బీహార్ దంగల్: నితీష్‌కు 'సామ్రాట్' దెబ్బ.. ఏం జరుగుతోంది?
అయితే.. నిన్న మొన్నటి వరకు మహాఘఠ్ బంధన్‌లో సీఎం పోస్టు వ్యవహారం వివాదం రేపింది. దీనికి వ్యూహాత్మకంగా కాంగ్రెస్ తెరదించేసింది.
By: Garuda Media | 2 Nov 2025 7:00 AM ISTబీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు మరో వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. మొత్తం 243 అసెంబ్లీ సీట్లుఉన్న ఈ రాష్ట్రంలో విజయం దక్కించుకునేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘఠ్ బంధన్ తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. ఇక, బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి కూడా తన వ్యూహాలు తను వేస్తోంది. అయితే.. నిన్న మొన్నటి వరకు మహాఘఠ్ బంధన్‌లో సీఎం పోస్టు వ్యవహారం వివాదం రేపింది. దీనికి వ్యూహాత్మకంగా కాంగ్రెస్ తెరదించేసింది.
కూటమి అధికారంలోకి వస్తే.. ఆర్జేడీ యువ నాయకుడు, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ముఖ్యమంత్రి అవుతారని తేల్చి చెప్పి.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. ఆ వెంటనే ఎన్డీయే కూటమి కూడా అలెర్ట్ అయింది. తాము మరోసారి అధికారంలోకి వస్తే.. ప్రస్తుత ముఖ్యమంత్రి, సుశాసన్ బాబుగా పేరు తెచ్చుకున్న నితీష్‌కుమార్‌కే ముఖ్యమంత్రి పీఠం అప్పగిస్తామని స్వయంగా బీజేపీ అగ్రనాయకుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఇది ఎన్డీయే కూటమిలో ఉత్సాహం నింపింది.
ఇక, రెండు కూటములు ఉత్సాహంగా ప్రచారం చేసుకుంటున్న సమయంలో ఎన్డీయేలో అనూహ్య పరిణామం ఏర్పడింది. కీలకమైన ముజఫర్‌పూర్ నగర్ నియోజకవర్గంలో ప్రచారం చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత.. అమిత్ షా బాంబు పేల్చారు. ఎన్డీయే కూటమి అభ్యర్థిగా ఉన్న సామ్రాట్‌ను ఇప్పటికే డిప్యూటీ సీఎంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అంటే.. మరోసారి ఎన్డీయే కూటమి గెలిస్తే.. సీఎంగా నితీష్‌కుమార్.. డిప్యూటీ సీఎంగా సామ్రాట్ వ్యవహరిస్తారు. సామ్రాట్.. బీజేపీ నాయకుడు. పైగా ఆర్ ఎస్ ఎస్ వాదిగా గుర్తింపు ఉంది.
అయితే.. అమిత్‌షా మాత్రం.. ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే.. సామ్రాట్‌ను ప్రధాని మోడీ కీలకమైన పదవిలో కూర్చోబెడ తారంటూ.. కీలక ప్రకటన చేశారు. అంతేకాదు.. ''మీరంతా సామ్రాట్ జీని డిప్యూటీ సీఎంగా చూడాలని అనుకుంటున్నారు. కానీ, ప్రధాని ఆలోచన వేరేగా ఉంది. సామ్రాట్‌ను అంతకు మించిన(డిప్యూటీ సీఎం) అగ్రస్థానంలో కూర్చోబెట్టాలని ఆలోచన చేస్తున్నారు'' అని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారం రాజకీయంగా కాంగ్రెస్ కూటమికి అవకాశం కల్పించింది.
ఇప్పటి వరకు నితీష్‌ను ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిన ఎన్డీయే.. ఇప్పుడు సామ్రాట్‌ను తెరమీదికి తెచ్చిందని.. నితీష్ ఇక, ఆశలు వదులుకోవాల్సిందేనని ప్రచార పర్వంలో దంచికొడుతోంది. ఇది.. ఎన్డీయే కూటమిపై ప్రభావం చూపిస్తుందని పరిశీలకు లు చెబుతున్నారు. మరో వారం రోజులలోనే తొలిదశ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై నితీష్ కూడా అంతర్మథనంలో పడ్డారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
