Begin typing your search above and press return to search.

భోగాపురం ఎయిర్ పోర్ట్ క్రెడిట్ ఎవరిదో తేల్చేసిన చంద్రబాబు

ఉత్తరాంధ్రకు మణిమకుటంగా మారిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఈ రోజు ప్రారంభమైన సంగతి తెలిసిందే.

By:  Garuda Media   |   1 Aug 2026 7:37 PM IST
భోగాపురం ఎయిర్ పోర్ట్ క్రెడిట్ ఎవరిదో తేల్చేసిన చంద్రబాబు
X

ఉత్తరాంధ్రకు మణిమకుటంగా మారిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఈ రోజు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే, భోగాపురం విమానాశ్రయం కట్టిన క్రెడిట్ ఎవరిది అంటూ ఇటు మీడియాలో అటు సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో చర్చ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆ విషయంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. భోగాపురం విమానాశ్రయ పనుల ప్రారంభోత్సవానికి కొబ్బరికాయ కొట్టింది మనమే...ఈ రోజు భోగాపురం విమానాశ్రయం పూర్తయిన తర్వాత గుమ్మడికాయ కొట్టింది కూడా మనమే అని చంద్రబాబు అన్నారు.

ఈ విమానాశ్రయ ఏర్పాటుకు తొలి అడుగు వేసింది ఆనాటి కేంద్ర విమానయానశాఖా మంత్రి అశోక్ గజపతిరాజు అని, ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి చేసే బాధ్యతను తీసుకున్న కేంద్ర విమానయాన శాఖా మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు కూడా ఉత్తరాంధ్ర వ్యక్తే అని..ఈ ఎయిర్ పోర్ట్ కట్టిన జీఎంఆర్ కూడా ఉత్తరాంధ్ర వాసి అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఈ విమానాశ్రయం కోసం తమ భూములు ఇచ్చిన రైతులకు పాదాభివందనం చేస్తున్నానని చంద్రబాబు అన్నారు. ఇక, ఈ విమానాశ్రయం వల్ల ఉత్తరాంధ్ర రూపురేఖలు, దశ దిశ మారబోతున్నాయని అన్నారు.

విశాఖకు గూగుల్ తో పాటు ఉత్తరాంధ్రకు ఎన్నో సంస్థలు వచ్చాయని గుర్తు చేశారు. గత పాలకుల వల్ల విద్వంసమైన రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చిన వ్యక్తి ప్రధాని మోదీ అని కొనియాడారు. ఆయన సహకారంతో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులకు పెట్టుబడులు రాబోతున్నాయని చెప్పారు. విశాఖ ఉక్కును కాపాడిన ఉక్కుమనిషి ప్రధాని మోదీ అని ప్రశంసించారు

రాజధాని అమరావతికి నిధులు ఇచ్చి అండగా నిలబడిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ అండతో 2028 నాటికి అమరావతి తొలి దశ పనులు పూర్తవుతాయని, ఆయన చేతుల మీదుగానే ప్రారంభిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 12 ఏళ్లుగా దేశాన్ని సమర్ధవంతంగా నడిపిస్తున్న నేత మోదీ అని, అవినీతి ఆరోపణలు లేకుండా పాలన సాగిస్తున్న గొప్ప నేత మోదీ అని ప్రశంసలు కురిపించారు. ప్రతి విషయంలో నేషన్ ఫస్ట్ అనే ప్రధానిని తన జీవితంలో తొలిసారి చూస్తున్నానని చెప్పారు.