'ఎన్డీయే - ఇండియా' మధ్యలో ప్రశాంత్ కిశోర్.. తెరపైకి ఆసక్తికర సర్వేలు!
అవును... బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వారం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
By: Raja Ch | 2 Oct 2025 9:00 PM ISTమరికొన్ని రోజుల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు ప్రజలు తమ భవిష్యత్ ముఖ్యమంత్రిగా ఎవరిని చూడాలనుకుంటున్నారో తెలుసుకోవడానికి అనేక సర్వేలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెరపైకి వచ్చిన రెండు సర్వేల ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రధాన పోటీ ఎన్డీయే, ఇండియా కూటముల మధ్యే ఉంది. పీకే ఎఫెక్ట్ సైతం కీలకంగా మారింది.
అవును... బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వారం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీంతో... ఈ నెల చివరి వారంలో.. లేదా, నవంబర్ మొదటి వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఒపీనియన్ పోల్స్ బీహార్ రాజకీయాలపై ఆసక్తిని పెంచాయి. ఈ క్రమంలో స్పిక్ మీడియా నెట్ వర్క్ సర్వే, జేవీసీ ఒపీనియన్ పోల్ సంస్థలు తమ ఒపీనియన్ పోల్స్ ఫలితాలను వెల్లడించాయి.
వాస్తవానికి ఇప్పటికే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను తన అభ్యర్థిగా ఎన్డీయే ఆమోదించింది. మరోవైపు ఇండియా అలయన్స్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ ఉన్నారు. ఈ నేపథ్యంలో తెరపైకి వచ్చిన స్పిక్ మీడియా నెట్ వర్క్ సర్వే, జేవీసీ ఒపీనియన్ పోల్ సంస్థల ఫలితాలు... అటు నితీష్ కుమార్, ఇటు తేజస్వి యాదవ్.. ఇద్దరూ ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో పోటా పోటీగా ఉన్నారని చెబుతున్నాయి.
స్పిక్ మీడియా నెట్ వర్క్ సర్వే!:
ఈ సర్వే ప్రకారం.. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి పదవికి అత్యంత ప్రాధాన్యత గల అభ్యర్థిగా ఉన్నారు. ఇందులో భాగంగా... 30.5% మంది ప్రజలు తేజస్వి యాదవ్ ను సీఎం పదవికి తమ మొదటి ఎంపికగా పేర్కొన్నారు. ఇదే సమయంలో... ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ను 27.4% మంది కోరుకుంటున్నారు. మరోవైపు 'జన్ సూరజ్' ప్రశాంత్ కిషోర్ ను 13% మంది ప్రజలు ఇష్టపడ్డారు.
ఇక కూటముల పరంగా గెలుపోటముల విషయంలో ప్రజల అభిప్రాయాలు విభన్నంగా ఉన్నాయి. ఇందులో భాగంగా... ఈ సర్వే ప్రకారం ఎన్డీయే కూటమి 46 శాతం ఓటు షేరు సాధించి, 158 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వెల్లడించింది. మరోవైపు కాంగ్రెస్ కూటమి 41శాతం ఓటు షేరును సాధించి 66 సీట్లతో ప్రతిపక్షానికే పరిమితం అవుతుందని స్పిక్ మీడియా నెట్ వర్క్ సర్వే సర్వే స్పష్టం చేసింది.
ఇదే క్రమంలో... ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవనప్పటికీ 8 శాతం ఓటు షేరు సాధిస్తుందని ఒపీనియన్ పోల్స్ వెల్లడించాయి. ఇదే సమయంలో... మజ్లిస్ పార్టీ 4 సీట్లు దక్కించుకుంటుందని.. బీఎస్పీ ఒక స్థానంలో గెలుస్తుందని సర్వే పేర్కొంది.
జేవీసీ సర్వే!:
జేవీసీ ఒపీనియన్ పోల్ ప్రకారం.. బీహార్ ప్రజలు మళ్ళీ ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ నే ఎన్నుకున్నారు. ఇందులో భాగంగా సీఎం గా నితీష్ కుమార్ కు 27 శాతం మంది ప్రజలు ఓటు వేయగా.. తేజస్వి యాదవ్ కు 25 శాతం మంది మద్దతు లభించింది. ఇక ప్రశాంత్ కిషోర్ ను 15 శాతం మంది ప్రజలు సీఎంగా చూడాలని తెలిపారు.
ఇదే క్రమంలో... 131 నుంచి 150 స్థానాల్లో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని చెప్పిన జేవీసీ సర్వే... ఇండియా కూటమికి 81 నుంచి 103 స్థానాలు దక్కే అవకాశం ఉందని పేర్కొంది. ప్రశాంత్ కిషోర్ పార్టీకి 10 నుంచి 11 శాతం ఓటు షేరుతో 4 - 6 సీట్లు గెలిచే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది!
బీజేపీ - కాంగ్రెస్ మధ్యలో పీకే!:
ఏది ఏమైనా తాజాగా తెరపైకి వచ్చిన ఈ రెండు ఒపీనియన్ పోల్స్ ను పరిశీలిస్తే... త్వరలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోరు నువ్వా నేనా అన్నట్లుగా కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ కూటమికి ప్రశాంత్ కిషోర్ రూపంలో ప్రమాదం పొంచి ఉందని, ఇండియా కూటమి ఓట్లు పీకే బలంగా చీలుస్తున్నట్లున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
