Begin typing your search above and press return to search.

ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం...రాసుకో సాంబా !

ఒడ్డుకు చేరడం కోసం ఓడ మల్లన్న అంటారు కానీ తీరా ఒడ్డుకు చేరాక బోడి మల్లన్నగానే అంతా భావిస్తారు. ఇది ఓటర్లకు అర్థమైన తర్వాత మరో కొత్త రకం రాజకీయం స్టార్ట్ అయింది.

By:  Satya P   |   11 Oct 2025 3:00 AM IST
ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం...రాసుకో సాంబా !
X

ఎన్నికలు అందులో ఓటర్లకు ఎన్నో కలలు వాటిని మల్టీ కలర్స్ లో పెట్టి చూపించే ఘనాపాఠి పార్టీలు ఇలా దేశంలో గత ఏడున్నరకు పైగా దశాబ్దాల నుంచి ఎన్నో హామీలు రాజకీయ పార్టీలు ఇస్తూ అధికారం దొరకబుచ్చుకుని ముందుకు సాగుతున్నాయి. అదే సమయంలో ఓటర్లు మాత్రం తమకు ఇచ్చిన ఏ హామీ కూడా పూర్తిగా నెరవేరలేదు అనే ఎపుడూ మండిపోతూంటారు. నిజానికి ఎన్నికల హామీలు అన్నీ రంగుల కలలే అని చెప్పాల్సి ఉంటుంది. ఒడ్డుకు చేరడం కోసం ఓడ మల్లన్న అంటారు కానీ తీరా ఒడ్డుకు చేరాక బోడి మల్లన్నగానే అంతా భావిస్తారు. ఇది ఓటర్లకు అర్థమైన తర్వాత మరో కొత్త రకం రాజకీయం స్టార్ట్ అయింది.

వ్యక్తిగత లాభాలే :

తమకు సంఘం వద్దు, సమాజం వద్దు, సొంత లాభమే చాలా కావాలని జనాలు అనుకోవడం మొదలెట్టాయి. ఫలితంగా ఎన్నికల ముందు తాయిలాలు పెద్ద ఎత్తున ఓటర్లకు ఇవ్వాల్సి వస్తోంది అన్న ప్రచారం కూడా ఉంది. అంతే కాదు ఎన్నికల హామీలలో సైతం వ్యక్తిగతంగా లాభం కలిగించే వాటి మీదనే ఫోకస్ పెడుతూ వస్తున్నారు. దాంతో ఆయా పార్టీలు అధికారంలోకి వచ్చాక ఎంతో కొంత ఓటర్లకు దక్కుతోంది ఇదొక రకమైన తృప్తిగా ఓటర్లకు ఉంటే ఇదేదో బాగుందని రాజకీయ పార్టీలకూ తోస్తోంది.

బీహార్ హామీలు :

ఈ ఎన్నికకు ఆ ఎన్నికలో కొత్త కొత్త హామీలు పుట్టుకుని వస్తున్నాయి ఒక విధంగా చెప్పాలీ అంటే హామీల కర్మాగారాలుగా చాలా మెదళ్ళు పనిచేస్తున్నాయి. ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలని ఆలోచిస్తూ సరికొత్త ట్రిక్స్ కూడా ప్లే చేస్తున్నారు. ఈ క్రమంలో చూస్తే కనుక బీహార్ లో తాజా ఎన్నికల్లో చాలా కొత్త హామీలు తెర మీదకు వస్తున్నాయి. ఇందులో అందరికీ ఆకట్టుకుంటున్నవి రాజకీయ పార్టీలకు కూడా భవిష్యత్తులో ఉపయోగపడే ఒక శక్తివంతమైన హామీగా ఒకటి కనిపిస్తోంది అదే ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం. ఈ పవర్ ఫుల్ హామీని మహా ఘట్ బంధన్ లో పెద్దన్నగా ఉన్న ఆర్జేడీ నుంచి వచ్చింది. దీనిని చాలా గొప్పగా ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ ప్రకటించారు. తమ పార్టీని అధికారంలోకి తెస్తే కనుక ప్రతీ ఇంటికీ కచ్చితంగా సర్కార్ నౌఖరీ ఇప్పిస్తామని ఆయన ఘంటాపధంగా చెప్పారు.

క్లిక్ అయ్యే హామీగా :

బీహార్ లో నిరుద్యోగం రేటు చాలా అధికంగా ఉంది. నిజానికి దేశంలోని ప్రభుత్వాలు గడచిన కొన్ని దశాబ్దాలుగా వివిధ కారణాల రిత్యా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం తగ్గించేశాయి. దాని వల్ల విపరీతమైన ఖర్చు అవుతోంది. బడ్జెట్ లో అత్యధిక భాగం జీతాల చెల్లింపునకే పోతోంది. ఆర్ధిక సమస్యలతో పాటు అనేక ఇతర అంశాల వల్లనే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేని స్థితి ఉంది. అందుకే ఎవరూ కూడా ఇంత పెద్ద హామీని భుజాన వేసుకోలేదు. అసలు ఆ ఆలోచన కూడా చేయలేదు. ఇక బీహార్ రాష్ట్రం విషయానికి వస్తే కనుక ఆ రాష్ట్రంలో రెండు కోట్ల ఏడు లక్షల మంది దాకా నిరుద్యోగులు ఉన్నారు. ఇంటికో ఉద్యోగం అంటే వీరందరికీ గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వాల్సిందే. మరి ఆర్జేడీ అన్నీ తెలిసే ఈ హామీ ఇచ్చిందా లేక దీని వెనక ఏమైనా మెలిక ఉందా అన్నది చర్చగా మారింది. అలాంటి కనబడని కండిషన్లు ఉంటే ఉండొచ్చేమో అన్న డౌట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే ఏవి ఎలా ఉన్నా ఈ హామీ వర్కౌట్ అయితే గంపగుత్తగా ఓట్లు రాలిస్తే మాత్రం దేశంలోకి ఇతర రాష్ట్రాలలోని రాజకీయ పార్టీలు కూడా దీనికి టాప్ ప్రయారిటీ ఇచ్చి తమ ఎన్నికల హామీలలో అగ్ర భాగాన ఉంచే చాన్స్ ఉంది అని అంటున్నారు.

గెలుపు గ్యారంటీ అయితే :

తిమ్మిని బమ్మిగా చేసి అయినా గెలవాలని అంటారు. ఆ విధంగా చూస్తే కనుక సరిన హామీ ఒక్కటి చాలు ఎన్నికల్లో గట్టెక్కించడానికి. తీరా గెలిచాక వాయిదా పద్ధతి ఉంది దేనికి అయినా అన్నది కూడా ఉంది. అంతే కాదు అశ్వద్ధామ హత కుంజరః అని కూడా అనేయవచ్చు. అంటే గెలిచాక శతకోటి కండిషన్లు పెట్టేసి ఫలనావి ఉంటేనే సర్కార్ కొలువులు ఇస్తామని అనవచ్చు అలా కోట్లలో ఇవ్వాల్సిన ఉద్యోగాలను ఏ వేలకో కుదించేయవచ్చు. వాటిని కూడా తమ అయిదేళ్ల అధికారంలో వాయిదాలతో నెమ్మదిగా చూపించవచ్చు. అంతే కాదు క్యాజువల్ కాంట్రాక్ట్ జాబ్స్ ని కూడా ఈ లిస్టులో కలిపేయవచ్చు. ఇలా అనంతకోటి ఉపాయాలు ఉన్నాక ఈ హామీ బ్రహాస్త్రం కాక మరేమవుతుంది. అందుకే రాసుకో సాంబా అంటోంది రాజకీయం.