భీమిలీలో బిగ్ షాట్స్ కట్టడాలకు భారీ షాక్
భీమిలీ సాగర తీరం అందంగా ఉంటుంది. దాంతో ఆ చుట్టు పక్కన అంతా పెద్ద కట్టడాలు ఇటీవల కాలంలో వెలిశాయి.
By: Satya P | 21 Nov 2025 6:00 PM ISTభీమిలీ సాగర తీరం అందంగా ఉంటుంది. దాంతో ఆ చుట్టు పక్కన అంతా పెద్ద కట్టడాలు ఇటీవల కాలంలో వెలిశాయి. టూరిస్ట్ పాయింట్ కింద భీమిలీని అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం చూస్తోంది. ఈ నేపధ్యంలో నిబంధనలు పట్టించుకోకుండా చాలా కాలంగా అక్రమ కట్టడాలు బీచ్ పరిసరాలు అంతా పరుచుకున్నాయి. దాంతో వీటి మీద భీమిలీ గ్రామాభివృద్ధి సేవా సంఘం తరఫున కొందరు కోర్టుకు వెళ్ళారు. సీఆర్ జెడ్ నిబంధనలను పక్కన పెట్టి మరీ కట్టడాలు అక్రమంగా నిర్మించారని కోర్టు దృష్టికి తెచ్చారు. దాంతో హైకోర్టు తాజాగా ఈ అక్రమ కట్టడాలను కూల్చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లుగా పేర్కొంటున్నారు.
బడా రిసార్ట్స్ :
ఈ దెబ్బకు బడా రిసార్ట్స్ అన్నీ నేలమట్టం అవుతాయని అంటున్నారు. భారీ అంతస్తులతో అత్యంత విలాసవంతమైన నిర్మాణాల్లో వీటిని రూపొందించారు. అయితే సీఆర్ జెడ్ నిబంధలను మాత్రం సాగర తీరానికి కనీసంగా కొన్ని కిలోమీటర్ల దూరం వదిలేసి కట్టడాలను చేపట్టాలని సూచిస్తున్నాయి. అయితే బీచ్ కి ఒక ఫర్లాంగు దూరంలోనే ఈ కట్టడాలు వెలిసాయి. సాగర తీరానికి అభిముఖంగా వీటిని నిర్మించారు. ఇపుడు వీటిని అక్రమ కట్టడాలుగా న్యాయ స్థానం తేల్చడంతో కూల్చేస్తారు అని అంటున్నారు.
ఆలివ్ రిడ్ల తాబేళ్ళకు ముప్పు :
సాగర తీరానికి వచ్చి ఆలివ్ రిడ్ల తాబేళ్ళు తమ సంతానన్ని పొదువుకుంటాయి. ఈ కట్టడాల వెదజల్లే కాలుష్యం, శబ్దాలు ఇతర రకాలైన ఇబ్బందులు అన్నీ కలసి వాటి జీవనాన్ని పాడుచేస్తున్నాయని ఒక అరుదైన సంతతి నశించే ప్రమాదాని కొని తెస్తున్నాయని కూడా పిటిషనర్లు కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ మొత్తం అంశాలు అన్నీ పరిగణలోకి తీసుకున్న మీదటనే కోర్టు ఈ విధంగా ఆదేశాలు ఇచ్చిందని అంటున్నారు. దీని మీద గతంలో కోర్టు కమిటీని ఏర్పాటు చేసి నివేదికను కోరింది ఇపుడు వాటిని అన్నీ పరిశీలించిన మీదటనే ఈ అక్రమ కట్టడాల మీద ఉక్కు పాదం మోపాలని ఆదేశించినట్లుగా చెబుతున్నారు. ఆ విధంగా కోర్టు ఆదేశాలలో అయిదారు రిసార్ట్లకు ముప్పు పొంచి ఉందని చెబుతున్నారు.
పదిహేను రోజులు గడువు :
ఈ అక్రమ కట్టడాల యజమానులకు పదిహేను రోజులు గడువు ఇచ్చారు. ఈ మేరకు నవంబర్ 19న వారికి నోటీసులు అందించారు. వారు కనుక స్వచ్చందంగా తమకు తాముగా ఈ కట్టడాలను కూల్చకపోతే జీవీఎంసీ అధికారులు రంగంలోకి దిగి వాటి పని పడతారు అని అంటున్నారు. ఇక జీవీఎంసీ ఈ అక్రమ కట్టడాల విషయంలో తాను తీసుకుంటున్న చర్యలను తరువాత జరిగే విచారణలో నివేదిక రూపంలో అందించాలని హైకోర్టు ఆదేశించింది. మొత్తానికి భీమిలీలో అక్రమ కట్టడాల మీద ఉక్కు పాదం పడినట్లు అయింది అని అంటున్నారు.
