భోగాపురం విమానం ఎగిరేది అపుడే !
ఉత్తరాంధ్ర దశ తిరగబోతోంది. ఉమ్మడి మూడు జిల్లాలకు వైభవం పట్టనుంది. ఎందుకంటే అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర మూడు జిల్లాల మధ్యలో ఉంది.
By: Satya P | 14 Sept 2025 8:00 AM ISTఉత్తరాంధ్ర దశ తిరగబోతోంది. ఉమ్మడి మూడు జిల్లాలకు వైభవం పట్టనుంది. ఎందుకంటే అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర మూడు జిల్లాల మధ్యలో ఉంది. భోగాపురం అటు విజయనగరం శ్రీకాకుళం ఇటు విశాఖకు మధ్యలో ఉంది. దాంతో ఈ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వల్ల ఏకమొత్తంగా మూడు జిల్లాలు అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తాయని అంటున్నారు. అంతే కాదు అన్ని రంగాలలో అనూహ్యమైన గ్రోత్ నమోదు అవుతుందని అంటున్నారు.
జూన్ నుంచి రెడీ :
భోగాపురంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు మొదటి దశ పనులు జూన్ కి పూర్తి అవుతాయని దాంతో జూన్ నుంచి అందుబాటులోకి వస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఒక విధంగా ఇది ఉత్తరాంధ్రాకు శుభవార్త గానే చూడాలని అంటున్నారు. రెండు దశలుగా ఈ విమానాశ్రయం పనులు శరవేగంగా సాగుతున్నాయి. తొలి దశ పనులు అందుబాటులోకి వస్తే భోగాపురం నుంచి విమానం ఎగురుతుందని అంటున్నారు. ఆనాటి నుంచే ఎయిర్ లైన్స్ ఆపరేషన్స్ ప్రారంభమవుతాయనీ, అదే విధంగా ఇప్పటికే కాలిబ్రేషన్ టెస్ట్ విజయవంతంగా పూర్తయిందని కేంద్ర మంత్రి చెప్పడం విశేషం.
ఎయిర్ కనెక్టివిటీ సిద్ధం :
జూన్ నుంచి ఎయిర్ పోర్టు కార్యకలాపాలు మొదలయ్యే లోగానే రోడ్డు కనెక్టివిటీ కూడా రెడీ అవుతుందని కేంద్ర మంత్రి చెబుతున్నారు. ఉత్తరాంధ్రా జిల్లాలు అయిన విశాఖ విజయనగరం శ్రీకాకుళం నుంచి భోగాపురం ఎయిర్ పోర్టుకు రోడ్డు కనెక్టివిటీ పనులు వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి అవుతాయని చెప్పారు. అంతే కాదు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుగా భోగాపురం తయారు అవుతోంది కాబట్టి పెద్ద ఎత్తున విదేశీ విమానాలు లాండ్ అవుతాయని అంటున్నారు. విశాఖ నుంచి అతి తక్కువ సమయంలో భోగాపురం ఎయిర్ పోర్టుకు చేరుకోవడానికి కూడా అద్భుతమైన రోడ్ కనెక్టివిటీ సిద్ధం అవుతోందని అన్నారు.
తొలి దశలో ఇవన్నీ పూర్తి :
ఇక తొలి దశలో దాదాపుగా 4,500 కోట్ల రూపాయల వ్యయంతో 2,200 ఎకరాలలో 22 ఏరో బ్రిడ్జ్‌లతో పాటు, 81 వేల చదరపు మీటర్ల టెర్మినల్ బిల్డింగ్ నిర్మించనున్నారు. అలాగే మిగిలి ఉన్న మరో 500 ఎకరాలను ఇతర అవసరాలకు కేటాయిస్తున్నారు. ఇక 3.8 కిలోమీటర్ల పొడవుతో రెండు రన్‌వేలను నిర్మిస్తున్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు స్టార్టింగులోనే అరవై లక్షల దాకా ప్రయాణీకుల సంఖ్య ఏటా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అది మరింతగా పెరిగి ఏడాదికి నాలుగు కోట్లకు చేరుకుంటుందని దాంతో బ్రహ్మాండమైన ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులలో ఇది ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు.
ఉత్తరాంధ్రకు ఆయువుపట్టుగా :
భోగాపురం విమానాశ్రయం ఉత్తరంధ్రాకే ఆయువు పట్టుగా నిలుస్తుందని అంటున్నారు. ఒక్కసారి కనుక విమానం ఇక్కడ నుంచి ఎగిరితే అత్యంత వెనకబడిన ఉత్తరాంధ్రా ప్రాంతంలో దశ తిరిగినట్లే అని అంటున్నారు. టూరిజం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుందని అలాగే ఇతర కార్యకలాపాలు పారిశ్రామీకరణతో పాటు వివిధ రంగాలలో పెట్టుబడులు కూడా ఊపందుకుంటాయని భావిస్తున్నారు.
