మొక్కే కదా అని వదిలేయలేదు.. భోగాపురంలో వైరల్ వీడియో
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా ముగిసింది.
By: Tupaki Political Desk | 2 Aug 2026 2:52 PM ISTఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా ముగిసింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌ను శనివారం ఘనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ చారిత్రాత్మక వేడుకకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతితులుగా విచ్చేశారు. దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకే వేదికపైకి వస్తున్నారన్న వార్తతో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. అంచనాలను మించి సుమారు మూడు లక్షల మందికి పైగా జనం ఈ సభకు హాజరు కావడంతో ప్రాంగణమంతా కిటకిటలాడింది. అంగరంగ వైభవంగా సాగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది.
అయితే, ఈ కార్యక్రమం విజయవంతం కావడమే కాకుండా, సభ ముగిసిన తర్వాత చోటుచేసుకున్న ఓ ఘటన ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ వేడుకల కంటే కూడా, అక్కడ జరిగిన ఒక సరదా సంఘటనకు సంబంధించిన వీడియోలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. సభ ముగిసి నాయకులు, ప్రముఖులు వెనుదిరిగిన వెంటనే, సభా ప్రాంగణంలోనూ, ఎయిర్‌పోర్ట్ ప్రవేశ మార్గంలోనూ సుందరీకరణ కోసం ప్రత్యేకంగా అమర్చిన అలంకరణ మొక్కలను కొందరు సభికులు పీక్కుని మరీ ఇళ్లకు తరలించుకుపోయారు. లక్షలాదిగా వచ్చిన జనప్రవాహంలో కొందరు ఉత్సాహంతోనో, లేదా ఈ చారిత్రాత్మక జ్ఞాపకంగా తమతో పాటు తీసుకెళ్లాలన్న సరదాతోనో అక్కడి మొక్కలను కుండీలతో సహా ఎత్తుకెళ్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఇందుకు సంబంధించిన దృశ్యాలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. విమానాశ్రయం ప్రారంభోత్సవ విశేషాలు, ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ప్రసంగాల కంటే ఈ మొక్కల ఎపిసోడ్‌పైనే నెటిజన్లు ఎక్కువగా చర్చించుకుంటున్నారు. కొందరు దీనిని సరదాగా కొట్టిపారేస్తుంటే, మరికొందరు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై సోషల్ మీడియా వేదికగా భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ, దశాబ్దాల కల అయిన భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం అభివృద్ధి పరంగా ఎంత ప్రాధాన్యత సంతరించుకుందో, ఈ మొక్కల ఎపిసోడ్‌తో సోషల్ మీడియాలో అంతకుమించి వైరల్ అయ్యి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
కొత్త విమానాశ్రయం ప్రారంభంతో ఈ ప్రాంతం అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతుందని అందరూ సంతోషం వ్యక్తులతో మురిసిపోతున్న వేళ, ఈ తరహా చిన్నచిన్న దృశ్యాలు సోషల్ మీడియాలో కేవలం సరదా చర్చలకే పరిమితమయ్యాయి. అభివృద్ధి సంబరాల నడుమ ఇలాంటి యాదృచ్ఛిక ఘటనలు పండుగ వాతావరణంలో చిన్న సరదా జ్ఞాపకాలుగా నిలుస్తుంటాయని, వీటిని కేవలం సరదా కోణంలోనే చూడాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి, ఉత్తరాంధ్ర భవిష్యత్తును మార్చే అభివృద్ధి పర్వంతో పాటు, ఈ సరదా ఘటన కూడా ఈ ప్రారంభోత్సవ వేడుకలో ఒక విశేషంగా నిలిచింది.
