Begin typing your search above and press return to search.

ఓడిపోతారన్నారు.. కానీ మోడీ ఫ్రెండ్ దే లీడ్.. ఇజ్రాయెల్ లో కథ మారుతోందా?

మోడీ జిగ్రీ దోస్త్ అయిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఓడిపోతారని.. పోలింగ్ కు ముందు ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన జరగడంతో అంతా అనుకున్నారు.

By:  A.N.Kumar   |   28 Oct 2026 5:02 PM IST
ఓడిపోతారన్నారు.. కానీ మోడీ ఫ్రెండ్ దే లీడ్.. ఇజ్రాయెల్ లో కథ మారుతోందా?
X

మోడీ జిగ్రీ దోస్త్ అయిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఓడిపోతారని.. పోలింగ్ కు ముందు ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన జరగడంతో అంతా అనుకున్నారు. కానీ అక్కడ ట్రెయిన్ రివర్స్ అవుతోంది. ఇజ్రాయెల్ రాజకీయం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో అంచనా వేయడం అంత సులభం కాదు. తాజాగా వెలువడుతున్న ఎన్నికల ఫలితాల ధోరణి చూస్తుంటే ఇది మరోసారి నిజమని నిరూపితమవుతోంది.

ఎన్నికలకు ముందు వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఒక రకమైన చిత్రాన్ని చూపిస్తే.. ఓట్ల లెక్కింపులో మాత్రం దానికి పూర్తి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆత్మీయ మిత్రుడిగా భావించే బెంజమిన్ నెతన్యాహు ఓడిపోతారని అంచనాలు వెలువడినప్పటికీ.. ప్రస్తుతం ఆయన నేతృత్వంలోని 'లికుడ్' కూటమి ఆధిక్యంలో దూసుకుపోతుండటం తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ఇజ్రాయెల్‌లో 'రెజీమ్ చేంజ్' అనుకున్నంత సులభం కాదని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు..

ఎన్నికల ముందు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ నెతన్యాహు పార్టీకి కేవలం 24 నుంచి 25 స్థానాలే దక్కుతాయని.. ఆయన అధికారం కోల్పోవడం ఖాయమని విశ్లేషించాయి. అయితే లెక్కింపు ప్రారంభమయ్యాక దృశ్యం పూర్తిగా మారిపోయింది. దాదాపు 42 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్ కూటమి 57 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది.

ప్రధాన ప్రతిపక్షంగా బరిలోకి దిగిన గాది ఐసెన్‌కోట్ నేతృత్వంలోని సెంట్రిస్ట్ 'యషార్' పార్టీ 47 స్థానాలకు పరిమితమవ్వగా.. అరబ్ పార్టీలు 16 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఈ గణాంకాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తిరగరాస్తూ.. నెతన్యాహు రాజకీయాన్ని ఇంకా ముగిసిపోలేదని తేల్చిచెబుతున్నాయి.

మేజిక్ ఫిగర్ సవాలు.. 61 స్థానాల సమీకరణం

ఇజ్రాయెల్ పార్లమెంట్ అయిన 'నెస్సెట్'లో మొత్తం 120 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 61 మంది సభ్యుల మద్దతు తప్పనిసరి. లికుడ్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించే దిశగా సాగుతున్నప్పటికీ.. నెతన్యాహు కూటమికి స్పష్టమైన మెజారిటీ లభిస్తుందా లేదా అనేది ఇంకా ఉత్కంఠగానే ఉంది.

ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆధిక్యంలో ఉండటం వేరు.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వేరు. తుది ఫలితాలు వచ్చేసరికి ఈ స్థానాల సంఖ్యలో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఒకవేళ నెతన్యాహు కూటమి 61 మార్కును అందుకోలేకపోతే.. ఇతర చిన్న పార్టీలు.. అరబ్ పార్టీల మద్దతు ప్రభుత్వాన్ని నిర్ణయించడంలో అత్యంత కీలకం కానుంది.

భారత్‌లోనూ ఆసక్తి.. అంతర్జాతీయ ప్రాధాన్యం

నరేంద్ర మోదీ, బెంజమిన్ నెతన్యాహు మధ్య ఉన్న బలమైన దౌత్య, వ్యక్తిగత సంబంధాల కారణంగా ఈ ఎన్నికల ఫలితాలపై భారత్‌లోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది. భద్రత, రక్షణ, సాంకేతికత, వ్యవసాయ రంగాల్లో ఇరు దేశాల మధ్య మైత్రి ఎంతగానో బలపడింది. నెతన్యాహు మళ్లీ అధికారంలోకి వస్తే ఈ ద్వైపాక్షిక సంబంధాలు మరింత వేగంగా ముందుకు సాగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇజ్రాయెల్ రాజకీయంలో అసలు సిసలైన పోరు ఇప్పుడే మొదలైంది. నెతన్యాహు తన రాజకీయ చదరంగంలో గెలిచి మళ్లీ ప్రధాని పీఠాన్ని అధిరోహిస్తారా? లేక ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడి సవాలు విసురుతాయా? అన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది. తుది ఫలితాలు, ఆ తర్వాత జరిగే కూటమి చర్చలే ఇజ్రాయెల్ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.