ మధ్యకాలంలో ఇంకెన్ని సీట్లలో అభ్యర్థులు కుర్చీల ఆట ఆడుతారో చూడాలి. ఓట్ల లెక్కింపు నవంబరు 14న జరగనుంది. కానీ కూటమి లెక్కింపు ఇప్పటినుంచే మొదలైపోయింది. బిహార్‌ రాజకీయాలు మనకు ఒక పాఠం నేర్పుతాయి. ఇక్కడ ఎవరు శత్రువో, ఎవరు మిత్రుడో గుర్తించడం చాలా కష్టం.

ఈ సారి ఎన్నికలు ప్రజలకు ఉత్సాహం కల్పించేవిగా మారాయి. ఎందుకంటే రాజకీయ పార్టీల మధ్య ‘అస్తవ్యస్త యుద్ధం’ను వారు ఎంజాయ్ చేస్తున్నారు. నవంబరు 14న ఎవరు గెలుస్తారు.. ఎవరు ఓడుతారో చూడాలి. అంతవరకు కూటమి కాఫీ మీటింగ్స్‌కి, సీట్ల కౌంట్‌డౌన్‌కు, సైలెంట్‌ ఎండింగ్‌ ఉండదు. ఎందుకంటే బిహార్‌లో రాజకీయాలు ఎప్పుడూ ముగియవు.. అవి మొదలవుతూనే ఉంటాయి.