Begin typing your search above and press return to search.

భీమిలీ నుంచి బాలయ్య కూతురు....గాసిప్ నా ?

భీమిలీ నియోజకవర్గం విశాఖలో అతి ముఖ్యమైన సీటు. భీమిలీ స్వీట్ సీట్ అని కూడా అంటారు. టీడీపీకి కంచుకోట భీమిలీ.

By:  Satya P   |   25 Jun 2026 9:26 AM IST
భీమిలీ నుంచి బాలయ్య కూతురు....గాసిప్ నా ?
X

భీమిలీ నియోజకవర్గం విశాఖలో అతి ముఖ్యమైన సీటు. భీమిలీ స్వీట్ సీట్ అని కూడా అంటారు. టీడీపీకి కంచుకోట భీమిలీ. అత్యధిక సార్లు టీడీపీ అభ్యర్ధులే గెలిచారు. ఇక ఇటీవల కాలంలో చూస్తే భీమిలీ ప్రాంతం అంతా మరో జూబ్లీ హిల్స్ గా మారిపోతోంది. అనేక ఐటీ పరిశ్రమలు రిసార్టులు హొటెల్స్ వస్తున్నాయి. భీమిలీ నియోజకవర్గంలోనే అతి పెద్ద గూగుల్ డేటా సెంటర్ కూడా ఏర్పాటు అయింది. ఇన్ఫోసిస్ సహా కీలకమైన ఐటీ కంపెనీలు వస్తున్నాయి. దాంతో భీమిలీ మీద అందరికీ మోజు అయితే పెరిగిపోతోంది.

వచ్చే ఎన్నికల కోసం :

భీమిలీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా ఎవరికి వారుగా ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేసుకుంటున్నారు అని కూటమిలో వినిపిస్తోంది. జనసేన అయితే వచ్చే ఎన్నికల్లో భీమిలీ నుంచి పోటీకి సిద్ధం అని ప్రచారం జరుగుతోంది. మరో వైపు చూస్తే మాజీ మంత్రి భీమిలీ నుంచి రెండు సార్లు గెలిచిన మాజీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ జనసేనలో చేరి భీమిలీ నుంచి పోటీ చేస్తారు అని కూడా అంటున్నారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా తన రాజకీయ వారసుడిని భీమిలీ నుంచి 2029 ఎన్నికల్లో పోటీకి దించాలని చూస్తున్నారు అని కూడా అంటున్నారు.

ఈ గాసిప్ ఎక్కడ నుంచి :

ఈ నేపధ్యంలో సడెన్ గా ఒక గాసిప్ అయితే గట్టిగా వినిపిస్తోంది. అదేంటి అంటే విశాఖ ఎంపీ శ్రీ భరత్ సతీమణి సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని భీమిలీ నుంచి 2029 ఎన్నికల బరిలో దిగుతుందని ఆ గాసిప్ సారాంశం. ఇది సాధ్యపడుతుందా అంటే ఎందుకు కాదని అనేవారు ఉన్నారు. భరత్ ఎంపీగా ఉన్నారు. ఆయన 2024లో బంపర్ మెజారిటీతో గెలిచారు. వచ్చే ఎన్నికల్లో ఆయన మళ్లీ ఎంపీగా పోటీ చేస్తారు అని అంటున్నారు. దాంతో తన ఎంపీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే భీమిలీ నుంచి సతీమణిని పోటీ చేయించాలని శ్రీ భరత్ అనుకోవడంలో తప్పు లేదని అనే వారూ ఉన్నారు.

గ్యారంటీగా విక్టరీ :

భీమిలీ నుంచి ఎవరు టీడీపీ నుంచి పోటీ చేసినా గ్యారంటీగా విక్టరీ ఉంటుందని అంతా చెబుతారు. అదే నిజం కూడా. ఇక ఏకంగా బాలయ్య కుమార్తె పోటీ చేయాలనుకుంటే భీమిలీ సీటు టీడీపీ వశం అని కళ్ళు మూసుకునే చెప్పాల్సి ఉంటుందని అంటున్నారు. ఇంతకీ తేజస్వినికి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్నది చూడాల్సి ఉందని అంటున్నారు. ఇక్కడ కొసమెరుపు ఏంటి అంటే 1994 ఎన్నికల సందర్భంగా అన్న నందమూరి తారక రామారావు భీమిలీ నుంచి పోటీ చేయాలని అనుకున్నారని ప్రచారంలో ఉంది. చివరి నిముషంలో ఆయన టెక్కలికి వెళ్ళారు. ఇక 2019 ఎన్నికల సమయంలో నారా లోకేష్ భీమిలీ నుంచి పోటీ చేస్తారు అని కూడా వార్తలు వచ్చాయి. మరి ఇపుడు ఈ గాసిప్ వస్తోంది. అది కూడా ఎన్నికలకు మూడేళ్ళ ముందు. మరి ఇది ఒట్టి పుకార్ నా లేక నిజమెంత అంటే కాలమే దీనిని జవాబు చెప్పాల్సి ఉంది అని అంటున్నారు.