అంపశయ్య మీద భీష్ముడు ఎందుకు ఉండాల్సి వచ్చింది ?
భీష్ముడు ఎంతటి ధీరోదాత్తుడు మరెంతటి ఉదాత్తుడు అన్నది పురాణాలు తెలిసిన వారికి తెలిసిందే.
By: Satya P | 29 Jan 2026 8:15 AM ISTభీష్ముడు ఎంతటి ధీరోదాత్తుడు మరెంతటి ఉదాత్తుడు అన్నది పురాణాలు తెలిసిన వారికి తెలిసిందే. తన తండ్రి ద్వితీయ వివాహం కోసం తాను ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోయాడు. ఎంతో త్యాగం చేశాదు. ఇక కౌరవ వంశం ఎక్కడా వినాశనం కాకుండా చివరి దాకా కృషి చేశాడు. ధర్మానికి పెట్టింది పేరుగా ఉండే భీష్ముడు మనవలు అయిన కౌరవులు పాండవుల మధ్యన వివాదాలు రాకుండా తన వంతు ప్రయత్నం అయితే చేశాడు. కానీ చివరికి యుద్ధం వచ్చినపుడు మాత్రం కౌరవ పక్షమే వహించాడు. తన శక్తియుక్తులు అన్నీ అర్పించి పాండవ సేనలను దునుమాడాడు. మొత్తానికి శిఖండి వల్ల ఆయన యుద్ధం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే వరం మూలంగా తన స్వీయ మరణం తానే కోరుకునే అవకాశం ఉండడం వల్ల ఉత్తరాయణం వచ్చేంతవరకూ అంపశయ్య మీద భీష్ముడు అలా ఉండిపోయాడు. దైవ నామస్మరణ చేసుకుంటూ మాఘ మాసం ఏకాదశి రోజున తన తనువు చాలించాడు. అందుకే ఆ రోజును ఎంతో పుణ్య దినంగా భీష్మ ఏకాదశిగా భావిస్తారు. ఈసారి ఫిబ్రవరి 29 గురువారం భీష్మ ఏకాదశి వచ్చింది. దాంతో భక్త జనం అంతా ఆ రోజున విష్ణు నామ స్మరణలో తేలియాడుతారు.
ముల్లులా గుచ్చుకుంటోంది :
అంపశయ్య అంటే బాణాలతో తయారు చేసినది. ముల్లులా గుచ్చుకునే దాని మీద అప్పటికే వయో వృద్ధుడైన భీష్ముడు పూల పానుపు మాదిరిగా తలచి తన జీవిత చివరి ఘడియలను గడిపాడు. ఎన్నో రోజుల పాటు అంపశయ్య మీద భీష్ముడు అక్కడ ఉన్నారు. మరి అన్ని రోజులు ఎందుకు ఆ పుణ్యాత్ముడు ఉండాల్సి వచ్చింది అంటే దాని జీవిత కాలంలో చేసిన దోషాలకు పరిహారంగా అని చెబుతారు. ఇంతకీ భీష్ముడు ఏమి దోషం చేశాడు అంటే ద్రౌపదికి నిండు కౌరవ సభలో అవమానం జరిగింది. ఆ సమయంలో భీష్ముడు సభలోనే ఉన్నాడు. కానీ దానిని ఆపలేకపోయాడు. అందుకే అది దోషంగా భీష్ముడు భావించాడు. అంపశయ్య మీద నరకం అనుభవిస్తూ ప్రాయశ్చిత్తం చేసుకున్నాడని పురాహేతిహాసాలలో చెబుతారు.
ఉప్పు తిన్నందుకే :
అయితే ఇంతటి దోషం అని తెలిసి కూడా భీష్ముడు ఎందుకు సభలో దుర్యోధనుడిని అడ్డుకోలేకపోయాడు అని ధర్మరాజు అడుగుతాడు. దానికి భీష్ముడు బదులిస్తూ తాను ఇన్నాళ్ళూ తిన్నది దుర్యోధనుడి ఉప్పు. అందువల్ల తన దేహం తన ఆదీనంలో లేదని, అది తన మాట వినలేదని ఈ కారణంగానే ప్రశ్నించలేకపోయాను అని చెప్పుకొచ్చాడు. అంతే కాదు తన తండ్రి శంతనుడికి ఇచ్చిన మాట ప్రకారం హస్తిన సింహాసనం కాపాడుతాను అని చివరి దాకా ఆ వైపే ఉన్నాను అని చెప్పాడు. అయితే చేసింది మహా పాపం అని తెలుసు. దాని కోసం పాప ప్రక్షాళన చేసుకోవడానికే అంపశయ్య మీద తాను దాదాపుగా నెలన్నర రోజుల తరబడి అంపశయ్య మీదనే ఉన్నాను తనను తానుగా శిక్షను విధించుకున్నాను అని చెప్పాడు.
భీష్ముడి ద్వారానే :
ఇదిలా ఉంటే భీష్ముడు ఎంతటి భక్తుడో శ్రీకృష్ణుడికి తెలుసు. అందుకే భగవద్గీతను తాను నేరుగా అర్జునుడి ద్వారా లోకానికి చెప్పిన ఆయన శ్రీవిష్ణు సహస్రనామాలను మాత్రం భీష్ముడి ద్వారా చెప్పించాడు. అంతే కాదు భీష్ముడి ద్వారానే ధర్మ సారాన్ని కూడా పాండవులకు ఉపదేశం కలిగించాడు. అందువల్ల భీష్మ ఏకాదశి నాడు శ్రీ విష్ణు సహస్రనామాలు ఆస్తిక జనులు పఠిస్తే ఎంతో పుణ్యం అని పురాణాలలో చెబుతారు.
