భోగాపురం విమానాశ్రయం- అనుబంధ రంగాలతో 5000 ఉద్యోగాలు.. కేటుగాళ్లున్నారు జాగ్రత్త!
ఈ ఉద్యోగాలను సాధించడానికి డిగ్రీ అర్హతతో పాటు కొన్ని అదనపు సామర్థ్యాలు అవసరమవుతాయి. ముఖ్యంగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలో సంభాషణ నైపుణ్యాలు ఉండాలి.
By: Sivaji Kontham | 27 July 2026 9:46 AM ISTభోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర ప్రాంతపు రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయనే విశ్లేషణ సాగుతోంది. ఈ బృహత్తర ప్రాజెక్టు ద్వారా కేవలం విమానయాన రంగానికే కాకుండా... దానికి అనుబంధంగా ఏర్పడే రకరకాల పరిశ్రమల ద్వారా 5 వేలకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు లభిస్తాయని ఒక అంచనా. విమానాశ్రయ నిర్వహణతో పాటు పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించి, స్థానిక ఆర్థిక వ్యవస్థకు గొప్ప ఊతం లభిస్తుంది.
ఈ ప్రణాళికలో భాగంగా విమానాశ్రయం చుట్టూ ప్రత్యేక ఆర్థిక మండలాలు, విమానాశ్రయ నగర రంగాలు రూపుదిద్దుకోనున్నాయి. వీటి ద్వారా సరుకుల రవాణా, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్, హోటళ్లు, రెస్టారెంట్లు, పర్యాటకం, ఇతర వ్యాపార సముదాయాలు విస్తరిస్తాయి. వీటితో పాటు ప్రయాణికుల రవాణా సేవలు, వాహన పార్కింగ్ నిర్వహణ, విమానాశ్రయ భద్రత, కార్యాలయాల నిర్వహణ వంటి విభాగాలలో విస్తృత స్థాయిలో ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి.
సాధారణ డిగ్రీ విద్యార్హత కలిగిన యువతకు ఈ ప్రాజెక్టులో అత్యధికంగా సాంకేతికతతో ప్రమేయం లేని ఉద్యోగాలు లభిస్తాయి. ప్రయాణికుల సహాయక సిబ్బంది, టికెట్ల విక్రయ ప్రతినిధులు, ప్రయాణికుల నమోదు స్థానాల నిర్వాహకులు, విమానాశ్రయ సమాచార కేంద్ర ప్రతినిధులుగా అవకాశాలు లభిస్తాయి. అలాగే రవాణా డాక్యుమెంట్ల పరిశీలన, సరుకుల రవాణా పర్యవేక్షణ, దుకాణాల నిర్వాహకులు, ప్రముఖుల విశ్రాంతి కేంద్రాల ప్రతినిధులుగా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు కొలువులు సాధించవచ్చు.
కార్యాలయ నిర్వహణ, భద్రతా విభాగాలలో కూడా డిగ్రీ అభ్యర్థులకు మంచి ప్రాధాన్యం ఉంటుంది. ఎంట్రాన్స్ కార్యాలయ నిర్వాహకులు, మానవ వనరుల సహాయకులు, ఖాతాల నిర్వహణ ప్రతినిధులు, ప్రయాణికుల డాక్యుమెంట్ల తనిఖీ, భద్రతా ప్రక్రియల పర్యవేక్షకులుగా ఉద్యోగ స్థానాలు భర్తీ అవుతాయి. కామర్స్ విభాగంలో పట్టా పొందిన వారికి బిల్లింగ్ , లెక్కల నిర్వహణ విభాగాలలో ప్రత్యేక అవకాశాలు లభిస్తాయి.
ఈ ఉద్యోగాలను సాధించడానికి డిగ్రీ అర్హతతో పాటు కొన్ని అదనపు సామర్థ్యాలు అవసరమవుతాయి. ముఖ్యంగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలో సంభాషణ నైపుణ్యాలు ఉండాలి. ప్రయాణికుల సమస్యలను సమయస్ఫూర్తితో పరిష్కరించే నేర్పు, ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం, వృత్తిపరమైన వ్యక్తిత్వ వికాసం కలిగి ఉంటే ఈ విమానాశ్రయ అనుబంధ రంగాలలో సులువుగా ఉపాధి పొందవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే భోగాపురం ఉద్యోగాల పేరుతో మోసం చేసే మాయగాళ్ల వలకు పడకుండా జాగ్రత్తగా సరైన మార్గంలో మాత్రమే ఉద్యోగ అన్వేషణ సాగించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా పరిశ్రమ ప్రారంభమవుతోంది అంటే, నిరుద్యోగులను ఎన్ క్యాష్ చేసుకునేందుకు మోసపూరిత ఆన్ లైన్ ప్రకటనలు జారీ చేసే ఇలాంటి కేటుగాళ్ల విషయంలో యువత ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికీ ఎలాంటి డబ్బును చెల్లించవద్దని అధికారులు చెబుతున్నారు.
