Begin typing your search above and press return to search.

భోగాపురం విమానాశ్రయం సిద్ధం.. ప్రారంభం ఎప్పుడంటే?

విశాఖ సమీపంలో నిర్మిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ నెలాఖరులోగా టెస్ట్ ఫ్లైట్ కు సిద్ధమయ్యేలా పూర్తి చేస్తున్నారు.

By:  Tupaki Political Desk   |   30 Nov 2025 4:05 PM IST
భోగాపురం విమానాశ్రయం సిద్ధం.. ప్రారంభం ఎప్పుడంటే?
X

విశాఖ సమీపంలో నిర్మిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ నెలాఖరులోగా టెస్ట్ ఫ్లైట్ కు సిద్ధమయ్యేలా పూర్తి చేస్తున్నారు. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం వచ్చే ఏడాది జూన్ నాటికి భోగాపురం విమానాశ్రయం నిర్మాణాలు పూర్తికావాల్సివుంది. అయితే ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణ, కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహననాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపడంతో ఎయిర్ పోర్టు పనులు పరుగులు తీస్తున్నాయి. గడువు ముందే పనులు పూర్తి చేయాలని పట్టుదల ప్రదర్శిస్తుండటంతో డిసెంబరు నెలాఖరు నాటికి విమానాశ్రయ నిర్మాణం కొలిక్కి వచ్చే పరిస్థితి ఉందని అంటున్నారు.

ప్రస్తుతం విమానాశ్రయ పనులు 92 శాతం మేర పూర్తయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర మంత్రి రామ్మోహననాయుడు ప్రతి 15 రోజులకు ఒకసారి భోగాపురం వస్తూ పనులను పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా జూన్ లో విమానాశ్రయాన్ని ప్రారంభించాలని, అప్పటి నుంచి భోగాపురం విమానాశ్రయానికి విమానాలు రాకపోకలకు వీలుగా విమానయాన సంస్థలతో చర్చలు కూడా మొదలుపె్టారని అంటున్నారు. విశాఖలో ఈ నెలలో జరిగిన పెట్టుబడుల సదస్సులో అంతర్జాతీయ విమానాశ్రయం పరిధిలో టూరిజం, హోటల్స్ రంగాలకు సంబంధించిన చాలా సంస్థలు ముందుకు వచ్చాయి. దీంతో ప్రస్తుతం ఉత్సాహంతో పనులు జరుగుతున్నాయి. మిగిలిన 8 శాతం పనులు పూర్తి చేసి టెస్ట్ రైడ్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

విభజన హామీల్లో భాగంగా ఏపీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కేంద్రం మంజూరు చేసింది. దీనిని ఉత్తరాంధ్రలో ఏర్పాటు చేయాలని 2014-19 మధ్య కాలంలోనే సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న విశాఖ విమానాశ్రయం రక్షణ శాఖ పరిధిలో నడుస్తోంది. దీంతో ప్రయాణికుల కోసం భోగాపురంలో విమానాశ్రయం నిర్మించాలని 2019 ఫిబ్రవరిలో చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో శంకుస్థాపన చేశారు. పనులు ప్రారంభమైన కొద్దినెలలకే ఆయన పదవీకాలం పూర్తయింది. దీంతో కొన్నాళ్లు విమానాశ్రయం నిర్మాణం నిలిచిపోయింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం.. భోగాపురం విమానాశ్రయ నిర్మాణ ప్రతిపాదనను కొద్ది మార్పులతో 2023లో తిరిగి ప్రారంభించింది. 2023 మేలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేయగా, 2024 మేలో జరిగిన ఎన్నికల్లో ఆయన ప్రభుత్వం దిగిపోయింది.

దీంతో 2024లో అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు భోగాపురం విమానాశ్రయాన్ని ప్రత్యేక శ్రద్ధతో తిరిగి పనులు ప్రారంభించారు. గత 15 నెలల నుంచి పనులు చకచకా జరుగుతుండటం, కేంద్ర పౌరవిమానయాన మంత్రి రామ్మోహననాయుడు కూడా ఈ ప్రాంతం వారే కావడంతో భోగాపురం నులు తిరిగి ఊపందుకున్నాయి. అదేసమయంలో కాంట్రాక్టు సంస్థ జీఎంఆర్ అధినేత మల్లికార్జున రావు కూడా ఇదే ప్రాంతీయుడు కావడంతో ఆ సంస్థ కూడా విమానాశ్రయ నిర్మాణంపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. కాగా, ఈ విమానాశ్రయానికి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఈ విమానాశ్రయంలో దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యంత పొడవైన రన్ వేను నిర్మిస్తున్నారు. మొత్తం 3.8 కిలోమీటర్ల పొడవైన రన్ వే దాదాపు 99 శాతం పూర్తయింది. అదేవిధంగా ట్యాక్సీ వే 98 శాతం, టెర్నినల్ 90 శాతం, ఏసీటీ టవర్ 72 శాతం పూర్తయ్యాయి.