టెన్షన్ ఎందుకు...లైట్ తీస్కో బ్రో !
పోటీ ప్రపంచంలో విజయం కోసం పరుగులు తీస్తూ మనశ్శాంతిని కోల్పోతున్న ఈ తరానికి భగవద్గీత సందేశం ఎంతో అవసరం. కష్టపడి పనిచేయాలి కానీ ఫలితం గురించి అతిగా ఆలోచించకూడదు. అపజయాలను జీవితానికి ముగింపుగా కాకుండా పాఠాలుగా స్వీకరించాలి. కెరీర్లో ఎదుగుదలతో పాటు సంతృప్తి, మానసిక ప్రశాంతతకు కూడా ప్రాధాన్యం ఇచ్చినప్పుడే జీవితం ఆనందంగా సాగుతుంది.
By: Satya P | 22 Nov 2026 5:05 PM ISTఈ రోజున పోటీ ప్రపంచం నడుస్తోంది. ఎక్కడ చూసినా ఒకరిని ఒకరు అధిగమించాలన్న ఆరాటం. తామే ముందుకు రావాలని నిరంతర పోరాటం. ఈ అలుపు సొలుపుల పరుగు పందెంలో విలువైనది ఎంతో కోల్పోతోంది ఈ తరం. అదే మనశ్శాంతి. ఉరుకులతో సాగే జీవితంలో తామేంటో కూడా తెలుసుకోలేనంతగా మనసు గిర్రున తిరిగేస్తోంది. దానికి ఏ కొలమానం కాలమానం కూడా లెక్క కట్టేందుకు లేదు అన్నది నిజం. ఫలితం ఏమిటి అంటే యమ టెన్షన్. ఇది అసలుకు వడ్డీలు చక్ర వడ్డీలు కడుతూ చివరికి సాధించేది ఏమిటి అంటే మానసిక శారీరక అనారోగ్యం. కొన్ని సార్లు ఫలితాలు సాధించి విజయవంతం అయినా కూడా ఆస్వాదించేంతగా మనసు ఉండటం లేదు, అది కుదుట పడకుండా శాంతి ఎక్కడ నుంచి వస్తుంది. అందుకే చిన్న వయసులోనే బీపీ షుగర్ తో బతుకు బండి గాడి తప్పుతోంది.
కూసింత అవసరం :
ముదిమి వయసులోనే వేదాంతం అని కాదు, ఏ ఏజ్ లో అయినా అది ఉంటే మనిషికి సుఖం ఉంటుంది. అలాగని వేదాంతాన్నే నమ్ముకుని కాళ్ళు చాపుకుని కూర్చోమని కాదు, చేయాల్సిన పని నికరంగా నిజాయతీగా చేయాల్సిందే. అందులో అణు మాత్రం కూడా అనుమానం లేదు, ఎంత శక్తి ఉందో అంతగానూ ఉపయోగించాలి. అలాగే ఎంత టాలెంట్ ఉందో దానిని అంతా వాడాలి. ఆ మీదట మాత్రం రిజల్ట్ కోసం టెన్షన్ పడకుండా దానికి అలా వదిలేయడమే బెటర్. ఈ ముఖ్యమైన సూత్రం అన్నది నవీన తరానికి చాలా అవసరం. లేకపొతే ఫలితం ఎలా వస్తుందో అన్నది ఒక బాధ అయితే అది పూర్తిగా విజయవంతం కావాలని సక్సెస్ మాత్రమే దక్కాలని మనసు పడే వేదనతో ఒకవేళ ప్రతికూలత వచ్చినా స్వీకరించలేని మనోదౌర్బల్యం కూడా ఏర్పడుతుంది. దాంతో ఎంతటి వారు అయినా నిలువునా నీరసించి కృంగి పోవడమే కాదు నేలకు జారిపోవడమూ జరుగుతుంది. దాంతో ఒక ఫెయిల్యూర్ కే మొత్తం జీవితాన్ని పందెం కట్టి ఫ్యూచర్ ని లేకుండా చేసుకోవడం జరుగుతుంది.
అది ఒక పాఠం :
చాలా మంది భగవద్గీతను ఆధ్యాత్మిక గ్రంధంగానే చూస్తారు. అంతే కాదు దానికి చనిపోయిన వారి శవాల ముందు వినిపించే ఒక సత్కార్యం గా భావిస్తారు. కానీ నిజానికి అది తప్పు. జ్ఞాన బోధ కోసం అది భగవానుడు కృష్ణుడు అర్జునుడికి చెబుతున్నట్లుగా మానవాళి మొత్తానికి ఇచ్చిన దివ్య సందేశం. అందులో ఫిలాసఫీ లేదు, కెరీర్ కి సంబంధించిన గొప్ప సూత్రాలు ఉన్నాయి. ఇంతకీ కృష్ణుడు చెప్పింది ఏమిటి అంటే నీవు నీ పనిని పూర్తి చెయ్, ఫలితం గురించి ఆలోచన చేయకు అని. అంటే ఫలితం మీద నీకు అధికారం లేదని ఏనాడో అయిదు వేల సంవత్సరాల క్రితమే భగవానుడు చెప్పేశాడు. అయినా అర్థం చేసుకోని వారే మిడి మిడి జ్ఞానంతో ఫలితం మీద లేని పోని ఆశలు పెట్టుకుని అందులో నుంచి నిరాశనే చివరికి అందుకుంటారు.
సంతృప్తి ముఖ్యం :
ఎవరికైనా సంతృప్తి అన్నది ముఖ్యం. ఇక్కడ కూడా చాలా మందికి సందేహం వస్తుంది. అలాగని ఎక్కడో ఆగిపోతే కెరీర్ ఎదుగూ బొదుగూ లేకుండా అక్కడే ఆగిపోతుందని. ముందే చెప్పినట్లుగా చేసే పనిలో నిష్ట నిబద్ధత చూపిస్తూ నిరంతరం కృషి చేస్తూనే ఉండాలి. అదే క్రమంలో తాము తన ప్రస్తుత జీవితం మీద అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పోతే అది చివరికి వారి మీద వారికే నమ్మకం కోల్పోయే చేస్తుంది అన్నదే ఇక్కడ ఆలోచించాలి. అంటే బెటర్ లైఫ్ కోసం ఎప్పటికప్పుడు ఆలోచిస్తూనే దానిని నిరాశతో అసంతృప్తి అన్న ప్రతిబంధకాలతో తాముగానే అడ్డు కట్ట వేసుకుంటే ముందుకు సాగేది ఎలా అన్నదే గ్రహించాలి.
జీవితం నీదే :
ఇక జీవితం అన్నది ముందుగా రాసిపెట్టిన స్క్రిప్ట్ అన్నది ఒక తాత్విక భావన. దీనికి కూడా తార్కికమైన సమాధానాలు ఉన్నాయి. ఎవరు ఎక్కడ ఏ కుటుంబంలో పుట్టాలన్నది ఎవరి చేతిలో ఉండదు. కానీ పుట్టిన తరువాత మాత్రం జీవితంలో ప్రతీ నిర్ణయం వారే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వాటి ఫలితాలు పర్యవసానాల గురించే అధికంగా చింతించి మిగిలిన జీవితాన్ని ఇబ్బందులపాలు చేసుకోవద్దు అన్నదే అంతా తెలుసుకోవాలి. ఏది ఏమైనా తరాలు ఎన్ని మారినా కాలం ఎంత ముందుకు సాగినా తాత్వికతతో పాటు వేదాంత భావనలు ప్రతి మనిషి ఆలోచనలలో ఉన్నపుడు టెన్షన్ నుంచి ఫ్రీ అవుతాడు. మరింత అందంగా భవిష్యత్తుని కూడా నిర్మించుకోగలడు. లేకపోతే శ్లేష్మంలో ఈగలా అందులోనే పడి కొట్టుకుపోతాడు. కెరీర్ ఓరియెంటేషన్ తో పాటు ఇది కూడా ముఖ్యమని గుర్తించిన నాడు ప్రతీ వారి లైఫ్ టెన్షన్ ఫ్రీగా హ్యాపీగా సాగిపోతుంది.
