ఉత్తరాంధ్రా ఆశలకు రెక్కలు...భోగాపురంతో మారనున్న లెక్కలు
ఎక్కడి భోగాపురం మరెక్కడి ప్రపంచం. ఈ రెండింటికీ కనెక్షన్ కలపడం అంటే చెట్టు మీద మామిడి కాయకు సముద్రంలో ఉప్పుకు లింక్ కుదిర్చినట్లే.
By: Satya P | 5 Jan 2026 9:14 AM ISTఎక్కడి భోగాపురం మరెక్కడి ప్రపంచం. ఈ రెండింటికీ కనెక్షన్ కలపడం అంటే చెట్టు మీద మామిడి కాయకు సముద్రంలో ఉప్పుకు లింక్ కుదిర్చినట్లే. విశాఖ విమానాశ్రయం నేవీ కంట్రోల్ లో ఉంటుంది. దాంతో రాత్రి వేళ తొమ్మిది దాటితే ఇక విమానం ఎగరదు. ఎన్నో నియంత్రణలు ఉన్నాయి. దాంతో కొత్తగా విమానాశ్రయం కట్టుకోవాలని ఆలోచనలు అయితే ఉన్నాయి. కానీ ఆచరణలో మాత్రం అడుగు పడింది టీడీపీ హయాంలో 2014లో ఏపీలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం 2016 నాటికి భోగాపురం వద్ద ఎయిర్ పోర్టుని నిర్మించాలని తలపెట్టింది. ఎక్కడ భోగాపురం ఎక్కడ వైజాగ్ అసలు మరో విమానాశ్రయం ఆ మూలన కుదిరేనా అని అంతా అనుకున్నారు. కానీ ఈ రోజున అదే జరిగింది. భోగాపురం బెస్ట్ ప్లేస్ అవుతోంది. ఉత్తరాంధ్ర దశ మార్చే డెస్టినీ గా నిలుస్తోంది.
మూడు జిల్లాల మధ్యన :
ఇక భోగాపురం లోకేట్ అయి ఉన్నది మూడు జిల్లాలకు మధ్యన. దాంతో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఆపరేషన్స్ కనుక ఒక్కసారి స్టార్ట్ అయితే మూడు జిల్లాలూ సరిసమానంగా అభివృద్ధి చెందుతాయి. ఇంకా చెప్పాలీ అంటే విజయనగరం శ్రీకాకుళం వెనకబడిన జిల్లాలు అని పడికట్టు పదాలుగా ఇన్నాళ్ళూ అంటూ వచ్చిన వారికి భోగాపురం ఒక జవాబుగా నిలుస్తుంది. ఇక ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు అంటే ఆ వెనకనే ఎంతో డెవలప్మెంట్ తోసుకుని వస్తుంది. దాంతో ఉపాధి అవకాశాలే కాదు అన్నీ లభ్యమవుతాయి. ఇక ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కాబట్టి ఉత్తరాంధ్రా ఉత్పత్తులకు మార్కెట్ సైతం ఒక్కసారి అంతర్జాతీయంగా ఎగబాకుతుంది. వ్యాపారం వాణిజ్యం ఇలా అన్నీ ఎక్కడికో వెళ్ళిపోతాయి.
మోడీ చేతుల మీదుగా :
నిజానికి భోగాపురం విమానాశ్రయం ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి కావాలి. కానీ గడువు కంటే ఆరు నెలల ముందే అంటే జూన్ లోనే పూర్తి అయి ఎగిరిపోనుంది. ఇంతటి ప్రఖ్యాతి గడించిన విమానశ్రయాన్ని ప్రారంభించేది దేశ ప్రధాని నరేంద్ర మోడీ. జూన్ నెలలో మంచి ముహూర్తం చూసి మోడీ భోగాపురం నుంచి విమానాన్ని ఎగిరేలా చేస్తారు, అంతే కాదు ఉత్తరాంధ్రా ఆశలకు కూడా కొత్త రెక్కలు వచ్చేలా చూస్తారు అని అంటున్నారు.
ఉత్తరాంధ్రా నుంచే :
ఇదిలా ఉంటే ఏపీలో కూటమి చెబుతున్న అభివృద్ధి అన్నది ఉత్తరాంధ్రా నుంచే ప్రారంభం కావడం పట్ల హర్షం వ్యక్తం అవుతోంది. ఒక వైపు అమరావతి రాజధానిని కూడా బిగ్ స్కేల్ లో కూటమి ప్రభుత్వం రూపకల్పన చేస్తోంది. అదే విధంగా పోలవరం ప్రాజెక్ట్ సైతం వచ్చే ఏడాదికి పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో 2026 వస్తూనే ఉత్తరాంధ్రా నుంచి ఏపీ డెవలప్మెంట్ బోణీ కొట్టడం అంటే అంటున్నారు. అంతే కాదు తూర్పు తీరం నుంచి ప్రగతి దారులు వెతకడం కూడా వాస్తు పరంగా శుభంగా ఉంటుందని చెబుతున్నారు.
ఢిల్లీ నుంచి నేరుగా :
ఇదిలా ఉంటే ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో నేరుగా భోగాపురంలో వ్యాలిడేషన్ ఫ్లైట్ ల్యాండ్ అయింది. దీంతో ఈ సమీప ప్రాంతాల ప్రజలకు అది ఎంతో అద్భుతంగా కనిపించింది. నిజానికి విశాఖ సిటీతోనే ఎయిర్ పోర్టుకు ఎక్కువ అనుబంధం ఉంది. మిగిలిన ప్రాంతాల ప్రజలు విమాన ప్రయాణాలు పెద్దగా చేసి ఉండేది లేదు. అలాంటిది తమ ముంగిట విమానాశ్రయం రావడం ఇక మీదట అంతర్జాతీయ విమానాలు కూడా అక్కడే ల్యాండ్ అవుతాయని తెలియడం ఒక విశేషం అయితే ఆ కలను నిజం చేస్తూ వ్యాలిడేషన్ ఫ్లైట్ రూపంలో ఒక భారీ విమానం కళ్ళెదుట నిల్వడం అంటే పల్లె ప్రజలకు అందరికీ అది ఎంతో గొప్ప అనుభూతిగా మారింది. ఈ విమానాశ్రయం తమ పక్కనే ఉంది, తమతోనే ఉంది అన్న సంతోషం కూడా స్థానికులను మధురమైన భావనను అందిస్తోంది.
ఘనంగా ఒక వేడుకగా :
ఇక కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, జీఎంఆర్ గ్రూప్ నాయకత్వం సమక్షంలో ఎయిర్ ఇండియా విమానం ద్వారా ఈ వ్యాలిడేషన్ ఫ్లైట్ను చాలా ఘనంగా ఒక వేడుకగా నిర్వహించారు. ఒక విధంగా ఇది ఒక చరిత్ర అని కూడా అంటున్నారు. ఎందుకంటే అభివృద్ధి అంటే ఇంతకాలం పట్నాలలో ఒక మాదిరిగా డెవలప్ అయిన ప్రాంతాలలో కనిపిస్తుంది. కానీ ఏమీ కాని చోట మారుమూల ప్రాంతంలో ప్రగతికి అడుగులు పడడం అంటే శతాబ్దాల నాటి వెనకబాటుతనం ఒక్కసారిగా మటుమాయం అయినట్లే అని అంతా అంటున్న నేపథ్యం ఉంది.
సర్వం సిద్ధంగానే :
ఈ రన్ వే మీద విమానం సాఫీగా ల్యాండ్ కావడంతో అన్నీ సక్రమంగా ఉన్నట్లే అని అధికారులు చెబుతున్నారు. సిగ్నలింగ్ వ్యవస్థలతో పాటు అన్ని రకాలైన భద్రత పనితీరు బాగానే ఉంది అని అంటున్నారు. ఒక విమానాశ్రయానికి అధికారికంగా ఏరోడ్రం నుంచి లైసెన్స్ రావాలీ అంటే ఇవన్నీ పకడ్బందీగా ఉండాల్సిందే. ఇపుడు రూట్ క్లియర్ అయింది కాబట్టి రేపటి రోజున ఎన్నో వాణిజ్య విమానాలు తరలి వచ్చేందుకు కూడా మార్గం సుగమం అయినట్లే అంటున్నారు. ఇక ఈ విమానాశ్రయాన్ని 280 కిలోమీటర్ల తో అతి పెద్ద తుఫాను వచ్చినా తట్టుకునే సామర్ధ్యంతో నిర్మించారు. దాంతో ఏ ప్రకృతి విపత్తుకు ఇబ్బంది పడకుండా ఉక్కు మాదిరిగా నిర్మాణం చేపట్టారు అని అంటున్నారు.
