Begin typing your search above and press return to search.

శాండ్‌విచ్‌లో రొయ్య... మహిళకు రూ.లక్ష పరిహారం

రెస్టారెంట్స్‌, ఫుడ్ స్టాల్స్ శుభ్రత విషయంలో ఎలా వ్యవహరిస్తూ ఉంటాయో మనం అప్పుడప్పుడు చూస్తున్న వార్తలను బట్టి అర్థం చేసుకోవచ్చు.

By:  Ramesh Palla   |   20 Nov 2025 4:00 PM IST
శాండ్‌విచ్‌లో రొయ్య... మహిళకు రూ.లక్ష పరిహారం
X

రెస్టారెంట్స్‌, ఫుడ్ స్టాల్స్ శుభ్రత విషయంలో ఎలా వ్యవహరిస్తూ ఉంటాయో మనం అప్పుడప్పుడు చూస్తున్న వార్తలను బట్టి అర్థం చేసుకోవచ్చు. అప్పుడప్పుడు వెళ్లి చూసే ఫుడ్‌ సేఫ్టీ అధికారులకు అక్కడ కనిపించే కంపు, వ్యర్థాలు చాలానే ఉంటాయి. ముఖ్యంగా మీడియం రేంజ్‌లో ఉండే కొన్ని రెస్టారెంట్స్‌, హోటల్స్‌, టిఫిన్‌ సెంటర్స్‌ లో కిచెన్‌లోకి వెళ్లి చూస్తే తినలేనంత డర్టీగా ఉంటాయి. కొన్ని రెస్టారెంట్స్ పర్వాలేదు అన్నట్టుగా ఉంటాయి. వండేప్పుడు కూడా ఇష్టానుసారంగా పదార్థాలను వేయడం ద్వారా కొన్ని హోటల్స్ వారు కస్టమర్లను ఇబ్బందికి గురి చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా శాఖాహారం మాత్రమే తినే వారికి అప్పుడప్పుడు రెస్టారెంట్‌ వారు మాంసాహారం రుచి చూపిస్తూ ఉంటారు. చాలా మంది వారికి తెలియకుండానే ఏదో ఒక సమయంలో రెస్టారెంట్‌లో మాంసాహారం రుచి చూసి ఉంటారు అనేది టాక్‌.

ఫుడ్‌ కోర్ట్‌ పై మహిళ కేసు..

తాజాగా బెంగళూరులో జరిగిన సంఘటన చర్చనీయాంశం అయింది. నిషా అనే మహిళ పారిస్‌ పాణిని అనే ఫుడ్‌ కోర్ట్‌ నుంచి ప్యూర్‌ వెజ్‌ శాండ్‌విచ్‌ ఆర్డర్‌ చేస్తే అందులో రొయ్య వచ్చింది. శాండ్‌విచ్‌ను ఒక బైట్‌ తిన్నతర్వాత సదరు మహిళకు అనుమానం వచ్చి చూస్తే అందులో రొయ్య ఉంది. స్వతహాగా ప్యూర్‌ వెజిటేరియన్‌ అయిన నిషా రొయ్య ను చూసి షాక్ అయింది. ఆ శాండ్‌విచ్‌ను ఆమె ఆన్‌ లైన్‌ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ స్విగ్గీ ద్వారా ఆర్డర్‌ చేసింది. వెంటనే స్విగ్గీలో ఫిర్యాదు నమోదు చేసింది. అంతే కాకుండా వెజ్‌ శాండ్‌విచ్‌లో రొయ్య ఉన్న ఫోటోను తీసుకుని సోషల్‌ మీడియాలో షేర్ చేసింది. నేరుగా నిషా తను ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టుకున్న పారిస్ పాణిని రెస్టారెంట్‌కు వెళ్లి మేనేజర్‌తో మాట్లాడింది. రద్దీ ఎక్కువగా ఉన్న కారణంగా తప్పు జరిగిందని, అతడు క్షమాపణ చెప్పాడు. మరో శాండ్‌విచ్‌ను ఆమెకు ఇస్తామన్నాడు. కానీ ఆమె దాన్ని తిరస్కరించి బయటకు వచ్చేసింది.

వెజ్‌ శాండ్‌విచ్‌కి బదులుగా...

వినియోగదారుల కోర్ట్‌ లో నిషా ఫిర్యాదు చేసింది. శాఖాహారిని అయిన తాను ఆర్డర్‌ చేసుకున్న వెజ్ శాండ్‌విచ్‌లో రొయ్యను పెట్టి పంపించారు. నేను దాన్ని ఒక బైట్‌ తినడంతో మానసికంగా ఇబ్బంది పడుతున్నాను. అంతే కాకుండా నేను దేవుడిని పూజించి తీసుకున్న ఆహారం నాన్‌వెజ్‌ అని తెలిసి అత్యంత బాధ కలిగిందని ఆమె కోర్ట్‌లో తన బాధను వ్యక్తం చేసింది. తనకు జరిగిన ఇబ్బందికి సదరు రెస్టారెంట్‌ వారు, అలాగే స్విగ్గీ వారి నుంచి రూ.2 లక్షలు పరిహారం ఇప్పించాల్సిందిగా ఆమె కోర్ట్‌కు విజ్ఞప్తి చేసింది. కోర్ట్‌ ఆమెకు అనుకూలంగా తీర్పును ఇచ్చింది. ఇటీవల కోర్ట్‌ ఇచ్చిన తుది తీర్పులో ఆమెకు లక్ష రూపాయలు చెల్లించాల్సిందిగా పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం ఈ కోర్ట్‌ తీర్పు సోషల్‌ మీడియాలో, మీడియా సర్కిల్స్‌ లోనే కాకుండా అన్ని చోట్ల చర్చనీయాంశంగా మారింది.

స్విగ్గీ కి రూ.50,000 జరిమాన

నిషాకి బెంగళూరుకు చెందిన పారిస్‌ పాణిని రెస్టారెంట్‌ వారు రూ.50,000 లు చెల్లించాల్సి ఉంది, అంతే కాకుండా ఆన్ లైన్ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ అయిన స్విగ్గీ రూ.50,000 లు నిషాకు చెల్లించాలని కోర్ట్‌ తీర్పులో పేర్కొంది. అంతే కాకుండా నిషాకు కోర్ట్‌ ఖర్చుల నిమిత్తం రూ.5000 లు, శాండ్‌విచ్ కు ఆమె చెల్లించిన మొత్తంను వడ్డీతో సహా రూ.146 ను చెల్లించాలని కోర్ట్‌ పేర్కొంది. లక్ష రూపాయలు ఆమెకు దక్కినా ఆమె పడ్డ మానసిక క్షోభను ఏమాత్రం తగ్గించలేదు అని కోర్ట్‌ పేర్కొంది. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిందిగా కోర్ట్‌ పేర్కొంది. చాలా మంది ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు లైట్ తీసుకుంటారు, హోటల్స్ వారిపై అరిచి సైలెంట్‌ అవుతారు. కానీ నిషా కోర్ట్‌కు వెళ్లడం ద్వారా లక్ష రూపాయలు పొందింది, అంతే కాకుండా చాలా మందికి మార్గదర్శిగా నిలిచింది.