జూబ్లీహిల్స్ ఉపఎన్నికల తేదీలు ఖరారు – రాజకీయ వేడి మొదలు!
బిహార్ లోనూ ఓడితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మరింత ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది. ఈ నేపథ్యంలోనే బిహార్ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సోమవారం ప్రకటించింది.
By: Tupaki Political Desk | 6 Oct 2025 5:27 PM ISTరాజకీయంగా అత్యంత కీలకమైన బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు అనేది తేలిపోయింది. సమగ్ర ఓటర్ల సవరణ జాబితా వివాదం ఓవైపు దేశవ్యాప్తంగా సంచలనం రేపగా, అంతేస్థాయిలో ప్రధాని మోదీ పెద్ద ఎత్తున డెవలప్ మెంట్ కార్యక్రమాలకు హాజరై బిహార్ రాజకీయాలను వేడెక్కించారు. దీంతో ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా మారనున్నాయి. 20 ఏళ్లుగా మధ్యలో స్వల్ప కాలం మినహాయించి బిహార్ లో నితీశ్ కుమార్ సీఎంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన సారథ్యంలోనే మళ్లీ ఎన్నికలకు వెళ్లనుంది ఎన్డీఏ కూటమి. ఇక గత రెండు దఫాలుగా అనేక అవమానాలు ఎదుర్కొన్న రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ఈసారి కచ్చితంగా గెలవాల్సిన అవసరం ఎదుర్కొంటోంది. దీని మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ ఎన్నికలు చాలా ముఖ్యం. బిహార్ లోనూ ఓడితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మరింత ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది. ఈ నేపథ్యంలోనే బిహార్ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సోమవారం ప్రకటించింది.
మోగింది నగరా.. ఇక హోరాహోరీనే..
బిహార్ అంటేనే రాజకీయ రణరంగం. ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యంత ప్రాధాన్యం ఉన్న రాష్ట్రం. కారణం.. ఇక్కడ దశాబ్దాలుగా బీజేపీని నిలువరిస్తూ వచ్చారు ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్, అలాంటి లాలూను 20 ఏళ్లుగా ప్రతిపక్షానికే పరిమితం చేసింది బీజేపీ. కానీ, సొంతంగా మాత్రం అధికారంలోకి రాలేకపోయింది. నితీశ్ కుమార్ నాయకత్వంలో ప్రభుత్వంలో కొనసాగింది. ఈసారి మాత్రం బిహార్ ను ఒడిసిపట్టాలని చూడడం ఖాయం. అది ఎన్నికల తర్వాత సంగతి. ఇప్పడైతే ఎన్నికల తేదీలు వచ్చేశాయి.
2 విడతల్లోనే.. సరిగ్గా నెలరోజుల్లో
బిహార్ అసెంబ్లీ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించనున్నట్లు సీఈసీ ప్రకటించింది. నవంబరు 6న మొదటి విడత పోలింగ్ జరగనుంది. అదే నెల 11న రెండో దశ పోలింగ్ ఉండనుంది. నవంబరు 14 ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఒకప్పుడు మావోయిస్టుల ప్రాబల్యంతో సమస్యాత్మకంగా నిలిచిన బిహార్ లో ఎన్నికలు అంతే స్థాయిలో సమస్యగా మారేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేనందున 2 విడతల్లోనే ముగించేయనున్నారు. బిహార్ లో 243 అసెంబ్లీ స్థానాలున్నాయి.
-2020లో జరిగిన ఎన్నికల్లో కూటమిగా పోటీచేసిన బీజేపీ 84, నితీశ్ పార్టీ జేడీయూ 48 సీట్లు నెగ్గాయి. కానీ, ఆ తర్వాత పలు పరిణామాలు జరిగాయి.
-గత ఎన్నికలు మూడు దశల్లో జరిగాయి. అప్పట్లో అక్టోబరు 28, నవంబరు 3, 7 తేదీల్లో పోలింగ్ నిర్వహించారు. నవంబరు 10న ఫలితాలు వెల్లడించారు.
జూబ్లీహిల్స్ కు బిహార్ రెండో దశతో..
తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బిహార్ రెండో దశ పోలింగ్ తో పాటే నవంబరు 11న నిర్వహించనున్నట్లు సీఈసీ తెలిపింది. నవంబరు 14న ఫలితాలు వెల్లడించనుంది. సిటింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (బీఆర్ఎస్) ఆకస్మిక మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే.
