Begin typing your search above and press return to search.

ఎస్ఏఎస్ ప్రీ పోల్ సర్వే : బీహార్ లో హోరా హోరీ

ఇపుడు దేశంలో ఆసక్తిని పెంచే ఎన్నికలుగా బీహార్ అసెంబ్లీ ఉంది. నవంబర్ మొదటి వారం నుంచి మూడు విడతలుగా ఎన్నికలు జరుగాయని ప్రచారం ఉంది.

By:  Satya P   |   3 Oct 2025 9:23 AM IST
ఎస్ఏఎస్ ప్రీ పోల్ సర్వే : బీహార్ లో హోరా హోరీ
X

ఇపుడు దేశంలో ఆసక్తిని పెంచే ఎన్నికలుగా బీహార్ అసెంబ్లీ ఉంది. నవంబర్ మొదటి వారం నుంచి మూడు విడతలుగా ఎన్నికలు జరుగాయని ప్రచారం ఉంది. దానికి సంబంధించి షెడ్యూల్ ని ఈ వారంలో రిలీజ్ చేస్తారు అని అంటున్నారు. ఇదిలా ఉంటే బీహార్ ఎన్నికల గురించి పలు రకాలైన ప్రీ పోల్ సర్వేలు వెలువడుతున్నాయి. హైదరాబాద్ కి చెందిన ఎస్ ఏ ఎస్ సంస్థ ఆగస్టు 25 నుంచి అక్టోబర్ 2వ తేదీల మధ్యలో నిర్వహించిన రెండు విడతల సర్వేలో అనేక ఆసక్తి కరమైన వివరాలు వెల్లడి అవుతున్నాయి.

పోటా పోటీగానే :

బీహార్ లో ప్రస్తుతం ఎన్డీయే అలాగే ఆర్జేడీ కాంగ్రెస్ వామపక్షాల మహా ఘట్ బంధన్ ల మధ్య పోటా పోటీగా ఉంది అని ఈ సర్వే వెల్లడించింది. మొత్తం బీహార్ లో సీట్లు 243 ఉంటే అందులో ఎన్డీయే కూటమికి 104 నుంచి 115 దాకా వస్తాయని తాజా సవేలో తేలింది. అలాగే మహా ఘట్ బంధన్ కి 116 నుంచి 125గా వస్తాయని తేలింది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ జన్ సూరజ్ పార్టీకి 11 నుంచి 14 దక్కుతాయని తేలింది. ఇక ఇతరులకు ఏడు నుంచి తొమ్మిది సీట్లు వస్తాయని పేర్కొంది ఈ సర్వే.

మెగుగైన ఘట్ బంధన్ :

ఇక ఎస్ఏఎస్ సంస్థ ఆగస్ట్ 25 నుంచి సెప్టెంబర్ 15 మధ్యలో నిర్వహించిన మొదటి విడత సర్వేలో ఎన్డీయే కూటమికి 125 సీట్లు మహా ఘట్ బంధన్ కి 110 సీట్లు వస్తాయని అంచనా కట్టారు. కానీ సెప్టెంబర్ 16 నుంచి అక్టోఅర్ 2 వరకూ నిర్వహించిన తాజా విడత ప్రీ పోల్ సర్వేలో మహా ఘట్ బంధన్ పరిస్థితి మెరుగుపడింది అని తెలుస్తోంది. మొదటి విడత సర్వేలో మొత్తం 33,200 సాంపిల్స్ ని తీసుకుంటే రెండవ విడత సర్వేలో 31 వేల శాంపిల్స్ ని తీసుకున్నారు. మొత్తంగా 64, 300 శాంపిల్స్ తో ఈ ప్రీ పోల్ సర్వే సాగింది.

మొత్తం రాష్ట్రమంతా :

ఇదిలా ఉంటే మొత్తం రాష్ట్రమంతా 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే సాగింది. నిరుద్యోగం, కులాల ప్రభావం, ప్రశాంత్ కిశోర్ జన్ సూరజ్ పార్టీ ప్రభావం, శాంతి భద్రతలు, మహిళా ఓటింగ్, ముస్లిం యాదవ్ ఫ్యాక్టర్, అవినీతి, మద్య నిషేధం ఫ్యాక్టర్ ఇలా అనేక అంశాలను ఆధారంగా చేసుకుని ఈ సర్వే నిర్వహించారు. అదే విధంగా ప్రతీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో పరిస్థితులు ఆయా రాజకీయ పార్టీల ప్రభావం, పొత్తు పార్టీల బలాబలాలు అన్నీ అంచనా వేసి మరీ ఈ సర్వేని చేశారు

డివిజన్ల వారీగా :

ఇక బీహార్ లో మొత్తం తొమ్మిది డివిజన్లు ఉన్నాయి. భాగల్పూర్, ధర్భంగా, కోసి, మగధ, ముంగేర్, పాట్నా, పూర్ణియా, శరన్, టిరుహత్ ఉన్నాయి. ఇందులో టిరుహతిలో అత్యధికంగా 49 అసెంబ్లీ సీట్లు ఉంటే భాగల్పూర్ లో అత్యల్పంగా 12 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. వీటిలో ఆయా రాజకీయ పార్టీల ప్రభావాన్ని ఈ సర్వే అంచనా కట్టింది.

రాహుల్ ఓటు చోర్ యాత్ర :

ఇక రెండవ విడత ప్రీ పోల్ సర్వేలో అనేక ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. రాహుల్ యాత్ర ప్రభావం ఉందని 46 శాతం అంటూటే లేదని 39 శాతం చెబుతున్నారు. మహా ఘట్ బంధన్ కి పాక్షికంగా మేలు చేస్తుంది అని తొమ్మిది శాతం చెబుతూంటే ఏమీ చెప్పని వారు ఆరు శాతం ఉన్నారు మహిళలకు పది వేల రూపాయలను నితీష్ కుమార్ ప్రభుత్వం రోజ్ గార్ యోజన పధకం ద్వారా ఇచ్చింది. ఆ తరువాత మహిళా ఓటర్ల ప్రభావం ఎలా ఉంది అంటే మహా ఘట్ బంధన్ కే ఓటు చేస్తామని అన్న వారు 38 శాతం ఉంటే ఎన్డీయేకు వేస్తామని చెప్పిన వారు 35 శాతం మంది, జన సూరజ్ పార్టీకి ఓటు వేస్తామని చెప్పిన వారు 12 శాతం మంది ఉన్నారు. ప్రశాంత్ కిశోర్ ఎన్డీయే మీద చేసిన అవినీతి ఆరోఅణల ప్రభావం ఉంటుందని 47 శాతం చెబుతూంటే ఉండదని 33 శాతం చెబుతున్నారు.

నితీష్ పనితీరు ఓకేనా :

ఇక నితీష్ కుమార్ ప్రభుత్వం పనితీరు సూపర్ అన్న వారు మూడు శాతం ఉంటే సంతృప్తిగా ఉందని చెప్పిన వారు 29 శాతం ఉన్నారు. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ పనితీరు మీద ఎక్సలెంట్ అని చెప్పిన వారు 5 శాతం మంది ఉంటే గుడ్ అన్న వారు 32 శాతం మంది, ఏవరేజ్ అన్న వారు 7 శాతం మంది ఉన్నారు బాగులేదు అన్న వారు 44 శాతం మంది ఉనారు. బీహార్ సమగ్ర అభివృద్ధి విషయంలో ఏ కూటమి బెస్ట్ అంటే మహా ఘట్ బంధన్ బెస్ట్ అంటూ 34 శాతం మంది, ఎన్డీయే బెస్ట్ అంటూ 31 శాతం మంది స్పందించారు. తరువాత సీఎం గా మహాఘట్ బంధన్ నుంచి తేజస్వీ యాదవ్ కి 37 శాతం మంది మద్దతుగా ఉంటే నితీష్ కుమార్ కి 22 శాతం మద్దతు దక్కింది. ప్రశాంత్ కిశోర్ కి 19 శాతం మద్దతు లభించడం విశేషం.

ముస్లిం ఓటర్లు ఏ వైపు :

ముస్లిం ఓటర్లు ఏ కూటమి పట్ల ఆకర్షితులుగా ఉన్నారు అంటే మహా ఘట్ బంధన్ కి 70 శాతం మంది ఎన్డీయేకు 21 శాతం మంది స్పందించారు. నిరుద్యోగ సమస్యను తీర్చే కూటమిగా మహా ఘట్ బంధన్ కి 39 శాతం ఓటేస్తే ఎన్ డీయేకు 33 శాతం మంది ఓటేశారు. ఎవరికి ఓటు వేయాలన్న దాని మీద ఇప్పటికే 60 శాతం మంది నిర్ణయం తీసేసుకున్నారు. అభ్యర్ధుల ప్రకటన తరువాత నిర్ణయం తీసుకుంటామని అంటున్న వారు 22 శాతంగా ఉన్నారు. ప్రశాంత్ కిశోర్ ని ఓట్లు చీల్చే వారిగా 64 శాతం మంది భావిస్తున్నారు కింగ్ మేకర్ గా 14 మంది భావిస్తున్నారు. బీహార్ లో లా అండ్ ఆర్డర్ బాగులేదని 46 శాతం మంది చెబుతున్నారు ఎమ్మెల్యేలు మంత్రుల పనితీరు బాగులేదని 45 శాతం మంది అంటున్నారు.

జీఎస్టీ సంస్కరణల ప్రభావం :

ఎన్డీయే ప్రభుత్వం హామీలు నిలబెట్టుకోలేదని 43 శాతం చెబుతున్నారు. మరోసారి నితీష్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా అంటే రాదని 45 శాతం అంటూంటే వస్తుందని 43 శాతం మంది చెబుతున్నారు. నిరుద్యోగం బీహార్ లో ఉందని 46 శాతం మంది అంటున్నారు. ఇక జీఎస్టీ సంస్కరణలు ఎన్డీయేకు హెల్ప్ చేస్తాయని 41 శాతం చెబుతూంటే చేయావని 40 శాతం మంది అంటున్నారు. ఆపరేషన్ సింధూర్ ప్రభావం ఉంది అని 47 శాతం అంటూంటే లేదని 46 శాతం అంటున్నారు. మోడీ ఇమేజ్ బీహార్ లో వర్కౌట్ అవుతుందని 45 శాతం మంది చెబుతూంటే రాహుల్ ఇమేజ్ వర్కౌట్ అవుతుందై 42 శాతం మంది చెబుతున్నారు.