Begin typing your search above and press return to search.

చిత్రమైన ఓటు షేరు.. ఎక్కువ ఓట్లు వచ్చినా సీట్లు రాలేదే..?

ఇక 22.85 శాతం ఓట్లు తెచ్చుకున్న ఆర్జేడీ.. సీట్ల పరంగా చాలా వెనకబడింది. 143 స్థానాల్లో పోటీ చేసి కేవలం 25 చోట్ల మాత్రమే గెలిచింది.

By:  Tupaki Political Desk   |   14 Nov 2025 6:55 PM IST
చిత్రమైన ఓటు షేరు.. ఎక్కువ ఓట్లు వచ్చినా సీట్లు రాలేదే..?
X

బిహార్ ఎన్నికల్లో ప్రజలు చిత్రమైన తీర్పునిచ్చారు. ఈ ఎన్నికల్లో అత్యధిక సీట్లు తెచ్చుకున్న పార్టీలు కన్నా, ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న పార్టీగా ఆర్జేడీ నిలిచింది. బిహార్ ఎన్నికల్లో మొత్తం 17 పార్టీలు పోటీ చేశాయి. ఇందులో గుర్తింపు పొందిన జాతీయ పార్టీలతోపాటు ప్రాంతీయ పార్టీలు, చిన్నాచితక పార్టీలు అనేకం ఉన్నాయి. 243 స్థానాలు ఉన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి వర్సెస్ మహాగట్ బంధన్ మధ్య పోటీ జరిగింది. ఎన్డీఏ కూటమిలో బీజేపీ, జేడీయూ, లోక్ జనశక్తి (రామ్ విలాస్ పాశ్వన్), హెచ్ఎంఎస్ వంటి పార్టీలు ఉండగా, మహాగట్ బంధన్ లో ఆర్జేడీ, కాంగ్రెస్, వీఐపీ పార్టీలతోపాటు కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి.

అయితే తాజా ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ, జేడీయూ కన్నా ఆర్జేడీకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఎన్నికల సంఘం ప్రకటించిన ఓట్ల శాతం పరిశీలిస్తే ఈ విషయం చాలా స్పష్టంగా అర్థం అవుతోంది. ఎన్నికల సంఘం 17 గుర్తింపు పొందిన పార్టీల ఓట్ల శాతాన్ని తన అధికారిక వెబ్ సైటులో వెల్లడించింది. ఈ 17 పార్టీల్లో అత్యధికంగా ఆర్జేడీ ఎక్కువ ఓట్ల శాతంతో తొలిస్థానంలో నిలిచింది. మొత్తం 143 స్థానాల్లో పోటీ చేసిన ఆర్జేడీ 22.85 శాతం ఓట్లతో మిగిలిన పార్టీలకన్నా మెరుగైన స్థితిలో నిలిచింది. ఆర్జేడీ తర్వాత బీజేపీ 20.31 శాతం, జేడీయూ 19.12 శాతం ఓట్లతో రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ రెండు పార్టీలు చెరో 101 స్థానాల్లో పోటీ చేశాయి.

ఇక 22.85 శాతం ఓట్లు తెచ్చుకున్న ఆర్జేడీ.. సీట్ల పరంగా చాలా వెనకబడింది. 143 స్థానాల్లో పోటీ చేసి కేవలం 25 చోట్ల మాత్రమే గెలిచింది. ఇక ఆర్జేడీ కన్నా తక్కువ ఓట్లు తెచ్చుకున్న బీజేపీ, జేడీయూ మాత్రం గణనీయమైన రీతిలో సీట్లు సాధించాయి. బీజేపీ 101 చోట్ల పోటీ చేస్తే కేవలం 20.31 శాతం ఓట్లతో 91 చోట్ల గెలుపొందింది. అదే సమయంలో జేడీయూ సైతం 101 స్థానాల్లో పోటీ చేసిన 19.12 శాతం ఓట్లు తెచ్చుకుని 83 స్థానాల్లో గెలుపొందింది. ఓట్లు ఎక్కువ వచ్చినా ఆర్జేడీకి సీట్లు రాకపోవడమే అంతుచిక్కడం లేదు. ఇక ఎన్డీఏ కూటమి తరఫున పోటీ చేసిన ఎల్జేపీ (పాశ్వన్) పార్టీకి 5.03 శాతం ఓట్లు వచ్చాయి. ఈ పార్టీ 26 చోట్ల విజయం సాధించడం విశేషం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 8 శాతం ఓట్లు సాధించినా పెద్దగా సీట్లు తెచ్చుకోలేకపోయింది. బిహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 6 చోట్ల మాత్రమే గెలిచింది.

ఇదే సమయంలో చెరో ఐదు చోట్ల గెలుచుకున్న ఎంఐఎం, హెచ్ఏఎంఎస్ కూడా పెద్దగా ఓట్లు సాధించలేదు. కానీ సీట్లు సాధించి తమ సత్తా చాటాయి. ఇక బిహార్ ఎన్నికల్లో ఇతరులు తొమ్మిది చోట్ల గెలుపొందారు. కాగా, ఆర్జేడీ, బీజేపీ, జేడీయూకి తప్పించి మరే పార్టీ డబుల్ డిజిట్ లో ఓట్ల శాతం నమోదు చేసుకోలేకపోయింది. మహాగట్ బంధన్ లో పోటీ చేసిన సీపీఐ(ఎం) 0.62 శాతం, సీపీఐ(ఎంఎల్)(ఎల్) 2.89 శాతం, సీపీఐ 0.74 శాతం ఓట్లు తెచ్చుకున్నాయి. ఒకప్పుడు బిహార్ లో ఎంతో శక్తివంతమైన పాత్ర పోషించిన కమ్యూనిస్టులు ఈ ఎన్నికతో ప్రభావం కోల్పోయినట్లు స్పష్టమైందని అంటున్నారు.


https://results.eci.gov.in/ResultAcGenNov2025/index.htm