వైరల్ టాపిక్... డాగ్ బాబు సన్నాఫ్ కుట్టా బాబు!
ఇటీవల మధ్యప్రదేశ్ కు చెందిన ఓ రైతు వార్షిక ఆదాయం కేవలం మూడు రూపాయలుగా పేర్కొంటూ అధికారులు ఆదాయ ధ్రువపత్రం జారీ చేసిన సంగతి తెలిసిందే.
By: Raja Ch | 29 July 2025 11:00 AM ISTఇటీవల మధ్యప్రదేశ్ కు చెందిన ఓ రైతు వార్షిక ఆదాయం కేవలం మూడు రూపాయలుగా పేర్కొంటూ అధికారులు ఆదాయ ధ్రువపత్రం జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో ‘రాష్ట్ర గుర్తింపు రిజిస్ట్రీ’ (ఎస్.ఐ.ఆర్.) కింద ఓటర్ల జాబితాలను సవరించడానికి రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో బీహార్ లో ఒక వింత సంఘటన జరిగింది. ఇందులో భాగంగా. కుక్కకు నివాస ధృవీకరణ పత్రం గుర్తింపు ఇచ్చారు అధికారులు!
అవును... బీహార్ లోని పాట్నా సమీపంలోని మసౌర్హి పట్టణంలోని రైట్ టు పబ్లిక్ సర్వీసెస్ (ఆర్.టీ.పీ.ఎస్.) పోర్టల్ లో "డాగ్ బాబు" పేరుతో నివాస ధృవీకరణ పత్రం దర్శనమిచ్చింది! ఆ పత్రంలో ఆ డాగ్ బాబుకు తండ్రి పేరు 'కుట్ట బాబు', తల్లి పేరు 'కుతియా దేవి' అని ఉండటంతో పాటు ఓ కుక్క ఫోటో కూడా ఉంది. ఈ క్రమంలో... కౌలిచక్, వార్డ్ నంబర్ 15, నగర్ పరిషత్ మసౌర్హి అని అడ్రస్ కూడా ఉంది.
మరింత షాకింగ్ విషయం ఏమిటంటే... ఆ సర్టిఫికెట్ లో రెవెన్యూ అధికారి మురారి చౌహాన్ (సర్టిఫికెట్ నం. బీ.ఆర్.సీ.సీ.ఓ/2025/15933581) డిజిటల్ సంతకం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ సర్టిఫికెట్ వైరల్ గా మారింది. మరోవైపు ఈ వ్యవహారం పై ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాయి విపక్షాలు! ఇందులో భాగంగా.. ఈ కుక్క వచ్చి బీజేపీకి ఓటు వేస్తుంది అంటూ పొలిటికల్ సెటైర్లు పడుతున్నాయి.
ఈ నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇందులో భాగంగా... మసౌర్హి జోన్ లో 'డాగ్ బాబు' పేరుతో నివాస ధృవీకరణ పత్రం జారీ చేసిన కేసు వెలుగులోకి వచ్చిందని.. ఈ విషయం తమ దృష్టికి వచ్చిన క్షణంలోనే, సర్టిఫికేట్ రద్దు చేయబడిందని ఆ ప్రకటనలో పేర్కొంది.
మరోవైపు.. దరఖాస్తుదారుడు, కంప్యూటర్ ఆపరేటర్, సర్టిఫికేట్ జారీ చేసిన అధికారిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయబడుతోందని వెల్లడించింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి 24 గంటల్లోగా నివేదిక సమర్పించాలని మసౌర్హి సబ్ డివిజనల్ అధికారిని కోరడం జరిగిందని... దోషులుగా తేలిన వారిపై కఠినమైన శాఖాపరమైన, క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని తెలిపింది.
ఈ నేపథ్యంలోనే... బీహార్ లో అంతే, బీహార్ లో అంతే అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు! ఇది అధికారుల పరిపూర్ణమైన నిర్లక్ష్యానికి పరాకాష్ట అని స్పందిస్తున్నారు!
