Begin typing your search above and press return to search.

భూమ‌న సైలెంట్ అయితేనే బెట‌రా..!

ఏదో ఒక సమస్యను ఆయన తెరమీదకు తీసుకురావడంతో కూటమి ప్రభుత్వం సహజంగానే ఇరకాటంలో పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

By:  Garuda Media   |   23 Sept 2025 6:00 AM IST
భూమ‌న సైలెంట్ అయితేనే బెట‌రా..!
X

తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. ఏదో ఒక సమస్యను ఆయన తెరమీదకు తీసుకురావడంతో కూటమి ప్రభుత్వం సహజంగానే ఇరకాటంలో పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి కౌంటర్‌గా భూమనను కూడా కూటమి నాయకులు ఇరుకున‌పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వెలుగులోకి వచ్చిన అంశం 2023లో జరిగిన పరకామణి దొంగతనం. ఈ కేసు అప్పట్లోనే లోక్ అదాలత్‌లో పరిష్కారం అయింది. తాను చేసిన తప్పును క్షమించాలని కోరుతూ దొంగతనం చేసిన అధికారి ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి తన ఆస్తులు మొత్తాన్ని రాసిచ్చి రాజీ కుదుర్చుకున్నారు. అయితే, అలా కుదుర్చుకోవడాన్ని తప్పుపడుతూ ఇటీవల ఓ జర్నలిస్టు హైకోర్టును ఆశ్రయించటం, ఈ కేసు మళ్లీ తెర‌మీదకు రావడం సంచలనంగా మారింది. అయితే అసలు విషయం ఏంటంటే.. ఈ కేసులో మొత్తంగా అప్పటి చైర్మన్‌గా వ్యవహరించిన భూమన కరుణాకర్ రెడ్డి వ్యవహారమే చర్చనీయాంశంగా మారింది. ఇటీవల టీటీడీని టార్గెట్ చేస్తూ భూమన అనేక వ్యాఖ్యలు చేస్తున్నారు. రహదారి పక్కన పడి ఉన్న ఓ విగ్రహాన్ని విష్ణుమూర్తి విగ్రహమని ఆయన చెప్పడం తెలిసిందే.

అయితే.. అది శనైశ్చ‌ర విగ్రహం అని టిటిడి ఖండించింది. ఈ వివాదం కొనసాగుతున్న క్రమంలోనే పరకామణి దొంగతనం కేసు వ్యవహారం మళ్లీ తెర‌మీదకు రావడం.. భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి అప్పటి ఈవో ధర్మారెడ్డి వంటి వారి పేర్లు కూడా వినిపించడం వంటివి సంచలనంగా మారాయి. సాధారణంగా రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు కామనే. ప్రభుత్వాలపై విమర్శలు చేయడం కూడా తెలిసిందే. కానీ, భూమన కరుణాకర్ రెడ్డి ఉద్దేశ పూర్వకంగా చేస్తున్నారన్న వాదన టిడిపి నుంచి అదేవిధంగా ప్రభుత్వ వర్గాల నుంచి కూడా వినిపిస్తోంది.

ఈ క్రమంలో ఆయనను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం సహజం. ఇప్పటికే తిరుపతిలో టి డి ఆర్ బాండ్ల అక్రమ కేసు, అదేవిధంగా పరకామణి కేసుతో పాటు తిరుమల గోశాలలో ఆవులు చనిపోయంటూ చేసిన ప్రచారం, అంతకుముందు లడ్డు కల్తీ కేసు ఇలా చాలా కేసులు కరుణాకర్ రెడ్డికి చుట్టుకుని ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భూమన సాధ్యమైనంత సైలెంట్ అయితే ఉత్తమమని వైసిపి వర్గాల్లోని కొందరు ఆయనకు సూచిస్తున్నారు. లేనిపోని కేసులు నెత్తిన పెట్టుకొని జైలుకు వెళ్లడం కన్నా సైలెంట్ గా ఉంటే దానంత ఉత్తమ మరొకటి లేదన్నది ఈ నాయకులు చెబుతున్న మాట.

ప్ర‌స్తుతం ప‌ర‌కామ‌ణి దొంగ‌త‌నం కేసు తీవ్రంగా ఉంది. దాదాపు కోట్ల రూపాయల వ్యవహారం కావడం అప్పటి చైర్మన్ పాత్ర కూడా ఉండడం.. ఈ కేసును రాజీ చేసే ప్రయత్నం చేయడం వంటివి సంచలనంగా మరాయి. కాబట్టి ఈ క్రమంలో భూమన సైలెంట్ కావడమే ఉత్తమని తిరుపతి సహా ఉమ్మడి చిత్తూరు నాయకులు కూడా చెబుతున్నారు. మరి ఆయన ఏం చేస్తారో చూడాలి.