బీహార్ దంగల్ : భారీ పోలింగ్...ఎవరు కింగ్ ?
బీహార్ తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఏకంగా 64.66 శాతం భారీ పోలింగ్ జరగడం విశేషం.
By: Satya P | 7 Nov 2025 10:29 AM ISTబీహార్ తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఏకంగా 64.66 శాతం భారీ పోలింగ్ జరగడం విశేషం. ఇది పాత రికార్డులను బద్ధలు కొట్టింది. బీహార్ చరిత్రలో చూసుకుంటే 1998 లోక్ సభ ఎన్నికల్లో 64.9 శాతం పోలింగ్ జరిగింది అని చెబుతున్నారు ఇపుడు దానిని మించేసింది. ఇక 2020లో జరిగిన బీహార్ శాసనసభ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ చూస్తే 57.29 శాతం గా నమోదు అయింది. ఇప్పుడు దానికి ఏడు శాతం అధికంగా పోలింగ్ జరగడంతో రాజకీయ పార్టీలతో పాటు విశ్లేషకలకు ఇది ఒక బిగ్ టెస్ట్ గా మారింద్
పోలింగ్ తీరు ఇలా :
బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ గురువారం 121 నియోజకవర్గాల్లో ప్రశాంతంగా సాగింది. 18 జిల్లాలలలో పాట్నా షేక్‌పురా మినహా పదహారు జిల్లాల్లో మంచి పోలింగ్ నమోదు అయింది. వివిధ జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు తమ ఓటు వేయడానికి గొప్ప ఉత్సాహం చూపించారు. తెల్లవారుతూనే బారులు తీరడం కనిపించింది. మహిళలు ఎక్కువగా పోలింగ్ కేంద్రాలకు తరలిరావడంతో ప్రజాస్వామ్యం పండుగ అన్నది కళ్ళకు కట్టింది.
వీరందరి జాతకం :
ఇక మొదటి విడత పోలింగ్ లో చూస్తే ఎన్డీయే నుండి 57 మంది జనతాదళ్ యునైటెడ్ అభ్యర్థుల ఎన్నికల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో ఉంచారు. అలాగే, 48 మంది బీజేపీ అభ్యర్థులు 14 మంది లోక్ జనశక్తి పార్టీ అభ్యర్థుల భవితవ్యాన్ని కూడా ఓటర్లు లాక్ చేశారు. అంతే కాదు మహా ఘట్ బంధన్ నుండి చూస్తే 73 మంది రాష్ట్రీయ జనతాదళ్ అభ్యర్థులు 24 మంది కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఏడు పార్టీల మహా ఘట్ బంధన్ లో సీపీఐ ఎం ఎల్ 14 స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టింది.
గతంలో సీన్ అదీ :
ఇక అయిదేళ్ళ క్రితం 2020 అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడతలో జరిగిన 121 సీట్లలో 23 స్థానాలను జనతాదళ్ యునైటెడ్ గెలుచుకుంది 32 స్థానాలను బిజెపి గెలుచుకుంది, లోక్ జనశక్తి పార్టీకి ఒక స్థానం లభించింది. అంటే ఎన్డీయే కూటమికి 56 సీట్లు దక్కాయి అన్న మాట. మహా ఘట్ బంధన్ నుంచి రాష్ట్రీయ జనతాదళ్ 42 స్థానాలను గెలుచుకోగా దాని మిత్రపక్షం కాంగ్రెస్ నాలుగు స్థానాలను గెలుచుకుంది. వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ కూడా నాలుగు స్థానాలను గెలుచుకుంది. ఈ లెక్కన ప్రతిపక్ష కూటమికి అప్పట్లో 54 సీట్లు దక్కాయి. అంటే పోటా పోటీగానే అప్పట్లో ఎన్డీయే మహా ఘట్ బంధన్ సీట్లు తెచ్చుకున్నాయన్నమాట.
పెద్ద ఎత్తున పోలింగ్ :
అయితే ఈసారి పెరిగిన ఏడు శాతం ఓటింగ్ ఎవరికి అనుకూలం అన్నదే చర్చగా ఉంది. సాధారణంగా పెరిగిన పోలింగ్ అధికార పార్టీ పట్ల వ్యతిరేకతను చాటుంది. ఇది గతంలో జరిగిన అనేక ఎన్నికల్లో రుజువు అయింది. ఒక మార్పుని కోరుకుంటేనే ఓటరు ఇంటి నుంచి బయటకు వచ్చి తన ఓటుని ఎండలో నిలబడి పట్టుదలగా వేస్తాడు అన్నది చరిత్ర చెప్పిన సత్యం. అయితే అరుదైన సందర్భాలలో ఉన్న ప్రభుత్వం పోకూడదు అన్న అభిమానంతో కూడా ఓటెత్తుతారు. కానీ ఎక్కువ సందర్భాలలో మాత్రం భారీ ఓటింగ్ ఎపుడూ ప్రభుత్వాన్ని దించేందుకే దోహదపడింది. దానికి తోడు గతంలో తొలి దశలో మహా ఘట్ బంధన్ చూపించిన పట్టు ఇపుడు చేసిన జోరు సర్వే నివేదికలు అన్నీ చూస్తే కనుక బీహార్ ఓటర్ ఏమి చెప్పబోతున్నారు అన్నది మాత్రం బయటకు తెలియకపోయినా ఏదో జరగబోతోంది అని అంతా అంటున్నారు.
