ఏపీకే గ్రోత్ ఇంజన్...భోగాపురం ఎయిర్ పోర్టు
ఇదిలా ఉంటే 2026 వస్తూనే గుడ్ న్యూస్ ని ఉత్తరాంధ్రకే మోసుకుని వస్తోంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ట్రైల్ రన్‌గా జనవరి 4న తొలి వాణిజ్య విమానం ల్యాండ్ కానుంది.
By: Satya P | 4 Jan 2026 9:52 AM ISTఉత్తరాంధ్ర దశ దిశ ఒక్కసారిగా మారిపోతున్నాయి. వెనకబడిన జిల్లాలకు మహర్దశ పట్టబోతోంది. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం రాకతో ఉత్తరాంధ్రా జిల్లాలు ఏపీలోనే ముందు వరసలోనికి రాబోతున్నాయి. అలాగే విశాఖ విజయనగరం శ్రీకాకుళం మూడు జిల్లాలూ ఒక్కటిగా మారి ప్రగతిపధంలో దూసుకుని వెళ్ళబోతున్నాయి. ఇక ఏపీకే గ్రోత్ ఇంజన్ గా ఉత్తరాంధ్రా మారబోతోంది. ఈ ఎయిర్ పోర్టు అన్నది ఉత్తరాంధ్ర వాసుల చిరకాల కోరిక కల అన్నది కూడా ఇక్కడ చూడాల్సి ఉంది.
తొలి వాణిజ్య విమానం :
ఇదిలా ఉంటే 2026 వస్తూనే గుడ్ న్యూస్ ని ఉత్తరాంధ్రకే మోసుకుని వస్తోంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ట్రైల్ రన్‌గా జనవరి 4న తొలి వాణిజ్య విమానం ల్యాండ్ కానుంది. ఢిల్లీ నుంచి బయలుదేరే ఈ ఎయిర్ ఇండియా విమానం ఉదయం 11 గంటలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇతర విమానయాన శాఖ అధికారులతో రానుంది. ఈ చివరి ట్రయల్ కోసం అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసారు. అలాగే ఒక పండుగగా దీనిని నిర్వహించేందుకు కూటమి మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు భోగాపురం చేరుకుంటున్నారు. ఈ ట్రయల్ రన్ సక్సెస్ అయిన తర్వాత మే నెల నుంచే ఎయిర్‌పోర్ట్ నుంచి రాకపోకలు సాగించేందుకు సిద్ధంగా ఉండబోతోంది. ఈ మేరకు ఇతర విమానయాన సంస్థలతో కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతోంది.
ఇరవై నాలుగు గంటలూ :
ఇక మీదట ఉత్తరాంధ్రకు ఎవరు రావాలన్నా కూడా రాత్రీ పగలు అన్న తేడా లేదు, ఇరవై నాలుగు గంటల పాటు విమానాలు రాకపోకలు సాగించే విధంగా భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం రూపుదిద్దుకుంటోంది. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే కేవలం ఏపీకి మాత్రమే కాదు ఏకంగా దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రధాన ఆర్థిక కేంద్రంగా మారుతుందని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉత్తరాంధ్రా నుంచి డైరెక్ట్ గా అంతర్జాతీయ కనెక్టివిటీ ఉండబోతోంది. అలాగే వేలాది ఉద్యోగాలతో ఉత్తరాంధ్ర దశ పెద్ద ఎత్తున మారనుంది. ఇక ఈ విమానశ్రయానికి మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరుని పెట్టడం ఎంతో సముచితంగా ఉంది అని అంతా అంటున్నారు
తొలి ఏడాది 60 లక్షలుగా :
ఇదిలా ఉంటే భోగాపురం విమానాశ్రయం ద్వారా మొదటి ఏడాదిలోనే ఏకంగా అరవై లక్షల మంది ప్రయాణీకులు ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నారు. అక్కడ విశేషాలు ఏమిటి అంటే కనుక ముఖ గుర్తింపు ద్వారా పేపర్ లెస్ ఎంట్రీ ఉంటుంది. అలాగే 10 కంటే ఎక్కువ ఆధునిక ఏరోబ్రిడ్జిల ద్వారా నేరుగా విమాన ప్రవేశం ఉండబోతోంది. గంటకు 2,500 మంది ప్రయాణికులను నిర్వహించగల సామర్థ్యంతో సోర్ పవర్ తో అలాగే వర్షపు నీటి రీసైక్లింగ్ ద్వారాల లీడ్ గోల్డెన్ రేటింగ్ లక్ష్యంగా ఈ నిర్మాణం జరుపుకుంది. అదే విధంగా మొదటి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించేలా ఒక అతి పెద్ద టెర్మినల్ నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో దీనిని 1.8 కోట్ల వరకూ దీనిని పెంచే అవకాశం ఉంది. 2025 డిసెంబర్ నాటికి 91.7 శాతం పైగా పనులు ఇక్కడ పూర్తయ్యాయి. జనవరి 4 న విమానాల ట్రయల్ రన్ తో భోగాపురం నుంచి విమానం ఎగిరేందుకు అన్ని విధాలుగా రంగం సిద్ధం చేస్తున్నారు.
