'కాక్రోచ్ కేఫ్'.. అబ్బా ఏం వాడకంరా బాబు.. సోషల్ మీడియాలో ట్రెండింగ్.. నెటిజన్ల ఫన్నీ కామెంట్స్
సోషల్ మీడియా యుగంలో ఎప్పుడు ఏ పదం వైరల్ అవుతుందో దాన్ని ఎవరు ఎలా క్యాష్ చేసుకుంటారో చెప్పడం కష్టం.
By: A.N.Kumar | 3 Aug 2026 1:18 AM ISTసోషల్ మీడియా యుగంలో ఎప్పుడు ఏ పదం వైరల్ అవుతుందో దాన్ని ఎవరు ఎలా క్యాష్ చేసుకుంటారో చెప్పడం కష్టం. దేశవ్యాప్తంగా ఏదైనా ఒక అంశం బాగా చర్చనీయాంశంగా మారితే దాన్నే తమ వ్యాపారానికి ప్రచార ఆయుధంగా మార్చుకునే తెలివైన వ్యాపారులు ఎంతోమంది ఉంటారు. తాజాగా బీహార్‌లోని నలంద జిల్లాకు చెందిన ఒక వ్యాపారి సరిగ్గా ఇదే పని చేశాడు. ఇటీవల 'సీజేపీ' వ్యవహారంలో "కాక్రోచ్" అనే పదం దేశమంతటా విపరీతంగా ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రేజ్‌ను గమనించిన సదరు వ్యాపారి తన కొత్త హోటల్‌కు ఏకంగా "కాక్రోచ్ కేఫ్" అని పేరు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఉచిత ప్రచారం కోసం 'వైరల్' మార్కెటింగ్ వ్యూహం
సాధారణంగా కేఫ్‌లు, హోటళ్లకు శుభ్రతను, రుచిని సూచించే అందమైన పేర్లు పెడుతుంటారు. కానీ బొద్దింక పేరుతో కేఫ్ ప్రారంభించడమనేది వినడానికే కాస్త వింతగా ఉంది కదూ.. సరిగ్గా ఈ ఆశ్చర్యమే తన బిజినెస్‌కు ప్లస్ పాయింట్ అవుతుందని ఆ యజమాని భావించాడు. కేఫ్ యజమాని మాటల్లో "ప్రస్తుతం దేశమంతా 'కాక్రోచ్' అనే పదం గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రత్యేకంగా డబ్బులు ఖర్చు పెట్టి యాడ్స్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఈ ఒక్క పేరుతోనే అందరి దృష్టిని ఆకర్షించవచ్చని భావించాను. నా ఆలోచన ఫలించింది" అని పేర్కొన్నాడు. ఈ కేఫ్ బోర్డు చూసిన స్థానికులు, బాటసారులు ఆశ్చర్యపోతూ ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఈ 'కాక్రోచ్ కేఫ్' నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
సోషల్ మీడియాలో నెటిజన్ల ఫన్నీ కామెంట్స్
ఈ వార్త వైరల్ అవ్వడంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. "ఒకవేళ హోటల్ ఫుడ్‌లో నిజంగానే కాక్రోచ్ కనిపించినా... 'బోర్డుపై ముందే రాశాం కదా' అంటారు తప్ప కంప్లైంట్ చేసే ఛాన్స్ ఉండదేమో" అని ఒకరు కామెంట్ చేశారు. "ఇలాంటి మార్కెటింగ్ ఐడియాలు బిహారీలకు మాత్రమే సాధ్యం. పేరు భయపెడుతున్నా, లోపల హోటల్ మాత్రం చాలా క్లీన్‌గా ఉంది" అని మరొకరు ప్రశంసించారు. "పేరు వినగానే ఒకసారి వెళ్లి అక్కడ ఏం దొరుకుతుందో చూడాలనే కుతూహలం కలుగుతోంది" అని కొందరు సరదాగా స్పందించారు.
వినూత్న ఆలోచనలకు 'సోషల్' పవర్
ఈ రోజుల్లో వ్యాపారం సక్సెస్ కావడానికి క్వాలిటీతో పాటు 'యూనిక్ మార్కెటింగ్' కూడా చాలా ముఖ్యం. బిహార్‌లోని ఈ కేఫ్ యజమాని వైరల్ ట్రెండ్‌ను తెలివిగా వాడుకొని రూపాయి ఖర్చు లేకుండా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. పేరు వింతగా ఉన్నప్పటికీ ఈ డిఫరెంట్ ఐడియానే ఇప్పుడు ఆయన కేఫ్‌కు కస్టమర్ల క్యూ కట్టేలా చేస్తోంది. పబ్లిసిటీకి ఇది నిజంగా ఒక కొత్త ఉదాహరణే..
