భస్మాసురుడివి నీవే !
ఈ లోకంలో ప్రతీ వారి జేబులో తలా వంద రూపాయలూ దేవుడి వేసి మరీ భూమి మీదకు పంపిస్తున్నాడు. వంద రూపాయలు అంటే ఇక్కడ తెలివితేటలు అన్న మాట.
By: Satya P | 26 July 2026 1:53 PM ISTభస్మాసురుడు కధ తెలుసు కదా. పురాణాలలో ప్రఖ్యాతం. పరమ శివుడు నుంచి వరాలు పొంది కూడా తన నెత్తిన తానే చేయి పెట్టుకుని భస్మీపటలం అవుతాడు. ఇదంతా ఎందుకు అంటే అత్యాశ, అహంకారం, మితిమీరిన స్వార్థం వల్లనే. భస్మాసురుడు పురాణాల కాలం వాడే అని సరిపెట్టుకో నక్కరలేదు. ఆయన ఈ కలియుగంలోనూ ఉన్నాడు. మనిషిలో అహంకారం స్వార్ధం పెచ్చుమీరినపుడు తన నెత్తిన తాను చేయి పెట్టుకునేలా చేసేది ఈ భస్మాసురుడే. అందుకే భస్మాసురుడి గురించి విని తెలుసుకోవడం కాదు, ఆ లక్షణాలను దరిదాపుల్లోకి రానీయకుండా చేసుకుంటే ఏ మనిషి జీవితం అయినా బాగుంటుంది. చిత్రమేంటి అంటే భస్మాసురుడు తనలోనే ఉన్నాడు అన్నది ఎవరికీ తెలియదు, తన వినాశనానికి ఎదుటి వారే కారణం అని ఏడుపులు పెడబొబ్బలు పెడతాడు. కానీ ప్రతీ వారి జీవితంలో జరిగే మంచి చెడులకు ఎవరో బాధ్యత వహించరు, ఆ మాటకు వస్తే వారు ఎవరూ కారణం కూడా కాదు, తరచి చూస్తే మనిషిలో ఉండే భస్మాసురుడే అలా చేయిస్తాడు ఇది అర్థం చేసుకుంటే జీవితం బాగుంటుంది. కానీ ఎవరూ చేయలేకపోతున్నారు కదా. అదే కదా అసలు బాధ.
ఎవరో తొక్కేస్తున్నారని :
ఇది ఒట్టి అపోహ మాత్రమే. ఈ లోకంలో ఈ రోజులలో ఎవరికి వారికే బోలెడు పని ఉంది. అందువల్ల ఎదుటి వాడిని తొక్కేయాలని ఎవరూ ఆలోచించరు. అలా ఆలోచించినా నీవు చెడిపోయేది కూడా ఉండదు, ఎందుకంటే అంతా నీ చేతిలో ఉంది కాబట్టి. అలా అనుకోవడం ఆత్మ వంచన తప్ప మరోటి కానే కాదు, తనను ఎదగకుండా చేస్తున్నారని తనను అణచివేస్తున్నారని తనకు రావాల్సిన అవకాశాలను దక్కనీయకుండా చేస్తున్నారని ఎదుటి వారి మీద పడి ఒక్కటే ఏడుపు. ఇలా ఏడ్చే వారికి సంబంధించి ఆలోచిస్తే అది వారి అసమర్థతగా భావించాలి. అలా అసమర్థులే ఎపుడూ తమ తప్పులు వెతుక్కోకుండా సరైన ఆత్మ పరిశీలన చేసుకోకుండా స్వీయ లోపాలు ఎరగకుండా ఎదుటి వారి వల్లనే ఇలా అయిపోయామని కుమిలిపోతూంటారు. కానీ ఎవరో తొక్కేయనక్కరలేదు, నీలోని ఉన్న ఆ జీభూతమే నిన్ను తొక్కి పడేస్తోంది, దానిని వదిలించుకుంటే కానీ నీవు బాగుపడవు అన్నది గుర్తెరగాలి. మరి ఈ జీవిత సత్యాలు ఎవరు చెబుతారు. అంటే తన గురించి తాను తెలుసుకునే తెలివిడి లేకపోతే ఇక బతకడం కష్టమే అని కూడా అనాల్సి వస్తుంది.
నీ కంటే పెద్ద తోపు లేడు :
టాలెంట్ ఉండాలే కానీ నిన్ను ఎవరూ అడ్డు పెట్టలేరు. అర చేతిలో సూర్యుడిని ఆపడం ఎంత కష్టమో ప్రతిభ ఉన్న వారిని కూడా పక్కకు నెట్టేయడం అంత కష్టం. అందువల్ల ప్రతిభకు పదును పెట్టి లక్ష్యానికి గురి పెట్టిన వాడికి విజయాలు ఎపుడూ దక్కుతాయి. అసూయలు స్వార్ధాలు పక్కనే ఉన్నా కూడా అవి కనీసం తాకనైనా తాకలేవు. నిజానికి చెప్పాలంటే ప్రతీ మనిషీ ఒక అద్భుతమే. ప్రతీ వారిలోనూ టాలెంట్ ఉంటుంది. కానీ వాటి మీద శ్రద్ధ పెట్టి ఉపయగొంచుకున్న వాడే విజేతగా కనిపిస్తాడు. వాడే గెలిచి సత్తా చాటుతాడు. ఒక్క మాట మనసులో అనుకో. నీ కంటే పెద్ద తోపు ఇక్కడ ఎవడూ లేడని, అది అతి విశ్వాసంగా కాకుండా ఆత్మ విశ్వాసంగా మారిన నాడు విజయాలు అన్నీ నీ వెంటనే పరుగులు తీస్తాయి.
దేవుడు అన్నీ ఇచ్చాడు :
ఈ లోకంలో ప్రతీ వారి జేబులో తలా వంద రూపాయలూ దేవుడి వేసి మరీ భూమి మీదకు పంపిస్తున్నాడు. వంద రూపాయలు అంటే ఇక్కడ తెలివితేటలు అన్న మాట. అలా బుర్రలో తెలివి విషయంలో దేవుడు ఏ మాత్రం అన్యాయం చేయలేదు. మరి వందకు వంద ఖర్చు చేసిన వాడే మొనగాడుగా నిలుస్తున్నాడు. అందులో పది రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తే అంతే ఫలితం వస్తుంది కానీ వంద రూపాయల ఫలితం రావాలంటే రాదు కదా. జీవితం అంతా గణితమే కదా. లెక్క కరెక్ట్ గా ఉండాలి కదా. అందువల్ల ఉన్న తెలివిని పూర్తిగా ఉపయోగించాలి. అపుడే రిజల్ట్ పెర్ఫెక్ట్ గా వస్తుంది. నేనేమీ చేయను కానీ మంచి ఫలితాలు రావాలి అంటే అది కుదిరే పనేనా. ఒక్కసారి ఆలోచిస్తే మనసు పెట్టి మధనం చేస్తే నీ లోపాలు ఏమిటో నీకే అర్ధం అవుతాయి. నీ జీవితం వెలగక పోవడానికి అసలైన విలన్ ఎవరో కూడా నీకే తెలుస్తుంది. అందువల్ల భస్మాసురుడి మాదిరిగా నీ నెత్తిన నీవే చేతులు పెట్టుకోకుండా కష్టపడి లక్ష్యాన్ని చేదిస్తే ఎంచక్కా జేబులో చేతులు పెట్టుకుని దర్జా ఒలకపోస్తావు. అలా కాకుండా నీరు కానీ నిస్సత్తువగా నిరాశ నీడలో మగ్గిపోతే మాత్రం నిన్ను ఎవరూ బాగు చేయలేరు. గుర్తు పెట్టుకో నీ జీవితానికి నీవే మార్గదర్శివి. నీ విజయం కోసం నీవే తపన పడాలి. నీవు గెలిచినపుడు తొలి చప్పట్లు నీవే కొట్టుకోవాలి కూడా. అంతా నీవే అన్నీ నీవే. ఇదే జీవితం చెప్పే అసలు సిసలు సారాంశం.
