అంతర్జాతీయ వేదికపై మెరిసిన తెలుగమ్మాయి.. అసలు కథ ఏంటంటే?
అయితే అప్పటి వరకు ఎలాంటి మోడలింగ్,లగ్జరీ ఫ్యాషన్ లో అనుభవం లేని భవితకు అదంతా ఓ కలగా అనిపించింది.
By: Madhu Reddy | 7 Dec 2025 1:48 PM ISTభవిత మండవ.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ మోడల్ పేరే వినిపిస్తోంది.. న్యూయార్క్ లో జరిగిన ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ ఛానల్ మెటియర్స్ డి ఆర్ట్ 2026 షో కోసం ప్రతిష్టాత్మక ఓపెనింగ్ వాక్ కు హైదరాబాద్ కి చెందిన భవిత మండవని ఎంచుకున్నారు.. ఈ షోలో భవిత మండవ తన వాక్ తో ప్రపంచ ఫ్యాషన్ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఆకట్టుకుంది. రన్ వే పై భవిత నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆమెను చూసి తల్లిదండ్రులు ఎంతో సంతోష పడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రపంచ ఫ్యాషన్ ప్రియులని ఆకట్టుకున్న భవిత మండవ అనుకోకుండా మోడలింగ్ లోకి అడుగుపెట్టింది. జీన్స్ , టీ షర్టు ధరించి అమెరికాలోని ఒక సబ్వే స్టేషన్లో రైలు కోసం వెయిట్ చేస్తూ ఉండగా.. ప్రఖ్యాత ఫ్రెంచ్ బెల్జియన్ డిజైనర్ మాథ్యూ బ్లేజి ఆమెను మొదటిసారి చూశారు. రైల్వే స్టేషన్లో నిల్చొని ఉన్న భవితను చూసి ఆమె న్యాచురాలిటీకి ఆకర్షితుడై మోడలింగ్ రంగంలోకి రమ్మని ఆహ్వానించాడు.
అయితే అప్పటి వరకు ఎలాంటి మోడలింగ్,లగ్జరీ ఫ్యాషన్ లో అనుభవం లేని భవితకు అదంతా ఓ కలగా అనిపించింది. ఎలాంటి నేపథ్యం లేకుండానే ఒక సినిమాలో జరిగినట్టు భవిత మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది.. హైదరాబాద్ కు చెందిన భవిత జేఎన్టీయూ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఇంటరాక్టివ్ డిజైన్ మరియు మీడియాలో మాస్టర్స్ కోసం యూఎస్ వెళ్ళింది. 2024లో మాథ్యూ బ్లేజీ ఆమెకు మోడలింగ్ రంగంలో అవకాశం ఇచ్చిన తర్వాత భవిత కూడా మోడలింగ్ లోకి వెళ్ళింది. మోడలింగ్ రంగంలోకి వెళ్లిన కేవలం రెండు వారాల్లోనే ఇటాలియన్ లగ్జరీ బ్రాండ్ బొట్టెగా వెనటాకు స్ప్రింగ్/ సమ్మర్ 2025 షోలో మోడల్ గా ఎంట్రీ ఇచ్చింది. భవిత మొదటిసారి ప్రదర్శనతోనే అందరితో మంచి ప్రశంసలు అందుకుంది. మోడలింగ్ రంగంలోకి వచ్చినప్పటికీ చదువును నిర్లక్ష్యం చేయలేదు. ఓవైపు క్యాంపస్ ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు మోడలింగ్ ని కొనసాగించింది.
లండన్, న్యూయార్క్, మిలన్, ప్యారిస్ వంటి ప్రధాన నగరాల్లో ప్రదర్శనలకు వెళ్ళింది. అలాగే డి ఆర్ట్ వంటి అగ్ర బ్రాండ్లతో కలిసి వర్క్ చేసింది. ఇటీవల ఛానల్ న్యూయార్క్ లో తన గ్రాండ్ మెటియర్స్ డి ఆర్ట్ షో ను నిర్వహించింది. 2018 తర్వాత ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ సంస్థ షెనల్ న్యూయార్క్ లో తొలిసారిగా షో చేస్తుంది. ఇలాంటి ప్రతిష్టాత్మక షోలో ఓపెనింగ్ వాక్ చేయడానికి భవితకు అవకాశం రావడం నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇలాంటి ఛాన్స్ అందుకున్న మొట్టమొదటి ఇండియన్ మోడల్ కూడా భవితనే. భవిత యొక్క థీమ్ ఆమె మోడలింగ్ ప్రారంభమైన ప్రదేశం నుండి ప్రేరణ పొందింది అదే సబ్వే స్టేషన్.
భవిత సాధారణ జీన్స్, టీషర్ట్ లుక్ లో రన్వే పై నడిచింది. మోడలింగ్ రంగంలోకి ప్రవేశించి, మోడలింగ్ చేసిన ఏడాదికి మళ్ళీ ఈ షో చేసింది. షెనల్ సంస్థతో భవిత ఇప్పటికే స్ప్రింగ్ 2026 షో చేసింది. ప్రస్తుతం ఇది రెండోసారి. అయితే మోడలింగ్ రంగంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఓపెనింగ్ వాక్ అవకాశం అందుకోవడం చాలా ప్రత్యేకం. అలాగే ఇది తనకు ఓ సెంటిమెంట్ అంటూ భవిత చెప్పుకొస్తుంది. ఒక చిన్న పరిచయం జీవితాన్ని ఎలా మార్చేసిందో భవిత జీవితాన్ని చూసి అర్థం తెచ్చుకోవచ్చు. భవిత జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమైన కథ అంటూ సోషల్ మీడియాలో ఈమె బ్యాక్గ్రౌండ్ గురించి తెగ వైరల్ గా మారుతోంది.
