బీహార్ దంగల్: పొత్తులు సరే.. అసలు 'చిక్కు' ఇదే!
దేశం మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఎన్నికలు బీహార్ అసెంబ్లీ పోరే!. ఎందుకంటే.. ఈ ఏడాది ఈ ఒక్క రాష్ట్రంలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
By: Garuda Media | 7 Oct 2025 8:00 PM ISTదేశం మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఎన్నికలు బీహార్ అసెంబ్లీ పోరే!. ఎందుకంటే.. ఈ ఏడాది ఈ ఒక్క రాష్ట్రంలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో పోరు జరగనుంది. అయితే.. ఈ ఏడాదికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్థాన్‌కు బుద్ది చెప్పామని.. చెబుతున్న కేంద్ర ప్రభుత్వం.. అదేసమ యంలో అమెరికా భారత్‌పై వేసిన భారీ సుంకాల భారాన్ని తట్టుకుని.. అమెరికాకు బుద్ధి చెప్పే క్రమంలో.. స్వదేశీ వస్తువుల వినియోగం.. స్వదేశీ ప్రాధాన్యానికి కూడా.. మోడీ పెద్దపీట వేశారు. దీంతో ఈ రెండు అంశాలు కీలకంగా మారాయి.
ఇక, ఇదే సమయంలో సెప్టెంబరు 22 నుంచే(వాస్తవానికి దీపావళి కానుక అన్నా.. ఎన్నికల నోటిఫికేషన్ ముందే వస్తుందన్న భావనతో అంతకన్నా ముందే.. మోడీ దేశవ్యాప్తంగా జీఎస్టీ-2.0ను తీసుకువచ్చారు.) తీసుకువచ్చిన జీఎస్టీ-2.0 సంస్కరణలు కూడా.. బీహార్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అయితే.. ఎన్ని ఎత్తులు ఉన్నా.. పొత్తుల వరకు వచ్చే సరికి అసలు చిక్కు తెరమీదికి వస్తోంది. ప్రధానంగా బీజేపీ-జనతాదళ్ యునైటెడ్(జేడీయూ)-ఎల్‌జేపీ సహా మరో రెండుచిన్న పార్టీలు కలిసి ఎన్డీయే కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. అయితే.. వీటి మధ్య సీట్ల పంపకమే ఇప్పుడు పెద్ద సవాలుగా మారనుంది.
ఎందుకంటే.. కేంద్రంలో 12 ఎంపీ స్థానాలతో మోడీ సర్కారును నిలబెట్టామని చెబుతున్న జేడీయూ అధినేత, సీఎం నితీష్ కుమార్ .. తమకు సీట్లు ఎక్కువగా కావాలని పట్టుబడుతున్నారు. 2020లో జరిగిన ఎన్నికల్లోనూ ఆయన ఇదే బీజేపీతో జట్టు పెట్టుకుని విజయందక్కించుకున్నారు. అప్పట్లోనూ ఇదే పేచీ వచ్చింది. అప్పట్లో 100 స్థానాలను దక్కించుకున్న నితీష్.. కేవలం 71 స్థానాల్లోనే విజయం దక్కించుకున్నారు. ఇక, మరో 100 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ.. 80 స్థానాల్లో విజయం సాధించింది. అంటే నితీష్ కన్నా.. 9 స్థానాల్లో విజయంసాధించింది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ దగ్గరే రెండు పార్టీలకు ఇక్కట్టు రానున్నాయని అంటున్నారు. ఇక, మిగిలి చిన్నా చితక పార్టీల సంగతి సరేసరి!.
ఇక, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్‌లో.. రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) కీలక పాత్ర పోషిస్తోంది. మరో రెండు పార్టీలు కూడా.. దీనిలో ఉన్నాయి. అవే సీపీఐ, సీపీఎం సహా.. కొన్ని చిన్నవి. వీటి మధ్య కూడా సీట్ల పంపకం అంత ఈజీకాదు. ఇటీవలే.. ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్.. ``సీట్ల పంపకంలో తేడా వస్తే.. మొత్తం స్థానాల్లో మేమే పోటీకి దిగుతాం.`` అని హెచ్చరించారు. ఇక, ఈ ప్రకారం.. చూసుకున్నా.. కాంగ్రెస్ పార్టీకి పెద్దగా బలం లేదు. గత 2020 ఎన్నికల్లో ఆర్జేడీ 80 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్ కేవలం 12 స్థానాలకే పరిమితమైంది. కానీ.. పోటీ చేసిన స్థానాలు మాత్రం 90.
ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ బలం ఏమైనా పెరిగిందా? అంటే.. అంతంత మాత్రంగానే ఉంది. కానీ, రాహుల్‌గాంధీ మాత్రం ఒప్పుకోవడం లేదు. తాను చేసిన `ఓటర్ అధికారయాత్ర` పార్టీలో జోష్ పెంచిందని చెబుతున్నారు. దీనిని ఆర్జేడీ ఒప్పుకోవడం లేదు. తాము చేసిన `బీహార్ అధికార యాత్ర` ద్వారా.. ఆర్జేడీ బలం పెరిగిందని చెబుతోంది. సో.. మొత్తంగా చూస్తే.. ఇప్పుడు సీట్ల పంపకం.. ఈ కూటమికి కూడా అగ్నిపరీక్షగా మారింది.
