Begin typing your search above and press return to search.

ఎర్ర బస్సు.. ఎయిర్ బస్సు...జగన్ కి స్ట్రాంగ్ గానే !

ఇది సోషల్ మీడియా యుగం. అందువల్ల ఎవరైనా ఏ విషయం మీద అయినా ఆచీ తూచీ మాట్లాడాల్సి ఉంటుంది.

By:  Satya P   |   2 Aug 2026 1:41 AM IST
ఎర్ర బస్సు.. ఎయిర్ బస్సు...జగన్ కి స్ట్రాంగ్ గానే !
X

ఇది సోషల్ మీడియా యుగం. అందువల్ల ఎవరైనా ఏ విషయం మీద అయినా ఆచీ తూచీ మాట్లాడాల్సి ఉంటుంది. ఒక్కసారి గూగుల్ ని సెర్చ్ చేస్తే పాత విషయాలు అలా గటగటమని బయటకు వచ్చేస్తాయి. భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభం విషయంలో క్రెడిట్ వార్ వైసీపీ వర్సెస్ కూటమి ప్రభుత్వం గా సాగుతున్న వేళ వేదిక మీద ఉన్న టీడీపీ జనసేన పార్టీల నేతలు ఎర్ర బస్సు ఎయిర్ బస్సు అంటూ చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా వైరల్ అయిపోయాయి. ఇంతకీ ఎర్ర బస్సు ఎయిర్ బస్సు ఏమిటి రైమింగ్ బాగానే ఉంది, మ్యాటర్ ఏంటి అంటే అది కరెక్ట్ టైం లోనే వైసీపీ మీద ఒక ఆయుధంగా గురిపెట్టి మరీ కూటమి పెద్దలు ఉక్కిరిబిక్కిరి చేశారు. చంద్రబాబు పవన్ నుంచి లోకేష్ రామ్మోహన్ నాయుడు దాకా అంతా కలసి వైసీపీకి గుక్క తిప్పుకోలేని విధంగా సెటైర్లు వేశారు.

ఆనాడు జరిగిందేంటి :

అప్పట్లో అంటే 2014 నుంచి 2019 మధ్య నడిచిన టీడీపీ జమానాలో భోగాపురం వద్ద ఎయిర్ పోర్టు నిర్మించాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సహజంగానే భూములు ఇచ్చేందుకు రైతులు మొదట్లో వ్యతిరేకత చూపించారు. వారిని పరామర్శించిన క్రమంలో జగన్ ఆనాడు తన పార్టీ వారితో కలసి మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఒక బాధితురాలు అయితే తమకు ఉన్నది రెండు ఎకరాలు భూమి మాత్రమే అని ఎర్ర బస్సు ఆగని చోట ఎయిర్ పోర్టు ఎందుకు సారూ అని తమ భూములు తీసుకుంటున్నారు అని జగన్ తో చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేసింది. జగన్ కూడా ఆమె ఈ విధంగా అంటోంది అని మరోసారి దానిని మైక్ ద్వారా రిపీట్ చేశారు. ఇక్కడ చెప్పాల్సింది ఏంటి అంటే జగన్ నేరుగా ఎర్ర బస్సు అనలేదు కానీ బాధితుల వాదనను రిపీట్ చేశారు అది అలా గూగుల్ పదిలం చేసింది. కరెక్ట్ టైంలో కూటమి నేతలు దాని ప్రయోగించి క్రెడిట్ చోరీ అంటున్న వైసీపీకి ఈ విధంగా భారీ షాక్ ఇచ్చేశారు.

వైసీపీ కార్నర్ గానే :

ఎర్ర బస్సు ఆగని చోట ఎయిర్ బస్సు అని జగన్ అన్నారని కూటమి నేతలు భోగాపురం ఓపెనింగ్ వేళ గట్టిగానే ఎటాక్ చేశారు. తమ నేత అలా అనలేదని బాధితుల మాట అని వైసీపీ సర్దిచెప్పుకునే ప్రయత్నంలో పాత వీడియోను తీసి పోస్టు చేసింది. కానీ జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోయింది అని అంటున్నారు. దీనికి కారణం అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కచ్చితమైన స్టాండ్ ని ఎవరైనా తీసుకోవాలి. ఒక ప్రాజెక్ట్ రావాలంటే సవాలక్ష సమస్యలు ఉంటాయి. అందులో భూసేకరణ అన్నది ప్రధానం. అయితే ప్రతిపక్షంగా బాధితుల పక్షం వైసీపీ వహించడంలో తప్పు లేదు కానీ అదే సమయంలో తమ స్టాండ్ ఇదని గట్టిగా చెప్పలేకపోయింది అన్న చర్చ వస్తోంది. దాని ఫలితమే ఈ సెటైర్లు స్ట్రాంగ్ కామెంట్స్ అని అంటున్నారు.

రాజకీయాలే కాదు :

దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి. అక్కడ అభివృద్ధి ఉంటుంది. రాజకీయం ఉంటుంది. కానీ అభివృద్ధిని రాజకీయాన్ని మిక్స్ చేయడం లేదు. అందుకే అక్కడ ఇంతలా క్రెడిట్ వార్స్ కానీ ఒకరిని మరొకరు కార్నర్ చేసే పాలిటిక్స్ కానీ జరగవని గుర్తు చేస్తున్నారు. ఏపీలో మాత్రం రాజకీయ పార్టీలు ప్రత్యర్ధుల స్థాయిని దాటి శత్రువులుగా భావించించుకుంటూ చేసే రాజకీయం మూలంగానే ఈ పరిస్థితి ఏర్పడుతోంది అని అంటున్నారు. అభివృద్ధి విషయంలో ఒక్కటిగా నిలిస్తే ఇలాంటి ఇబ్బందులు రావని అంటున్నారు.