ఉత్తరాంధ్ర ఆకాంక్షలను మోసుకుంటూ ఎగిరే మొదటి విమానం
ఏపీలో ఇపుడు ఉత్తరాంధ్ర కు ప్రాముఖ్యత పెరిగింది. ఇక్కడ అనేక ఐటీ పరిశ్రమలు తరలివస్తున్నాయి.
By: Satya P | 17 Dec 2025 8:00 AM ISTఏపీలో ఇపుడు ఉత్తరాంధ్ర కు ప్రాముఖ్యత పెరిగింది. ఇక్కడ అనేక ఐటీ పరిశ్రమలు తరలివస్తున్నాయి. అంతే కాదు కీలక ప్రాజెక్టులు సైతం ఈ ప్రాంతాన్ని ప్రగతి పధంలో నడిపిస్తున్నాయి. అన్నింటి కంటే ఎక్కువగా ఉత్తరాంధ్రలో ఒక అతి పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం రాబోతోంది. ఇది కూడా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుగా ఉండనుంది. పైపెచ్చు వెనుకబడిన ప్రాంతం అయిన విజయనగరం జిల్లాలోని భోగాపురంలో ఈ ప్రాజెక్ట్ రావడం మరింత ఆసక్తికరం. దాంతో అటు శ్రీకాకుళం ఇటు విజయనగరం కలసికట్టుగా ఎదుగుతాయని అంటున్నారు ఓవరాల్ గా చూస్తే విశాఖ తో పాటు ఉత్తరాంధ్రా జిల్లాలు అన్నీ అభివృద్ధిని పెద్ద ఎత్తున సాధిస్తాయని చెబుతున్నారు.
అనుకున్న దాని కన్నా :
ఇక భోగాపురం ఎయిర్ పోర్టు మొదటి దశ పనులు పూర్తి చేయడానికి 2026 జూన్ నెలకు డెడ్ లైన్ గా పెట్టుకున్నారు. ఆ నెలలో ఈ విమానాశ్రయం నుంచి తొలి విమానం ఎగురుతుందని చెప్పుకొచ్చారు. అయితే ఈ విమానాశ్రయ నిర్మాణం శరవేగంగా పూర్తి కావస్తూండడంతో డెడ్ లైన్ కంటే ముందే అంటే మే నెలలోనే తొలి విమానం ఎగురుతుందని లేటెస్ట్ న్యూస్ గా ఉంది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.
మరింత ముందుకు :
తొలి విమానం ఎగరడం తోనే అభివృద్ధి సైతం పరుగులు తీస్తుందని అంతా అంటున్నారు. ఎక్కడైనా అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పన చాలా ముఖ్యం. విమానయాన రంగం ద్వారా మరింతగా ఉత్తరాంధ్ర బయట ప్రపంచంతో కనెక్ట్ అవుతుందని భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయి విమానాల రాకపోకలతో ఎయిర్ ట్రాఫిక్ మరింతగా పెరుగుతుందని కూడా లెక్క వేస్తున్నారు. అదే విధంగా మరో వైపు చూస్తే ఐటీ పరిశ్రమలు, టూరిజం డెవలప్మెంట్, అలాగే ఇతర పరిశ్రమల రాకతో ఉత్తరాంధ్రా ఇంకా ప్రాముఖ్యత పొందుతోంది. ఈ నేపథ్యంలో కలసివచ్చినట్లుగా ఈ ఎయిర్ కనెక్టివిటీ కూడా కుదిరిన పక్షంలో ఉత్తరాంధ్రా అభివృద్ధికి ఆకాశమే హద్దుగా ఉంటుందని అంటున్నారు.
ఇది కూడా రికార్డే :
ఎక్కడైనా చెప్పిన సమయానికి కంటే కూడా చాలా లేట్ గా ప్రాజెక్టులు పూర్తి అవుతాయి. అయితే బోగాపురం ఎయిర్ పోర్టు మాత్రం అనుకున్న దాని కంటే శర వేగంగా పూర్తి కావడమే కాకుండా నెల ముందుగానే ఓపెనింగ్ కి నోచుకోవడం అంటే అది రికార్డుగానే చూస్తున్నారు కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాలు ఉండడం, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కూడా ఉత్తాంధ్రా జిల్లాలకు చెందిన వారు కావడంతోనే ఇది సాధ్యపడింది అని అంటున్నారు. సో ఉత్తరాంధ్ర ఆశలను కలలను ఆకాంక్షలను మోసుకుంటూ తొలి విమానం 2026 మే నెలలోనే ఎగురుతుందన్న మాట. సో ఇది అందరికీ స్వీట్ న్యూస్ గానే చూడాల్సి ఉంది.
