భోగాపురం పోర్టుకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?
ఇది అందుబాటులోకి వస్తే రాష్ట్రంలోనే అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చినట్లు అవుతుందని అంటున్నారు.
By: Tupaki Political Desk | 11 April 2026 4:53 PM ISTఉత్తరాంధ్రలోని భోగాపురం విమానాశ్రయ నిర్మాణం దాదాపు పూర్తి కావొచ్చింది. ఇంకా కేవలం రెండు శాతమే పనులు మిగిలి ఉండటంతో ప్రారంభోత్సవానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పెండింగ్ పనులు మరో నెల రోజుల్లో పూర్తి చేసి జులైలో ప్రధాని మోదీ చేతుల మీదుగా విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహననాయుడు ప్రకటించారు. జూలై 5న ప్రధాని పర్యటన ఉంటుందని, ఆ రోజే భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
భోగాపురం విమానాశ్రయ నిర్మాణం కొలిక్కి రావడంతో ప్రారంభోత్సవంపై ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది. విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసే కార్యక్రమానికి రావాలంటూ ప్రధాని మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ప్రస్తుతం విమానాశ్రయ నిర్మాణం పూర్తయిందని కేవలం చిన్నచిన్న తుది మెరుగులు దిద్దాల్సిన పనులు మాత్రమే ఉన్నట్లు చెబుతున్నారు. మరోవైపు విమానాశ్రయానికి జాతీయ రహదారి, బీచ్ రోడ్డకు కలిపే లింకు రోడ్ల పనులు వేగంగా పూర్తి చేస్తున్నారు.
ఇది అందుబాటులోకి వస్తే రాష్ట్రంలోనే అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చినట్లు అవుతుందని అంటున్నారు. రాష్ట్ర ఆర్థిక రంగానికి ఛోదక శక్తిలా మారిన విశాఖ నగరం మరింత అభివృద్ధి చెందేలా ఈ విమానాశ్రయం ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అదేవిధంగా విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర రూపురేఖలు కూడా మారనున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. విమానాశ్రయంలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించినట్లు ప్రభుత్వం చెబుతోంది. దాదాపు 3.8 కి.మీ. రన్ వే నిర్మించారు. ఇది దేశంలోనే అతిపెద్ద రన్ వేగా చెబుతున్నారు అదేవిధంగా 40 చెక్ ఇన్ కౌంటర్లు, 26 ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. 18 విమానాలను నిలిపే సామర్థ్యంతో ఏప్రాన్ ఏర్పాటు చేశారు.
రాష్ట్ర విభజన హామీల్లో ఒకటైన విమానాశ్రయం నిర్మాణం పూర్తికావడం విశేషంగా చెబుతున్నారు. రాష్ట్ర విభజన అనంతరం 2019 ఫిబ్రవరి 14న ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారిగా పునాది రాయి వేశారు. సుమారు 2,700 ఎకరాల్లో దీనిని నిర్మించాలని అప్పట్లో ప్రణాళిక రూపొందించారు. అయితే అప్పటికే ఎన్నికల సమయం దగ్గరపడటంతో పనులు ముందుకు చేయలేకపోయారు. ఆ తర్వాత కొలువుదీరిన వైసీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సైతం కొన్ని మార్పులతో భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణానికి సిద్దమయ్యారు. న్యాయపరమైన చిక్కులు, భూసేకరణ సమస్యలు పరిష్కారం అయిన తర్వాత 2023 మే 3న అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జీఎంఆర్ (GMR) గ్రూపుతో కలిసి అధికారికంగా పనులకు శ్రీకారం చుట్టారు.
ఇలా రెండుసార్లు శంకుస్థాపనలు జరిగిన భోగాపురం విమానాశ్రయం పనులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరుగులు పెట్టించారు. ఉత్తరాంధ్రకే చెందిన శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌరవిమానయాన మంత్రిగా ఉండటంతో ప్రతివారం పనులు సమీక్షించి విమానాశ్రయం నిర్మాణంలో జాప్యం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో కేవలం 21 నెలల కాలంలో పనులు పూర్తయి ప్రారంభానికి సిద్ధమైనట్లు ప్రభుత్వ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.
