ఆ పోలీసు అధికారి ఇంట్లో పనిమనిషికి రూ.కోటి ఇల్లు
బిహార్ లోని కిషన్ గంజ్ డీఎస్పీగా వ్యవహరించే గౌతం కుమార్ అనే పోలీసు అధికారిపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తున్న వేళ.. ఎకనామిక్ అఫెన్సెస్ యూనిట్ అధికారుల తనిఖీలు నిర్వహించారు.
By: Garuda Media | 6 April 2026 12:55 PM ISTఅవును.. మీరు చదివింది అక్షరాల నిజం. ఒక పోలీసు అధికారి ఇంట్లో పని చేసే పనిమనిషికి రూ.కోటి విలువ చేసే ఇల్లు ఉండటమే కాదు.. విలాసవంతమైన థార్ కారు ఉండటం ఆర్థిక నేరాల నియంత్రణ శాఖ అధికారులకు సైతం దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేంత షాకిచ్చింది. బిహార్ లో వెలుగు చూసిన ఈ భాగోతం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. బిహార్ లోని ఒక పోలీసు అధికారి అక్రమ సంపాదన ఏ స్థాయిలో ఉంది? అన్న దానికి ఈ ఉదంతం ఒక ఉదాహరణగా చెబుతున్నారు. ఆయన ఇంట్లో ఉండే పనిమనిషే అత్యంత లగ్జరీగా బతకటం గమనార్హం. సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..
బిహార్ లోని కిషన్ గంజ్ డీఎస్పీగా వ్యవహరించే గౌతం కుమార్ అనే పోలీసు అధికారిపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తున్న వేళ.. ఎకనామిక్ అఫెన్సెస్ యూనిట్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు విస్మయానికి గురి చేసే అంశాల్ని గుర్తించారు. మార్చి 31న తనిఖీలు నిర్వహించగా.. ఆ వివరాలు కాస్త ఆలస్యంగా బయటకు వచ్చాయి. ఏకకాలంలో నిర్వహించిన సోదాల్లో ఆయనకు బిహార్ తో పాటు పశ్చిమ బెంగాల్.. నోయిడాల్లోనూ ఆస్తులు కూడబెట్టినట్లుగా గుర్తించారు. పెద్ద ఎత్తున ఆస్తులు.. ఖరీదైన బంగారు ఆభరణాలతో పాటు విలాసవంతమైన వాచ్ లు ఆయన కొన్నట్లుగా గుర్తించారు. వీటి విలువ దాదాపు రూ.80 కోట్లకు పైనే ఉంటుందని గుర్తించారు.
సదరు పోలీసు అధికారి తన 32 ఏళ్ల సర్వీసులో ఆయనకు వచ్చిన జీతం కంటే 60 శాతం అధికంగా సంపాదించినట్లుగా అంచనావేశారు. సోదాల వేళ.. ఆయన ఇంట్లో పని చేసే పనిమనిషి పారో అనే మహిళ ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా షాకింగ్ నిజాలు గుర్తించారు. ఆ పనిమనిషిది పశ్చిమబెంగాల్ లోని మాల్దా కాగా.. అదే రాష్ట్రంలోని ఉత్తర దినాజ్ పూర్ లో ఆమెకు రూ.కోటి విలువ చేసే బంగ్లా ఉందన్న విషయాన్ని గుర్తించారు. రూ.35 లక్షలు విలువ చేసే థార్ కారులో తిరుగుతుంటారని తేల్చారు.
ఆమెకు గౌతం కుమార్ బుల్లెట్ మోటారు సైకిల్ ను గిఫ్టుగా ఇచ్చారని.. సోదాల్లో రూ.6 లక్షలు విలువ చేసే నెక్లస్ దొరికింది. ఇన్ స్టాలో ఆమె యాక్టివ్ గా ఉండటాన్ని గుర్తించారు. సదరు అధికారి ఆస్తుల లెక్క తవ్వే కొద్దీ కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఆయన భార్య ప్రభుత్వ టీచర్ అయినప్పటికి అందుకు సంబంధం లేని విధంగా లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నట్లు గుర్తించారు. ఇక.. గౌతం కుమార్ గర్ల్ ఫ్రెండ్ కూడా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నట్లుగా గుర్తించారు. ఈ అధికారి కేసు విచారణ సాగుతున్న కొద్దీ.. కొత్త విషయాలు బయటకు వస్తూ సంచలనంగా మారింది.
