బిహార్ ఎన్నికలు: మజ్లిస్ కంటే ఒక్క సీటు ఎక్కువా రాహుల్?
వందేళ్లకు పైనే చరిత్ర ఉన్న రాజకీయ పార్టీ ఇప్పుడు ఆస్తిత్వం కోసం పోరాడే పరిస్థితికి వచ్చింది.
By: Garuda Media | 15 Nov 2025 9:44 AM ISTవందేళ్లకు పైనే చరిత్ర ఉన్న రాజకీయ పార్టీ ఇప్పుడు ఆస్తిత్వం కోసం పోరాడే పరిస్థితికి వచ్చింది. గతంలో ఎప్పుడూ ఇంతటి దారుణ పరిస్థితిని ఎదుర్కొన్నది లేదు. జాతీయ పార్టీగా.. ఈ దేశాన్ని అత్యధిక కాలం పాలించిన పార్టీగా పేరున్న కాంగ్రెస్ ఇప్పుడు ఉనికి కోసం ప్రాకులాడే దుస్థితికి వచ్చింది. తాజాగా బిహార్ లో వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ముస్లిం ఓటర్లే లక్ష్యంగా పెట్టుకొని రాజకీయాలు చేసే మజ్లిస్ లాంటి పార్టీ ఐదు స్థానాల్ని సొంతం చేసుకుంటే.. ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ ఆరు స్థానాల్లోనే విజయం సాధించింది.
ఇదొక్కటి చాలు.. తాజాగా కాంగ్రెస్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పేందుకు బిహార్ ఎన్నికల ఫలితాలు సరిపోతాయి. రాహుల్ గాంధీ నాయకత్వంలో ఆయన పేలవమైన ప్రదర్శనను ప్రదర్శిస్తున్నారు. వాస్తవానికి దూరంగా ఉండే అంచనాలతో పాటు.. ఇప్పటి రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని రీతిలో వ్యవహరిస్తున్న ఆయన కారణంగా.. తరచూ ఎదురుదెబ్బలు తగులుతున్న పరిస్థితి.
పాత సినిమా పాట ఒకటుంది. పుట్టింటోళ్లు తరిమేశారు.. కట్టుకున్నోడు వదిలేశాడు అని. కాంగ్రెస్ పరిస్థితి ఇప్పుడు అచ్చంగా అలానే ఉంది. ఆ పార్టీకి సంప్రదాయంగా ఉండే మైనార్టీ.. మహిళలు తమ వైపే ఉంటారని..తమ కూటమికే ఓటు వేస్తారన్న కాకి లెక్కలు అక్కరకు రాకుండా పోయాయి. కాంగ్రెస్ అంచనాలకు.. వాస్తవానికి మధ్య ఉన్న అంతరం ఎంత ఎక్కువన్న విషయాన్ని గణాంకాలు ఇట్టే చెప్పేస్తాయి.
దీనికి తోడు ప్రజల్లో తనకున్న పరపతి ఎంతన్న విషయాన్ని కాంగ్రెస్ గుర్తించే విషయంలో వెనుకబడటం కూడా ఈ ఘోర పరాజయానికి మరో కారణంగా చెప్పాలి. మహాగఠ్ బంధన్ అంటూ తమ కూటమికి డాబుసరి పేరు పెట్టుకుంటే సరిపోదు. అందుకు తగ్గట్లే వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కూటమిగా ఉన్న పార్టీతో సీట్ల పంచాయితీ.. కొన్నిచోట్ల పోటాపోటీగా కాంగ్రెస్.. ఆర్జేడీలు ఒకే స్థానంలో తమ అభ్యర్థుల్ని నిలపటంతో రెండింటి చెడ్డ రేవడి పరిస్థితి అటు కాంగ్రెస్ కు.. ఇటు ఆర్జేడీకి ఎదురైంది. వీరిద్దరి మధ్య ఓట్లు చీలి.. ఎన్డీయే కూటమి లాభపడింది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే విషయంలో ఆలస్యం చేయటం.. కాంగ్రెస్.. ఆర్జేడీ అగ్రనేతల సమన్వయ లోపం కూడా మహాగఠ్ బంధన్ కొంప ముంచింది. దీనంతటికి రాహుల్ గాంధీని బాధ్యుడ్ని చేయాలా? అంటే చేయకూడదా? అన్న ప్రశ్న అంతే వేగంగా వచ్చే పరిస్థితి. అవునన్నా.. కాదన్నా ఆర్జేడీతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ పెద్దది. బిహార్ లో ఆ పార్టీకి అంత బలం ఉందా? లేదా? అన్నది పక్కన పెడితే.. వాస్తవ కోణంలో పరిస్థితుల్ని గుర్తించి.. కొన్నిసందర్భాల్లో వెనక్కి తగ్గటం వల్ల పోయేదేమీ ఉండదు. అలా కాకుండా మొండిగా పోటీకి పెట్టటం ద్వారా ఇప్పుడు సాధించింది కూడా ఏమీ లేదు కదా?
బిహార్ లో పది కోట్ల మంది జనాభాలో 1.75 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. అంటే జనాభాలో 17.7 శాతం ఉన్న ముస్లింలు మహాగఠ్ బంధన్ కు ఓటేసే కన్నా.. అధికార ఎన్డీయే కూటమికి మొగ్గు చూపటం గమనార్హం. దీంతో ఓట్లు భారీగా చీలి మహాగఠ్ బంధన్ విజయవకాశాలు పూర్తిగా సన్నగిల్లేలా చేశారు. బిహార్ లోని 243 నియోజకవర్గాల్లో 87 స్థానాల్లో ముస్లింల ప్రాబల్యం ఎక్కువ. ఈ కారణంతోనే 20 నియోజకవర్గాల్లో ముస్లింలకు మహాగఠ్ బంధన్ కూటమి సీట్లు ఇచ్చింది. కానీ.. వాటిల్లో గెలిచింది ఐదు స్థానాలు మాత్రమే.
ఇదే సమయంలో హైదరాబాద్ కేంద్రంగా పని చేసే మజ్లిస్ పార్టీ బిహార్ లో 25 స్థానాల్లో తన అభ్యర్థుల్ని బరిలో నిలిపింది. ఆసక్తికరంగా ఐదు స్థానాల్లో విజయం సాధించింది. ఈ స్థానాలన్నీ ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే సీమాంచల్ లోనే కావటం విశేషం.
ఇదంతా చూస్తే.. కాంగ్రెస్, ఆర్జేడీ లాంటి దిగ్గజ పార్టీలు కలిసి 20 నియోజకవర్గాల్లో ముస్లిం అభ్యర్థులకు సీట్లు ఇస్తే గెలిచిన సీట్లకు సమానంగా హైదరాబాద్ కేంద్రంగా రాజకీయాలు చేసే మజ్లిస్ ఈ రెండు పార్టీలకు సమానంగా ఐదు స్థానాల్లో విజయం సాధించిన తీరు చూస్తే.. కాంగ్రెస్ అగ్రనాయకత్వ వ్యూహాత్మక లోపాలు ఇట్టే అర్థమవుతాయి. ఇప్పటికైనా వాస్తవ పరిస్థితుల్ని గుర్తించి.. అందుకు తగ్గట్లు ఎజెండా సెట్ చేసుకోవాల్సిన అవసరం రాహుల్ మీద ఉంది. లేదంటే.. ఆయన పరాజయాల పరంపర త్వరలోనే సెంచరీకి చేరుకోవటం ఖాయం.
