కొత్త చట్టం: స్విమ్మింగ్ పూల్‌లో టాప్ లెస్‌గా మహిళలు ఓకే
ప్రపంచవ్యాప్తంగా లింగ సమానత్వంపై చర్చలు జరుగుతున్న తరుణంలో... జర్మనీ రాజధాని బెర్లిన్ నగరం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
By: Sivaji Kontham | 1 April 2026 8:45 AM ISTప్రపంచవ్యాప్తంగా లింగ సమానత్వంపై చర్చలు జరుగుతున్న తరుణంలో... జర్మనీ రాజధాని బెర్లిన్ నగరం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అక్కడి పబ్లిక్ స్విమ్మింగ్ పూల్స్‌లో మహిళలు కూడా పురుషులతో సమానంగా పై వస్త్రం లేకుండా (టాప్‌లెస్) ఈత కొట్టవచ్చు. గతంలో ఉన్న నిబంధనలు కేవలం పురుషులకు మాత్రమే ఈ మినహాయింపునిచ్చేవి.. కానీ ఇప్పుడు మహిళలు కూడా తమ ఇష్టానుసారం అర్థనగ్నంగా స్విమ్మింగ్ చేసేందుకు చట్టపరమైన అనుమతి లభించింది. లింగ వివక్షను అంతం చేయడంలో భాగంగా కోర్టు వెలువరించిన ఈ తీర్పు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
ఈ మార్పు వెనుక ఒక మహిళ చేసిన పోరాటం ఉంది. గతంలో ఒక మహిళ పబ్లిక్ పూల్‌లో పై వస్త్రం లేకుండా ఉన్నందుకు ఆమెను అక్కడ ఉండనివ్వకుండా నిరోధించారు. దీనిని సవాలు చేస్తూ ఆ యువతి స్థానిక వివక్ష నిరోధక కార్యాలయాన్ని ఆశ్రయించింది. పురుషులకు వర్తించని ఆంక్షలు మహిళలకు మాత్రమే ఎందుకు ఉండాలని ఆమె వాదించింది. ఈ ఫిర్యాదును పరిశీలించిన అధికారులు, పూల్ నిబంధనలు లింగభేదం చూపకూడదని స్పష్టం చేశారు. పురుషులను అనుమతించినప్పుడు మహిళలను కప్పుకోమని కోరడం వివక్ష కిందకే వస్తుందని తీర్పునిస్తూ.. నిబంధనలను సవరించాలని ఆదేశించారు.
ప్రస్తుత పరిస్థితి ప్రకారం... బెర్లిన్‌లోని మున్సిపల్ స్విమ్మింగ్ పూల్స్ తమ గృహ నియమాలను అధికారికంగా మార్చుకున్నాయి. సిబ్బంది ఎవరూ కూడా మహిళలపై లింగ వివక్ష చూపకూడదని.. అందరికీ సమానమైన నిబంధనలు వర్తింపజేయాలని నగరం స్పష్టం చేసింది. వాస్తవానికి బెర్లిన్‌లో టాప్‌లెస్‌గా ఈత కొట్టడం గతంలో కూడా పూర్తిగా చట్టవిరుద్ధం కాదు.. కానీ స్పష్టమైన నిబంధనలు లేకపోవడంతో మహిళలు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. తాజా సవరణతో మహిళలకు తమ శరీరంపై పూర్తి స్వేచ్ఛను కల్పిస్తూ. సమానత్వ దిశగా బెర్లిన్ ఒక పెద్ద అడుగు వేసింది.
చరిత్రలో ఉన్నదే అయినా కానీ..!
ప్రపంచవ్యాప్తంగా మహిళల ఆహార్యం..టాప్‌లెస్‌నెస్ విషయంలో సామాజిక దృక్పథాలు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కొన్ని స్వదేశీ తెగలు, ప్రాచీన సంస్కృతులలో మహిళలు పైవస్త్రం లేకుండా ఉండటం ఒక సాధారణ ఆచారంగా ఉండేది. ముఖ్యంగా ఆఫ్రికాలోని హింబా తెగలు.. గతంలో జపాన్, భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో దీనిని నైతికంగా తప్పుగా పరిగణించేవారు కాదు. అయితే ఆధునిక కాలంలో చాలా దేశాల్లో బహిరంగ ప్రదేశాల్లో మహిళలు ఇలా ఉండటాన్ని`అసభ్య ప్రవర్తన`గా భావిస్తూ చట్టపరమైన ఆంక్షలు విధిస్తున్నారు.
మరోవైపు పశ్చిమ దేశాలలో మహిళల హక్కుల కోసం టాప్‌ఫ్రీడమ్ అనే ఉద్యమం బలంగా వినిపిస్తోంది. పురుషులకు ఉన్నట్లే మహిళలకు కూడా బహిరంగ ప్రదేశాల్లో చొక్కా లేకుండా ఉండే సమాన హక్కు ఉండాలని ఈ ఉద్యమకారులు వాదిస్తున్నారు. యూరప్ , ఆస్ట్రేలియాలోని కొన్ని పర్యాటక ప్రాంతాల్లో, బీచ్‌లలో మహిళలు టాప్‌లెస్‌గా సూర్యస్నానం చేయడం ఇప్పుడు ఒక సామాజిక ఆచారంగా మారింది. చట్టాలు, సామాజిక మర్యాదలు వేర్వేరుగా ఉన్నా దీనిని ఒక నిరసన రూపంగా లేదా స్వేచ్ఛా ప్రకటనగా కూడా ఉపయోగిస్తున్నారు.
సాంకేతిక- మీడియా రంగాల్లో కూడా దీనిపై భిన్నమైన నిబంధనలు ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా లలో మహిళల నిపుల్స్ కనిపించే ఫోటోలపై కఠినమైన ఆంక్షలు విధిస్తుంటాయి. అయితే తల్లిపాలు ఇవ్వడం వంటి సహజమైన ప్రక్రియలను లైంగిక కోణంలో చూడకూడదని.. వాటికి మినహాయింపులు ఇవ్వాలని ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెరుగుతోంది. కళాత్మక చిత్రలేఖనాలు, శిల్పకళలు, చారిత్రక అంశాల్లో దీనిని ఒక సహజమైన వ్యక్తీకరణగా సమాజం ఆమోదిస్తూనే ఉంది.
