Begin typing your search above and press return to search.

90% కోటీశ్వరులు.. 53% క్రిమినల్ కేసులున్నవారు.. బీహార్ లో అంతేనా..?

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   16 Nov 2025 6:00 PM IST
90% కోటీశ్వరులు..  53% క్రిమినల్  కేసులున్నవారు.. బీహార్  లో అంతేనా..?
X

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో 202 స్థానాలు సంపాదించి చరిత్ర సృష్టించింది. మహాగఠ్ బంధన్ ను చతికిలపడేసింది. ఈ సమయంలో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... ఈ ఎమ్మెల్యేల్లో 90% మంది కోటీశ్వరులు కాగా.. 130 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి!

అవును... బీహార్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో రెండు కూటముల నుంచి గెలిచిన మొత్తం 243 మంది ఎమెల్యేల ఆర్థిక పరిస్థితి, క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ కు సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫామ్స్ (ఏడీఆర్) నివేదిక తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా ఎన్నికైన ఎమ్మెల్యేల క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ పై షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ఈ విషయం సంచలనంగా మారింది.

130 మందిపై క్రిమినల్ కేసులు!:

ఏడీఆర్ నివేదిక ప్రకారం బీహార్ ఎన్నికల్లో గెలిచిన 243 మంది ఎమ్మెల్యేల్లో సుమారు 130 (50%) మందిపై క్రిమినల్ కేసులు ఉండగా... అందులో 102 (42%) మందిపై సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నాయి. అయితే... 2020తో పోలిస్తే ఈ సంఖ్య కాస్త తక్కువనే చెప్పాలి. ఆ దఫా విశ్లేషించబడిన 241 మందిలో 163 (68%) ఎమ్మెల్యేలు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారు! ఇదే క్రమంలో... 123 (51%) మంది తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలిపారు.

హత్యా, హత్యాయత్నానికి సంబంధించి పాతిక మంది!:

ఇదే సమయంలో హత్యకు సంబంధించిన కేసులు ప్రకటించి గెలిచిన అభ్యర్థులు ఆరు మంది ఉన్నారు. వీరంతా తమపై హత్యకు సంబంధించిన కేసులు (ఐపీసీ సెక్షన్ 302) ఉన్నట్లు ప్రకటించుకున్నారు. ఇదే సమయంలో.. గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలు తమపై హత్యాయత్నానికి సంబంధించిన కేసులు (ఐపీసీ సెక్షన్ 307) ఉన్నట్లు ప్రకటించారు. ఇదే క్రమంలో గెలిచిన 9 మంది అభ్యర్థులు తమపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులున్నట్లు ప్రకటించారు.

పార్టీల వారీగా క్రిమినల్, తీవ్రమైన క్రిమినల్ కేసులు!:

పార్టీల వారీగా క్రిమినల్ కేసులు, తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థుల విషయనికొస్తే...

* బీజేపీ నుంచి గెలిచిన 89 మంది అభ్యర్థుల్లో 54 మందిపై క్రిమినల్ కేసులు, అందులో 43 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి.

* జేడీ(యూ) నుంచి గెలిచిన 85 మంది అభ్యర్థుల్లో 31 మందిపై క్రిమినల్ కేసులో, అందులోని 23 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి.

* ఆర్జేడీ నుంచి గెలిచిన 25 మంది అభ్యర్థుల్లో 18 మందిపై క్రిమినల్ కేసులు, అందులోని 14 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి.

* లోక్ జనశక్తి పార్టీ (ఆర్వీ) నుంచి గెలిచిన 19 మంది అభ్యర్థుల్లో 11 మందిపై క్రిమినల్ కేసులు, అందులోని 10 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి.

* కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 6 మంది అభ్యర్థుల్లో 4 మందిపై క్రిమినల్ కేసులు ఉండగా.. అందులోని ముగ్గురుపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి.

* ఎంఐఎం పార్టీ నుంచి గెలిచిన 5 మంది అభ్యర్థుల్లో ఐదుగురి పైనా క్రిమినల్ కేసులు ఉండగా.. అందులోని 4 గురిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి.

ఎమ్మెల్యేల ఆర్థిక నేపథ్యం!:

బీహార్ ఎన్నికల్లో ఎన్నికైన 243 మంది అభ్యర్థుల్లోనూ 218 (90%) మంది కొటీశ్వరులు కాగా... వీరి సగటు ఆస్తులు రూ.9.02 కోట్లు. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో విశ్లేషించబడిన 241 మందిలో 194 (81%) మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులు. నాడు వారి సగటు ఆస్తులు రూ.4.32 కోట్లు.

పార్టీల వారీగా గెలిచిన కోటీశ్వరులు!:

బీజేపీ నుంచి గెలిచిన 89 మందిలో 77 మంది.. జేడీ(యూ) నుంచి గెలిచిన 85 మందిలో 78 మంది.. ఆర్జేడీ నుంచి గెలిచిన 25 మందిలో 24 మంది.. లోక్ జనశక్తి పార్టీ (ఆర్వీ) నుంచి గెలిచిన 19 మందిలో 16 మంది.. కాంగ్రెస్ నుంచి గెలిచిన 6 మందిలో ఆరుగురూ.. ఎంఐఎం నుంచి గెలిచిన ఐదుగురిలో ఐదుమందీ కొటీశ్వరులుగా ఉన్నారు.

విద్యార్హతల వివరాలు!:

ఇక గెలిచిన అభ్యర్థుల విద్యార్హతల వివరాల విషయానికొస్తే... మొత్తం 243 మందిలో 84 మంది అభ్యర్థులు తమ విద్యార్హత 5వ తరగతి నుంచి 12వ తరగతి అని ప్రకటించగా... 147 మంది గ్రాడ్యుయేట్ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్థత కలిగి ఉన్నట్లు ప్రకటించారు. ఇక మిగిలినవారిలో 5 మంది డిప్లమో హోల్డర్లు కాగా.. 7 మంది అభ్యర్థులు మాత్రం కేవలం అక్షరాస్యులమని మాత్రమే ప్రకటించారు.