పవన్ ఆగ్రహించిన వేళ... హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు!
ఏపీలో అధికారంలో మూడు పార్టీలు. అవి టీడీపీ జనసేన, బీజేపీ. అయితే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు.
By: Satya P | 22 Oct 2025 5:49 PM ISTఏపీలో అధికారంలో మూడు పార్టీలు. అవి టీడీపీ జనసేన, బీజేపీ. అయితే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. సాధారణంగా ఆయన తన పనేంటో తన శాఖలు ఏమిటో అన్నదే ఆలోచిస్తారు. వాటి మీదనే ఎక్కువగా ఫోకస్ పెడతారు. ఆయన జనరల్ అడ్మినిస్ట్రేషన్ లో పెద్దగా జోక్యం చేసుకోరు. అయితే లేటెస్ట్ గా మాత్రం భీమవరం లో పేకాట జూదం పెద్ద ఎత్తున జరుగుతున్నాయన్న మీద ఆయన తీవ్రంగా స్పందించారు. అంతే కాదు స్థానిక ఒక డీఎస్పీ విషయంలో కూడా ఆగ్రహించారు. అసలు అక్కడ ఏమి జరుగుతోందో పోలీసులు ఉన్నతాధికారుల నుంచి నేరుగా నివేదికను కోరారు.
ఉప ముఖ్యమంత్రి కాబట్టే :
అయితే ఇది తీవ్ర స్థాయిలో సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతోంది. ఉప ముఖ్యమంత్రి హోం శాఖలో జోక్యం చేసుకుంటున్నారు అని వార్తలు కూడా ప్రచారం చేస్తున్నారు. దీంతో హోం మంత్రి వంగలపూడి అనితను మీడియా ఇదే విషయం మీద ప్రశ్నించారు. అయితే ఆమె మాత్రం చాలా కూల్ గానే జవాబు చెప్పారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అని అందువల్ల ఆయన కీలకమైన అంశంలో పోలీసు శాఖ నుంచి నివేదిక కోరడంలో తప్పు లేదని ఆమె అంటున్నారు. తమ మధ్య ఎలాంటి ఇగోలు లేవని ఒక సెక్షన్ ఆఫ్ మీడియావే దీనిని పెద్దది చేసేందుకు చేయాల్సింది అంతా చేస్తోంది అని ఆమె ఫైర్ అయ్యారు.
అంతా ఓకే అంటూ :
అంతే కాదు తామంతా బాగా ఉన్నామని కూటమి సమిష్టిగానే పనిచేస్తోందని హోం మంత్రి చెప్పే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో పేకాట సహా జూదాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయన్న దాని మీద ఆమె మాట్లాడుతూ అందంతా గత ప్రభుత్వం నిర్వాకం అని కూడా మండిపడ్డారు. అంతా ఓకేగానే ఉందని ఆమె అన్నారు. డీఎస్పీ విషయంలో నివేదికను పవన్ కోరడంలో ఎలాంటి తప్పు లేదని ఆమె అన్నారు. అలాగే డిప్యూటీ సీఎం గా ఆయన వ్యవహరిస్తున్నారు అని గుర్తు చేశారు.
గతంలో కూడానూ :
అయితే ఇదే సందర్భంలో గతాన్ని కూడా కొంత మంది మళ్ళీ బయటకు తెస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి నాళ్ళలో శాంతి భద్రతలు సరిగ్గా లేవని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తానే హో మంత్రి అయి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అప్పట్లో ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రభుత్వంలో ఉన్న కీలక నాయకుడే ఈ విధంగా బాహాటంగా విమర్శించడంతో కూటమి ప్రభుత్వం కూడా కొంత ఇబ్బందిలో పడినట్లు అయింది. ఆ మీదట కొంత దిద్దుబాటు చర్యలు కూడా తీసుకున్నారు అని చెబుతారు. ఆ తరువాత మళ్ళీ ఎప్పుడూ హోం శాఖ గురించి పవన్ ఓపెన్ గా స్టేట్మెంట్స్ ఇవ్వలేదు, ఇన్నాళ్ళకు భీమవరం లో పేకాట జూదం అంటూ ఆయన ఫైర్ అవుతూండడంతో పాటుగా నివేదికను పోలీసు ఉన్నతాధికారుల నుంచి కోరడంతో ఇది ఏపీలో పెను సంచలనంగా మారింది.
జోక్యం చేసుకున్నట్లేనా :
నిజానికి ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి మంత్రులు అందరూ సమిష్టి బాధ్యతగానే చూస్తారు. ఇక మంత్రులుగా ప్రతీ వారు తమ శాఖల పరిధిలో పనిచేస్తారు. తమ సొంత శాఖలలో రివ్యూలు చేసుకుంటారు ఇతర శాఖలలో పని ఉన్నపుడు సంబంధిత శాఖల మంత్రులకు తెలియచేయడం కానీ సీఎం దృష్టిలో పెట్టడం కానీ చేస్తారు. రాజ్యాంగం ప్రకారం చూస్తే సీఎం ప్రభుత్వానికి అధినేత. ఆయనకు అన్ని మంత్రిత్వ శాఖల మీద పూర్తి అధికారం ఉంటుంది. ఉప ముఖ్యమంత్రి విషయం అయితే రాజ్యాంగ బద్ధంగా ఆ పదవి అన్నది లేదు, దాంతో మంత్రిగానే భావిస్తారు.
టీ కప్పులో తుఫాన్ గా :
అంటే పవన్ ఒక కేబినెట్ సహచరుడే అని అంటున్నారు. మరి ఇతర శాఖలలో ఏమైనా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు జరిగినపుడు లేదా ఇబ్బంది వచ్చినపుడు సంబంధిత మంత్రి దృష్టికి తేవడమే సబబు అని అంటున్నారు. అయితే ఈ విషయంలో అనిత మాత్రం అంతా ఓకే, మేమంతా ఒక్కటే అని చెప్పడంతో వివాదం అయితే ప్రభుత్వంలో లేదనే అనుకోవాలి. కానీ విపక్షాలు దీనిని బాగా టార్గెట్ చేస్తున్నాయి. అనిత శాఖలో పవన్ ఎలా జోక్యం చేసుకుంటారు అని అంటున్నాయి. చూడాలి మరి ఇది టీ కప్పులో తుఫాన్ గా ఆగిపోతుందా లేక ఇంకా పెద్ద ఇష్యూగా మారుతుందా అన్నది.
