Begin typing your search above and press return to search.

టీడీపీ ఎంపీ చూపు ఎమ్మెల్యే సీటు మీద ?

దేశంలో కానీ రాష్ట్రంలో కానీ సార్వత్రిక ఎన్నికలు జరిగేందుకు ఇంకా నాలుగేళ్ళు ఉంది. అయితే ముందస్తు ఎన్నికలు వచ్చినా లేక జమిలి ఎన్నికలు జరిగినా ఆ వ్యవధి మరింతగా తగ్గుతుంది.

By:  Satya P   |   21 Aug 2025 8:56 AM IST
టీడీపీ ఎంపీ చూపు ఎమ్మెల్యే సీటు మీద ?
X

దేశంలో కానీ రాష్ట్రంలో కానీ సార్వత్రిక ఎన్నికలు జరిగేందుకు ఇంకా నాలుగేళ్ళు ఉంది. అయితే ముందస్తు ఎన్నికలు వచ్చినా లేక జమిలి ఎన్నికలు జరిగినా ఆ వ్యవధి మరింతగా తగ్గుతుంది. అయితే రాజకీయాల్లో ఉన్న వారు ముందు నుంచే దూరదృష్టితో ఆలోచిస్తారు అలా విశాఖకు చెందిన ప్రముఖ టీడీపీ నాయకుడు, విశాఖ ఎంపీ అయిన శ్రీ భరత్ తన చూపుని ఎమ్మెల్యే సీటు మీద పెట్టారని అంటున్నారు. ఆయన ఎంపీగా బంపర్ మెజారిటీతో 2024 ఎన్నికల్లో గెలిచారు ఆయనకు ఏకంగా ఐదున్నర లక్షల పై చిలుకు మెజారిటీ వచ్చింది. దేశంలో వచ్చిన భారీ మెజారిటీలలో ఇది కూడా ఒకటిగా నమోదు అయింది.

ఈసారి అసెంబ్లీకే నట:

విశాఖ ఎంపీ ఆలోచనలు ఆయన వ్యవహార శైలి చూస్తూంటే ఈసారి అసెంబ్లీ రూటే అని అంటున్నారు. ఆ విధంగా ప్రచారం సొంత పార్టీలోనూ బయట కూడా జరుగుతోంది. ఇలా ఎందుకు అంటే ఏ ఎంపీ చేయని విధంగా భరత్ ఎక్కువగా లోకల్ పాలిటిక్స్ మీద ఫోకస్ పెడుతున్నారు అని అంటున్నారు. ఆయన తన ఎంపీ పరిధిలోని ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్లోనూ తన కంటూ ఒక వర్గాన్ని తయారు చేసుకుని సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. విశాఖ దక్షిణం, ఉత్తరం, తూర్పు నియోజక వర్గాల మీద ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు అని అంటున్నారు.

ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేలుగా :

ఇదిలా ఉంటే ఎంపీ లోకల్ పాలిటిక్స్ లో ఎక్కువగా ఆసక్తి చూపడమే కాకుండా తమ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా తన ప్రభావం చూపుతూండడంతో పార్టీలో కూడా ఇది చర్చకు దారితీస్తోంది. తమకు వ్యతిరేకంగా వర్గాన్ని చేరదీయడం మీద కూడా కొందరు ఎమ్మెల్యేలు అయితే అసహనం వ్యక్తం చేస్తున్నారు అని అంటున్నారు. బలమైన ఎమ్మెల్యేలు ఉన్న చోట తన వారిని ప్రోత్సహించడం ద్వారా భరత్ భవిష్యత్తు రాజకీయాలకు తెర తీస్తున్నారని వారు అనుమానిస్తున్నారు ఈ మధ్యనే గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నియోజకవర్గంలో పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అనుచరులు భూ దందాలో జోక్యం చేసుకుంటే ఎంపీ వారికి అనుకూలంగా వ్యవహరించారు అని పల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు అన్న ప్రచారం సాగింది. మరో వైపు జనసేన ఎమ్మెల్యేగా ఉన్న పెందుర్తిలో కూడా మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ హవా చేస్తున్నారు. ఆయన వెనక ఎంపీ అండదండలు ఉన్నాయని అంటున్నారు.

ఎమ్మెల్యేగా సీన్ లోకి :

విశాఖ సౌత్ లో జనసేన ఎమ్మెల్యే ఉన్నారు. అయితే అక్కడ ఎంపీ భరత్ సుపరిపాలనలో తొలి ఏడాది పేరుతో భారీ కార్యక్రమం నిర్వహించారు. ఆయన అక్కడ పార్టీ పరంగా గట్టిగానే వ్యవహరిస్తున్నారు. ఆయన వర్గం మనిషికే ఇంచార్జి పదవి కూడా దక్కింది. దాంతో ఆయన చూపు సౌత్ సీటు మీద ఉందా అన్న చర్చ వస్తోంది. అంతే కాదు విశాఖ నార్త్ సీటు విషయంలో కూడా ఫోకస్ పెట్టారని మరో వార్త ఉంది. ఇక తూర్పులో నాలుగు సార్లు గెలీన వెలగపూడి రామక్రిష్ణబాబు ప్లేస్ లో కూడా ఎంపీ ఫోకస్ పెట్టెశారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఎమ్మెల్యేగా ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారు అన్నది ప్రచారంలో ఉంది. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజం ఎంత ఉందో.