Begin typing your search above and press return to search.

25 జిల్లాలు, 110 స్థానాలు, 1300 కి.మీ... రాహుల్ మ్యాజిక్ ఎక్కడ?

బీజేపీ, ఎన్నికల కమిషన్ పై రాహుల్ గాంధీ చేసిన "ఓట్ చోరీ" ఆరోపణ చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఆరోపణలను బీహార్ ఓటర్లు ఒప్పించడంలో విఫలమైనట్లు తాజా ఫలితాలు సూచిస్తున్నాయి.

By:  Raja Ch   |   14 Nov 2025 6:55 PM IST
25 జిల్లాలు, 110 స్థానాలు, 1300 కి.మీ... రాహుల్ మ్యాజిక్ ఎక్కడ?
X

బీహార్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ను ఊహించని దెబ్బ కొట్టాయనే చెప్పాలి. ఊహించని స్థాయిలో ఆ పార్టీ బీహార్ లో దెబ్బతింది! ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మ్యాజిక్ పై చర్చ మొదలైంది. ఒకటి కాదు రెండు కాదు 25 జిల్లాల్లో రాహుల్ గాంధీ పర్యటించారు. ఆ పర్యటనకు జనాలు ఎక్కువగానే హాజరయ్యారు.. అయినప్పటికీ ఆ ఉత్సాహం ఓట్ల రూపంలో కనిపించకపోవడం గమనార్హం.

అవును... ఈ ఏడాది ప్రారంభంలో బీజేపీ ఓట్లను దొంగిలించిందంటూ రాహుల్ గాంధీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. ఈ ఏడాది ఆగస్టులో ఓటరు అధికార్ యాత్రను చేపట్టారు. ససారాం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర పాట్నాలో ముగిసింది. ఈ క్రమంలో ఆయన 25 జిల్లాలో, 110 అసెంబ్లీ స్థానాల్లో సుమారు 1,300 కి.మీ. ప్రయాణించారు. దీంతో క్యాడర్ లో కొత్త ఉత్సాహం వచ్చినట్లు కనిపించింది.

ఇక్కడ గమనించాల్సిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... రాహుల్ గాంధీ పర్యటించిన ఈ మార్గంలోని ఒక్క నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ వైపు ఓటర్లు మొగ్గు చూపకపోవడం గమనార్హం! 61 సీట్లలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయగా... కేవలం ఐదు స్థానాల్లోనే ఆధిక్యంలో ఉన్న పరిస్థితి! దీంతో... రాహుల్ గాంధీ మ్యాజిక్ పై అటు పార్టీలోనూ ఇటు పొలిటికల్ సర్కిల్స్ లోనూ చర్చ మొదలైంది.

బీజేపీ, ఎన్నికల కమిషన్ పై రాహుల్ గాంధీ చేసిన "ఓట్ చోరీ" ఆరోపణ చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఆరోపణలను బీహార్ ఓటర్లు ఒప్పించడంలో విఫలమైనట్లు తాజా ఫలితాలు సూచిస్తున్నాయి.

పూర్తిగా రాహుల్ ని తప్పు పట్టాలా?:

బీహార్‌ లో మహాఘఠ్ బంధన్ నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ పర్యటన పెర్ఫార్మెన్స్ ఒకెత్తు అయితే... అక్కడ కూటమి ఐక్యత లేకపోవడం ప్రత్యర్థికి అనుకూలంగా మారిందని అంటున్నారు. ఇందులో ప్రధానంగా... ఆర్జేడీకి చెందిన తేజస్వి యాదవ్‌ ను తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆమోదించడానికి కాంగ్రెస్ సంకోచించడం కూడా ఒకటని చెబుతున్నారు. ఇదే సమయంలో.. ఉమ్మడి వ్యూహం లేకపోవడం కూడా మరో ప్రధాన కారణం అని అంటున్నారు.

అందువల్లే... 2023 తెలంగాణ ఎన్నికల్లోనూ, 2024 లోక్ సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడానికి ఆయన యాత్రలు దోహదపడ్డాయని ఆ పార్టీ పెద్దలు భావించినట్లుగానే.. బీహార్ లోనూ ఆయన యాత్రలు కార్యకర్తల్లో కొంత ఉత్సాహం నింపినప్పటికీ... ప్రచారం ముగిసే సమయానికి అదికాస్తా నీరుగారిందని.. అందుకు పైన చెప్పుకున్న రెండూ కారణాలు కావొచ్చని చెబుతున్నారు.