ఎవరూ 'ఫెయిల్' అవ్వరు.. అందరూ పాస్ కాలేరు.. బిహార్ విద్యాశాఖ వినూత్న నిర్ణయం
ఈ వినూత్న సంస్కరణ కేవలం బిహార్ రాష్ట్రానికే పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఒక రోల్‌మాడల్‌గా నిలుస్తుందని చెబుతున్నారు.
By: Tupaki Political Desk | 29 Aug 2026 6:00 PM ISTవిద్యార్థులకు పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తే వారి జీవితం ముగిసిపోయినట్లేనా? సమాజంలో వారు ఓడిపోయినట్లు ముద్ర వేయించుకోవాల్సిందేనా? దశాబ్దాలుగా మన విద్యా వ్యవస్థలో పాతుకుపోయిన ఈ సంప్రదాయ ఆలోచనా ధోరణికి బిహార్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు (BSEB) స్వస్తి పలికింది. పది, ప్లస్ టు మార్కుషీట్లలో 'ఫెయిల్' అనే పదాన్ని పూర్తిగా తొలగిస్తూ, ఆ స్థానంలో 'స్కిల్ ట్రైనింగ్‌కు అర్హత' అనే పదాన్ని చేర్చాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం విద్యావ్యవస్థ పెను మార్పులు తీసుకువస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. పోటీ ప్రపంచంలో వేగాన్ని అందుకోలేని వారు వృత్తి విద్యాకోర్సులతో కూడా మెరుగైన జీవనం గడపొచ్చని ప్రోత్సహించేలా బిహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉపయోగపడుతుందని అంటున్నారు.
ఓటమి భావన నుంచి ఆత్మవిశ్వాసం వైపు...
పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోతే విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. కొందరైతే డిప్రెషన్‌లోకి వెళ్లి తీవ్ర నిర్ణయాలు తీసుకునే దుస్థితిని కూడా చూస్తున్నాం. దీనికి ప్రధాన కారణం 'ఫెయిల్' అనే ఒకే ఒక్క ముద్ర వేసి సమాజం చిన్నచూపు చూడటమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఫెయిల్ అన్న పదం విద్యార్థుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి, భవిష్యత్తుపై నూతన ఆశలు లేకుండా చేస్తుందని అంటున్నారు. ఈ వాస్తవాన్ని గుర్తించిన బిహార్ బోర్డు, విద్యార్థులను కుంగదీసే ఈ పద్ధతికి స్వస్తి పలకాలని నిర్ణయం తీసుకుంది. ఫెయిల్ అనే పదానికి బదులుగా వారు స్కిల్ ట్రైనింగ్‌కు అర్హులని పేర్కొనడం ద్వారా వారిలో నూతన ఉత్సాహాన్ని నింపాలని భావించిందని చెబుతున్నారు. మార్కుషీట్లలో 'ఫెయిల్' అని ముద్రించడం వల్ల విద్యార్థులు కుంగిపోకుండా, వారిని వృత్తి నైపుణ్య శిక్షణ వైపు మళ్లించడం ద్వారా వారి భవిష్యత్తుకు భరోసా కల్పించడమే ఈ విధానం ప్రధాన ఉద్దేశంగా వ్యాఖ్యానిస్తున్నారు.
స్వయం ఉపాధి వైపు విప్లవాత్మక అడుగు
కేవలం మార్కులు, డిగ్రీల చుట్టూ తిరిగే విద్యా విధానం వల్ల నిరుద్యోగ సమస్య పెరుగుతోందనే విమర్శలు ఉన్నాయి. అందరూ సాంప్రదాయ చదువులవైపే పరుగులు తీయలేరని, కొందరిలో సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాలు, వృత్తిగత ప్రతిభ మెండుగా ఉంటాయని చెబుతున్నారు. బిహార్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థులను కేవలం పరీక్షల పరంగానే కాకుండా, వాస్తవ ప్రపంచంలో ఉపాధి పొందేలా చేయడంలో కీలకపాత్ర పోషిస్తుందని అభిప్రాయపడుతున్నారు. పరీక్షలో మార్కులు తక్కువొచ్చినంత మాత్రాన వారు పనికిరానివారు కారనీ, వారిని వివిధ రంగాల్లో నైపుణ్యం గల నిపుణులుగా తీర్చిదిద్దవచ్చనే స్పష్టమైన సందేశాన్ని ఈ విధానం ఇస్తోందని అంటున్నారు.
భారతీయ విద్యా రంగంలో కొత్త మార్పులకు దిక్సూచి
ఈ వినూత్న సంస్కరణ కేవలం బిహార్ రాష్ట్రానికే పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఒక రోల్‌మాడల్‌గా నిలుస్తుందని చెబుతున్నారు. ప్రస్తుత జాతీయ విద్యా విధానం (NEP) కూడా వృత్తి విద్య, నైపుణ్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో బిహార్ బోర్డు అమలు చేస్తున్న ఈ విధానం ఆదర్శప్రాయమని కొనియాడుతున్నారు. విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ, వారిని దేశ నిర్మాణంలో భాగస్వాములను చేయడానికి ఇలాంటి మార్పులు దేశవ్యాప్తంగా అవసరమని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతి విద్యార్థిలోనూ ఏదో ఒక ప్రత్యేక ప్రతిభ ఉంటుందని, అందరూ ఒకేలా రాణించలేకపోవచ్చు అనే అభిప్రాయానికి బిహార్ బోర్డు తీసుకున్న నిర్ణయం అధిక ప్రాధాన్యమిచ్చిందని చెబుతున్నారు. ఈ నిర్ణయం వల్ల విద్యార్థుల్లో ఆత్మన్యూతనా భావం పోతుందని విశ్లేషిస్తున్నారు.
