బొత్స Vs గంటా.. భీమిలిలో హీటెక్కిన పాలిటిక్స్
ఈ నేపథ్యంలో భీమిలి ఇంచార్జిగా మాజీ మంత్రి బొత్స మేనల్లుడు, విజయనగరం జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు వైసీపీ బాధ్యతలు అప్పగించింది.
By: Tupaki Political Desk | 6 Jan 2026 12:00 AM ISTవిశాఖ జిల్లా భీమిలి రాజకీయాలు హీటెక్కాయి. ఇద్దరు రాజకీయ ఉద్దండుల మధ్య సమరానికి భీమిలి వేదికగా మారుతోంది. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈ నియోజకవర్గంలో పాతుకుపోగా, ఆయనను కదిలించాలనే ఉద్దేశంతో వైసీపీ సీనియర్ నేత బొత్స కుటుంబానికి భీమిలి బాధ్యతలు అప్పగించింది. దీంతో భీమిలిలో నిత్యం హాట్ హాట్ రాజకీయమే కనిపిస్తోంది. ఇద్దరు నేతలు అంగ, అర్థ బలాల్లో ఒకరికి ఒకరు తీసిపోని పరిస్థితులలో ఉండటం కూడా రాజకీయ వాతావరణాన్ని మరింత రాజేస్తోందని అంటున్నారు.
గత ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గంటా గెలిచారు. ఆయనకు ప్రత్యర్థిగా వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు పోటీ చేశారు. అయితే ఎన్నికల తర్వాత మాజీ మంత్రి అవంతి రాజకీయంగా పూర్తి నైరాశ్యంలో కూరుకుపోయారు. పార్టీకి రాజీనామా చేశారు. ఆయనను తిరిగి పార్టీలోకి రమ్మనమని వైసీపీ చాలా ప్రయత్నాలు చేసినా, ప్రభుత్వం బలంగా ఉండటం, విద్యాసంస్థల వ్యాపారం కారణంగా అవంతి భయపడిపోయారని అంటున్నారు. ఇదే సమయంలో ఆయన తన రాజకీయ ప్రత్యర్థి గంటాతో పూర్వ సంబంధాలు పునరుద్ధరించుకున్నారని కూడా టాక్ నడుస్తోంది.
ఈ నేపథ్యంలో భీమిలి ఇంచార్జిగా మాజీ మంత్రి బొత్స మేనల్లుడు, విజయనగరం జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు వైసీపీ బాధ్యతలు అప్పగించింది. ఇన్నాళ్లు బొత్స తరఫున విజయనగరం రాజకీయాలు చక్కబెట్టిన జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు భీమిలిలో గంటాకు దీటుగా పావులు కదుపుతున్నారు. దీంతో రాజకీయం నిత్యం రగులుతున్న అగ్ని గుండంలా కనిపిస్తోందని అంటున్నారు. ఇదే సమయంలో భీమిలి నుంచి వచ్చే సారి విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్ పోటీ చేస్తారంటూ జరిగిన ప్రచారంతో గంటా అప్రమత్తమయ్యారని అంటున్నారు. భరత్ పోటీ చేస్తే భీమిలి నుంచి తనకు అవకాశం రాకపోవచ్చనే ఆలోచనతో ఆయన ఈ మధ్య జరిగిన ఓ కార్యక్రమంలో తన అనుమానాన్ని నివృత్తి చేసుకున్నారు.
తాను భీమిలి నుంచి పోటీ చేసేది లేదని ఎంపీ భరత్ విస్పష్టంగా ప్రకటించడంతో గంటా నియోజకవర్గంలో మరింత యాక్టివ్ అయ్యారని అంటున్నారు. వచ్చేసారి తాను లేదా తన కుమారుడు రవితేజను భీమిలి నుంచి పోటీ చేసేలా గంటా పావులు కదుపుతున్నారు. భీమిలిలో వైసీపీకి పట్టు చిక్కకుండా నిత్యం అప్రమత్తంగా ఉంటున్నారని చెబుతున్నారు. అదే సమయంలో బొత్స కుటుంబానికి ఈ ప్రాంతంలో ఉన్న బంధుత్వాలను అడ్డుపెట్టుకుని చాపకింద నీరులా తమ బలం పెంచుకోవాలని వైసీపీ వ్యూహాలు రచిస్తోందని అంటున్నారు. ఇలా ఇరువైపుల నుంచి ఎత్తుకు పైఎత్తులు, వ్యూహ ప్రతివ్యూహాలతో రాజకీయం వాడివేడిగా సాగుతోంది. ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల సమయం ఉండగానే ఈ స్థాయిలో హీట్ పాలిటిక్స్ ఉంటే.. ఇక ఎన్నికల సమయంలో మరెంత వేడి ఉంటుందోనని స్థానికులు చర్చించుకుంటున్నారు.
