Begin typing your search above and press return to search.

అవన్నీ కట్టు కధలు - భగ్గుమన్న భట్టి

తెలంగాణా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భగ్గుమన్నారు. తన పేరు పెడుతూ పెద్ద అక్షరాలతో ఒక పత్రిక వార్తా కధనం రాయడం పట్ల ఆయన ఫైర్ అయ్యారు.

By:  Satya P   |   18 Jan 2026 5:43 PM IST
అవన్నీ కట్టు కధలు  -  భగ్గుమన్న భట్టి
X

తెలంగాణా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భగ్గుమన్నారు. తన పేరు పెడుతూ పెద్ద అక్షరాలతో ఒక పత్రిక వార్తా కధనం రాయడం పట్ల ఆయన ఫైర్ అయ్యారు. తాను బాధ్యత గలిగిన వాడిని అన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది ఒక లక్ష్యం కోసం అన్నారు. అంతే తప్ప ఆస్తులు కూడబెట్టుకోవడానికో వ్యాపార సామ్రాజ్యాలు విస్తరించుకోవడానికో అధికారాన్ని హోదాగా అనుభవించడానికి రాలేదని అన్నారు. తన లక్ష్యం తెలంగాణా ఆస్తులను వనరులను సమాజంలోని అన్ని వర్గాలకు సమానంగా పంచడం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను అన్నారు. దారి దోపిడిదారులు గద్దలా ఆస్తులను వనరులను వ్యవస్థలను పీక్కు తింటూ ఉంటే ఆపన్నుల తరఫున గొంతు ఎత్తడానికే తాను రాజకీయాలను ఎంచుకున్నాను అని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

అంతా పారదర్శకమే :

తన జీవితం అంతా పారదర్శకమే అని భట్టి విక్రమార్క చెప్పారు. సింగరేణి బొగ్గు గనుల కోసమే అంటూ వార్తలు రాసిన వారు గ్రహించాల్సినది ఒకటి ఉందని అన్నారు. టెండర్లు పిలిచింది సింగరేణి సంస్థ బోర్డు అని ఆయన స్పష్టం చేశారు. ఆ టెండర్లలో ఏ కండిషన్లు ఉండాలో బోర్డు నిర్ణయిస్తుంది కానీ మంత్రి కాదని ఈ మాత్రం జ్ఞానం కూడా లేకుండా తోచింది రాశారు అని ఆయన మండిపడ్డారు. ఫిజికల్ సైట్ విజిట్ పెట్టారు అని రాశారు, సైట్ విజిట్ అనేది పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ సంస్థలలో పెడతారు అని ఆయన చెప్పారు. చాలా క్లిష్టతరమైన ప్రాంతాలుగా అవి ఉంటాయి కాబట్టి అని ఆయన వివరించారు. విజిట్ చేసి పారదర్శకంగా టెండర్లు దాఖలు చేయడానికి ఇది వెసులుబాటు అని మంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని ప్రభుత్వ రంగ సంస్థలలో అన్నీ ఇలాగే చేస్తాయని చెప్పారు.

కట్టు కధలు పిట్ట కధలు :

మేము నిజాయితీగా ఉన్నట్లుగా కూడా జనాలకు కనిపించాలని అన్ని విషయాలూ చెబుతున్నాను అని అన్నారు. సింగరేణి యాజమాన్యం కూడా సీరియస్ గా ఈ ఆరోపణల మీద విచారణ చేయాలని పాత టెండర్ ని రద్దు చేయాలని కూడా మంత్రి ఆదేశించారు. మళ్ళీ టెండర్లు పిలవండి అని ఆయన పేర్కొన్నారు. టెండర్ ఇపుడే పిలిచామని ఎవరూ పార్టిసిపేట్ చేయలేదు అని సింగరేణి అధికారులు చెప్పారు, అయినా సరే రద్దు చేయమనే కోరామని అన్నారు. ఇలాంటి కట్టు కధలు పిట్ట కధలు రాసిన ఆయనకు ఎవరి మీదనో ప్రేమ ఉండొచ్చని అన్నారు.

వైఎస్సార్ మీద కోపంతో :

వైఎస్సార్ కి సన్నిహితుడని అని కోపం ఉండొచ్చు అని అందువల్ల ఈ రాతలు రాశారు అని ఆయన సీరియస్ అయ్యారు. అందుకే ముందు టెండర్లు రద్దు చేయమన్నానని మిగతా విషయాలు తాను సదరు పత్రికా యాజమాన్యంతో తేల్చుకుంటాను అని భట్టి పేర్కొన్నారు. ఇది ప్రజల సంబంధించినది అని అన్నారు. ఏ ఉద్దేశ్యంతో ఈ పిట్ట కధలు రాసారు అన్నది తొందరలోనే తాను మీడియాకు వివరిస్తాను అని భట్టి చెప్పారు. తాను మాత్రం మంత్రి పదవిలో ఉన్నంత కాలం ఏ గద్దలను ఏ దోపిడీదారులను తెలంగాణా ఆస్తుల పైన వ్యవస్థ పైన పడనీయను అని హామీ ఇస్తున్నాను అన్నారు.

మీడియా సంస్థల వైరం కూడా :

మీడియా సంస్థల మధ్య వైరం ఉంటే వారు తేల్చుకోవాలని భట్టి అన్నారు. ఇందులో మంత్రులను పాలనను ప్రభుత్వాన్ని లాగేందుకు చూస్తే అసలు ఊఒరుకోమని అన్నారు. తాను ఆత్మ గౌరవంతో బతుకుతున్నాను అని ఆయన చెప్పారు. తాను ఎప్పుడూ తన లక్ష్యాలను మార్గాన్ని వీడను అన్నారు. ఏ మీడియాకు వార్తలు వండి రాసే హక్కు లేదని మంత్రి ఆవేశంగా చెప్పారు. మీకు ఆ హక్కు ఎవరు ఇచ్చారు అని ఆయన ప్రశ్నించారు.

మంత్రులంతా సమిష్టిగానే :

మంత్రులు అందరూ సమిష్టిగా పనిచేస్తున్నామని భట్టి చెప్పారు. తాము ప్రజల కోసమే ఉన్నామని అన్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం నాది అని భట్టి విక్రమార్క అన్నారు. దిగజారుడు రాజకీయాల కోసం కట్టు కధనాలు సృష్టించడం తప్పు అని ఆయన అన్నారు. తనది అంత వీక్ క్యారెక్టర్ కాదని ఆయన స్పష్టం చేశారు. ఒక ప్రధాన వార్తా సంస్థ తనపైన రాసినవి అన్నీ కట్టు కధలే అని చెప్పారు.