Begin typing your search above and press return to search.

బీహార్ సామ్రాట్ పీఠం కదులుతుందా ?

ఇక బీహార్ లో ఎన్నికలు 2025 నవంబర్ లో జరిగాయి. ఇంకా ఏడాది కూడా కాలేదు, ఇద్దరు సీఎంలు మారారు.

By:  Satya P   |   9 Aug 2026 9:49 AM IST
బీహార్ సామ్రాట్ పీఠం కదులుతుందా ?
X

బీజేపీకి బీహార్ లో ఇటీవల జరిగిన బకీంపూర్ ఉప ఎన్నికల ఫలితం భారీ షాక్ ఇచ్చింది. తాము అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాలేదు. గతంలో ఏకంగా 63 శాతం ఓట్లతో 52 వేల ఓట్ల భారీ మెజారిటీతో బీజేపీ గెలిచిన సీటు అది. అంతే కాదు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అయిదు సార్లు ఎమ్మెల్యే అయిన సీటు అది. అలాంటి చోట అసలు ఏ మాత్రం పార్టీ బలం లేని ప్రశాంత్ కిశోర్ గెలిచి బీజేపీకి సవాల్ చేశారు. ఆయన పార్టీకి 19 వేల ఓట్ల మెజారిటీ వస్తే బీజేపీకి మొత్తం ఓట్లలో 34 శాతమే దక్కడం మరో అవమానంగా చెబుతున్నారు. ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే ఇక్కడ జెండా పాతి బీజేపీకి చేదు అనుభవం ఏంటో రుచి చూపించారు అని అంటున్నారు.

మూడు నెలలలోనే :

ఇక బీహార్ సీఎం గా సామ్రాట్ చౌదరి మేలో పీఠం ఎక్కారు. ఆయన ముఖ్యమంత్రిగా మూడు నెలల పాలన మీద బకీంపూర్ ఓటర్ల తీర్పు ఒక రెఫరెండం అని అంటున్నారు. ఆయన పాలన బాగా లేదని కూడా ఇప్పటికే విశ్లేషణలు వస్తున్నాయి. అసలు ఆయనను బీజేపీ అధినాయకత్వం ఎందుకు ఎంపిక చేసింది అన్న ప్రశ్నలు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి. ఆయన ఆర్జేడీ నుంచి వచ్చి బీజేపీలో చేరిన వలస నాయకుడు అని కమలం పార్టీ నేతలు అంటున్నారు. ఇక ఆయన ఏమి చదువుకున్నారని విపక్షాలు నిలదీస్తున్నాయి. ఆయన మీద క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని విమర్శిస్తున్నారు. బీహార్ సీఎం పదవి బీజేపీకి జీవిత కాలం కోరిక. అలాంటి అవకాశం వస్తే పార్టీలో పుట్టి పెరిగిన వారికి చాన్స్ ఇస్తే బాగుంటుంది కానీ వలస నేతకు ఎలా ఇస్తారు అన్నది బీజేపీలో మొదటి నుంచి ఉంది. అది కూడా బకీంపూర్ ఉప ఎన్నికల్లో ప్రభావం చూపించింది అని అంటున్నారు.

అగ్ర వర్ణాల ఆగ్రహం :

బీహార్ లో చూసుకుంటే 1952 నుంచి 1990 దాకా అత్యధికులు అగ్ర వర్ణాల వారే ముఖ్యమంత్రులు అయ్యారు. అప్పట్లో వచ్చిన మండల్ ఉద్యమం ప్రభావం బీహార్ మీద పడడం దానిని వ్యూహాత్మకంగా వాడుకుని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఓబీసీ నేతగా ఎదిగి బీహార్ సీఎం అయ్యారు. ఇక ఆ తరువాత మొత్తం రాజకీయం అంతా లాలూ అండ్ నితీష్ కుమార్ ల మధ్యనే సాగింది. అలా ఓబీసీలకే అన్నట్లుగా బీహార్ సీఎం పీఠం పేరు గడించింది. బీహార్ లో చూస్తే ఓసీలు కూడా అధికంగానే ఉన్నారు. వారే మొదటి నుంచి బీజేపీకి మద్దతుగా నిలుస్తూ వచ్చారు. రాజ్ పుట్స్ బ్రాహ్మిన్స్ అలాగే ఇతర అగ్ర వర్ణాల మద్దతు బీజేపీకి మొదటి నుంచి ఉంది. బీజేపీ 2025 ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించింది. దాంతో ఓసీలకు సీఎం పీఠం ఇస్తారు అనుకుంటే ఆ పార్టీ కూడా ఓబీసీ అయిన సామ్రాట్ చౌదరికి పట్టం కట్టడంతో వారు బకీంపూర్ ఎన్నికల్లో షాక్ ఇచ్చారని అంటున్నారు.

తప్పిస్తారా లేక :

ఇక బీహార్ లో ఎన్నికలు 2025 నవంబర్ లో జరిగాయి. ఇంకా ఏడాది కూడా కాలేదు, ఇద్దరు సీఎంలు మారారు. తొలి సీఎం గా నితీష్ కుమార్ అయిదు నెలలు పాలిస్తే బీజేపీ సీఎం గా సామ్రాట్ చౌదరి మూడు నెలలుగా కొనసాగుతున్నారు. ఇపుడే మూడవ క్రిష్ణుడుని తెర ముందుకు తీసుకుని వస్తే విపక్షాల ముందు పలుచన అవుతామని భయం కూడా కమలం పార్టీలో ఉంది. అంతే కాదు అది జనంలో కూడా తప్పుడు సంకేతాలు వెళ్లేలా చేస్తుంది అని అంటున్నారు. అందువల్ల ప్రస్తుతానికి మౌనంగా ఉండి సరైన సమయంలో సామ్రాట్ చౌదరికి ఉద్వాసన చెబుతారు అన్న ప్రచారం అయితే ఊపందుకుంది. ఇక బకింపూర్ లో గెలిచిన తరువాత ప్రశాంత్ కిశోర్ ఒక వ్యాఖ్య చేశారు. బీహార్ సీఎం విషయంలో జనంలో ఉన్న అసంతృప్తికి ఈ తీర్పు ఉదాహరణ అని చెప్పారు. ఈ విషయాలు కూడా బీజేపీ మనసులో ఉంటాయని అంటున్నారు. వీటితో పాటు జనాకర్షణ లేని ఫేస్ గా సామ్రాట్ ని ఇప్పటికే బీజేపీ పెద్దలు భావిస్తున్నారని అంటున్నారు.