Begin typing your search above and press return to search.

భోగాపురం విమానాశ్రయం...భారీ ఉపాధికి కేంద్రం !

భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించారు కదా మాకు ఏమి ఒనగూడుతుందని ప్రశ్నించే వారికి త్వరలోనే అద్భుతమైన సమాధానం దొరుకుతుంది అని అంటున్నారు.

By:  Satya P   |   3 Aug 2026 10:00 PM IST
భోగాపురం విమానాశ్రయం...భారీ ఉపాధికి కేంద్రం !
X

భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించారు కదా మాకు ఏమి ఒనగూడుతుందని ప్రశ్నించే వారికి త్వరలోనే అద్భుతమైన సమాధానం దొరుకుతుంది అని అంటున్నారు. ఎయిర్ పోర్టు అంటే ఇంటర్నేషనల్ గా కనెక్ట్ అయి ఉండేది. అంటే ప్రపంచ దేశాల నుంచి ప్రయాణీకులు తరలి వస్తారు. రాకపోకలకు నిలయంగా ఉత్తరాంధ్రా ఉండబోతోంది. మరి ఎయిర్ ట్రాఫిక్ పెరిగి జనాలు పెద్ద ఎత్తున వస్తే దానికి సంబంధించి ఒకటేమిటి ఎన్నో రకాలైన ఉపాధి అవకాశాలు వాటితో పాటే వస్తాయని డెవలప్మెంట్ గురించి ఆలోచించేవారు విశ్లేషిస్తున్నారు.

బహుముఖంగా :

ఇదిలా ఉంటే భోగాపురం ఎయిర్ పోర్టుతోనే ఉత్తరాంధ్రా ఆర్థిక వ్యవస్థ పెద్ద ఎత్తున మారే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని అంటున్నారు. అయితే అది ఈ రోజుకు ఈ రోజు కాదు కనీసంగా మూడు నుంచి అయిదేళ్ళ లోపు అయితే ఉత్తరాంధ్రా కచ్చితంగా వేరే లెవెల్ కి వెళ్ళేలాగానే ప్రగతి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ రోజున విశాఖ ఎయిర్ పోర్టు నుంచి ఏడాదికి ముప్పయి లక్షల మంది దాకా ప్రయాణీకులు ప్రయాణం చేస్తున్నారు. అదే భోగాపురం నుంచి అయితే కచ్చితంగా ఈ నెంబర్ బాగా పెరుగుతుంది. ఏకంగా అది 45 లక్షల నుండి 50 లక్షల మంది వరకు అధికం అయ్యే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.

విమానాలూ పెరుగుతాయి :

ఇక భోగాపురం ఎయిర్ పోర్టుకు విశాఖ ఎయిర్ పోర్టుకు ఉన్నట్లుగా నేవీ వంటి వాటి నియంత్రణ ఉండదు కాబట్టి అవసరాన్ని బట్టి రాత్రీ పగలు ఎన్ని విమానాలు అయినా నడిపేందుకు వీలు ఉంటుంది. అది జాతీయ స్థాయితో పాటు అంతర్జాతీయ స్థాయిలోనొ నడుపుతారు. ఆ లెక్కన చూస్తే ఏకంగా ఒక ఎనభై దాకా విమానాలు కూడా ప్రతీ రోజూ రాకపోకలు సాగిస్తూ ఎగిరే పరిస్థితి ఉండొచ్చు అని అంటున్నారు. ఈ విధంగా విమానాలు వెళ్తున్నాయంటే ప్రయాణీకుల కోసం క్యాబ్ లకు ఇది బంగారు అవకాశమే అని అంటున్నారు. ఇప్పటిదాక ప్రయాణించే విశాఖ నగరం, విజయనగరం, అనకాపల్లి వంటి కొద్ది ప్రాంతాలకు తోడు రానున్న రోజులలో భీమిలి, యలమంచిలి, పార్వతీపురం, బొబ్బిలి, టెక్కలి, అరకు ఇలా ఒడిశా సరిహద్దు ప్రాంతాల వారు కూడా భోగాపురం ఎయిర్ పోర్టుని పూర్తిగా వినియోగించుకునే అవకాశాలు హెచ్చుగా ఉంటాయి.

క్యాబ్ రంగంలో కొత్త ఉపాధి :

దాంతో ఎయిర్ ట్రావెలర్స్ ట్రాఫిక్ రెట్టింపు అవుతుంది. అది క్యాబ్ లకు మంచి ఉపాధి మార్గంగా మారుతాయని అంటున్నారు. మరి వేలలో రోజూ ప్రయా ణం చేసే వారి కోసం క్యాబ్ లు కూడా ఉత్తరాంధ్రాలో కనీసంగా వేయి నుంచి రెండు వేల దాకా అవసరం అంటున్నారు. దీంతో క్యాబ్ రంగంలో కొత్త ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అన్న మాట. అంతే కాదు రానున్న రోజులలో విద్యుత్ కార్లు, టాక్సీల సంఖ్య కూడా పెరిగితే వాటి కోసం చార్జింగ్ కేంద్రాలు, బ్యాటరీ సేవా కేంద్రాలు, బ్యాటరీ మరమ్మత్తు కేంద్రాలు, విద్యుత్ వాహనాల నిర్వహణ కేంద్రాలు ఇలా వీటిని కూడా అనుబంధంగా ప్రారంభించవచ్చు. మరి అక్కడ కూడా బ్రహ్మాండమైన ఉపాధి అవకాశాలు ఉంటాయి.

ఆతీధ్య రంగంలోనూ :

ఇప్పటికే ప్రభుత్వం ఐదు నక్షత్రాల హొటళ్ళు విశాఖ భీమిలీ భోగాపురం ప్రాంతాలలో ఏర్పాటు చేస్తోంది. పర్యాటక శాఖ వీటిని చూస్తోంది. ఇక ట్రాఫిక్ ని బట్టి ప్రైవేట్ రంగంలో కూడా హోటళ్ళు చిన్న మధ్య స్థాయి నుంచి స్టార్ హొటళ్ళ దాకా పెద్ద ఎత్తున ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వీటి వెంటనే ఇతర అనుబంధ దుకాణాలు అయిన కిరాణా, ఐస్‌క్రీమ్, బేకరీలు, స్వీట్ షాపులు ఇలా ఎన్నో వస్తాయి. అదే విధంగా పెద్ద ఎత్తున బట్టల దుకాణాలు, చెప్పుల దుకాణాలు, మొబైల్ దుకాణాలు, వాహన మరమ్మత్తు కేంద్రాలు, టైర్ల దుకాణాలు, కార్ వాషింగ్ కేంద్రాలు, వాహనాల పార్కింగ్ స్థలాలు, కార్ల అద్దె కేంద్రాలు, ట్రావెల్స్, టాక్సీ కేంద్రాలు, సరుకు రవాణా కేంద్రాలు, గిడ్డంగులు ఒకటేమిటి అన్ని రకాలైనవి వస్తాయని అంచనా వేస్తున్నారు.

సేవా రంగంలో సైతం :

ఇక సేవా రంగం కూడా వృద్ధి చెందుతుందని అంటున్నారు. ఏటీఎంలు, అద్దె గదులు, సర్వీస్ అపార్ట్‌మెంట్లు, విశ్రాంతి గదులు, లాండ్రీ కేంద్రాలు, పెట్రోలు బంకులు విద్యుత్ వాహనాల చార్జింగ్ కేంద్రాలు, ద్విచక్ర వాహనాల చార్జింగ్ కేంద్రాలు, భారీ వాహనాల చార్జింగ్ కేంద్రాలు, సౌర విద్యుత్ ఆధారిత చార్జింగ్ కేంద్రాలు ఇలా అనేకం వస్తాయని చెబుతున్నరు. ఇంతే కాదు పర్యాటక రంగం కూడా గణనీయంగా అభివృద్ధికి చాన్స్ ఉంది. అరకు బొర్రా గుహలు, భీమిలి, రుషికొండ, యారాడ, సింహాచలం. శ్రీకూర్మం. అన్నవరం, ఒడిశా పర్యాటక ప్రాంతాలకు కూడా ప్రత్యేక పర్యాటక వాహనాలు నడిపే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఉత్తరాంధ్రకు అభివృద్ధి వరం :

అలాగే విమాన సరుకు రవాణాతో పాటు ఎగుమతులు, దిగుమతులు కోసం పారిశ్రామిక గిడ్డంగులు, ఔషధ రవాణా, చేపల ఎగుమతులు, పూల పండ్ల ఎగుమతులు, ఆన్‌లైన్ వస్తువుల పంపిణీ కేంద్రాలు, ఈ-వాణిజ్య సంస్థల గిడ్డంగులు, చిన్న పరిశ్రమలు, విద్యా సంస్థలు, శిక్షణా కేంద్రాలు ఇలా అనేకం వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అందువల్ల భోగాపురం ఎయిర్ పోర్టు వల్ల ఏమిటి లాభం అంటే కొద్ది సంవత్సరాలోనే ఉత్తరాంధ్ర దశ దిశ పూర్తిగా మారిపోతుందని ప్రగతి కాముకులు స్పష్టమైన విశ్లేషణలతో వివరిస్తున్నారు. సో భోగాపురం నిజంగా ఉత్తరాంధ్రాకు అభివృద్ధి వరం అన్నది నిజం.