బెంగళూరులో నీటి కష్టాలు: తాగునీరు వృథా చేస్తే రూ. 5,000 జరిమానా.. ప్రభుత్వం సంచలన ఆదేశాలు
దేశవ్యాప్తంగా ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుండటంతో పలు రాష్ట్రాల్లో నీటి లభ్యతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
By: A.N.Kumar | 5 July 2026 8:15 PM ISTదేశవ్యాప్తంగా ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుండటంతో పలు రాష్ట్రాల్లో నీటి లభ్యతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా కేరళను తాకినప్పటికీ ఆ తర్వాత వాటి పురోగతి ఆశించినంత వేగంగా సాగలేదు. ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నా.. దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడనాల ప్రభావంతో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నప్పటికీ మొత్తం లోటును భర్తీ చేసే స్థాయిలో వర్షపాతం నమోదు కావడం లేదు.
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కర్ణాటక ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ఐటీ హబ్ బెంగళూరులో రాబోయే నెలల్లో తాగునీటి కొరత తలెత్తకుండా ఉండేందుకు బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు పలు కీలక నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ఎల్ నినో ప్రభావంతో రుతుపవనాల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం, నీటి సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఈ సంచలన నిర్ణయాలు తీసుకుంది.
తాగునీటి వృథాపై కఠిన నిషేధం
కొత్త నిబంధనల ప్రకారం తాగునీటిని అవసరం లేని పనులకు వినియోగించడాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. వాహనాలు కడగడం, రోడ్లు, ఫుట్‌పాత్‌లు శుభ్రం చేయడం కోసం తాగునీటిని ఉపయోగించరాదు. పబ్లిక్, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్‌లో కూడా తాగునీటిని నింపేందుకు అనుమతి ఉండదు. వాటికి బదులుగా శుద్ధి చేసిన లేదా రీసైకిల్ చేసిన నీటినే వినియోగించాల్సి ఉంటుంది. తోటల నిర్వహణ, భవన నిర్మాణ పనులు, వాణిజ్య అవసరాల కోసం కూడా రీసైకిల్ చేసిన నీటినే ఉపయోగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. తాగునీటి పైప్‌లైన్లను సాధారణ అవసరాలకు వినియోగిస్తే జలమండలి ప్రత్యేక నిఘా బృందాలు తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోనున్నాయి.
ఏరేటర్లు తప్పనిసరి!
నీటి వృథాను అరికట్టేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. నగరంలోని ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, హోటళ్లు, కార్యాలయాలు, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాల్లోని అన్ని నీటి నల్లాలకు ఫ్లో రెస్ట్రిక్టర్లు (ఏరేటర్లు) తప్పనిసరిగా అమర్చాలని ఆదేశించింది. వీటి ద్వారా నీటి వినియోగం 30 నుంచి 50 శాతం వరకు తగ్గుతుందని, దీర్ఘకాలం నీటి నిల్వలను కాపాడుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని జలమండలి చైర్‌పర్సన్ డాక్టర్ మంజుల వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధిస్తారు. ఈ నిబంధనలను ఉల్లంఘించే వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. మొదటిసారి నిబంధనలు అతిక్రమించిన వారికి రూ. 5,000 వరకు జరిమానా విధిస్తారు.
అంతేకాకుండా బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ యాక్ట్–1964 ప్రకారం సంబంధిత భవనాలకు సరఫరా చేసే తాగునీటిని 50 శాతం వరకు తగ్గించే అధికారం కూడా బోర్డుకు ఉంది. ఒకవేళ జరిమానా చెల్లించిన తర్వాత కూడా నిబంధనలను పాటించకపోతే రోజుకు రూ. 500 చొప్పున అదనపు పెనాల్టీ విధించడంతో పాటు, అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని జలమండలి హెచ్చరించింది.
వాతావరణ మార్పులు, వర్షాభావ పరిస్థితులు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వకపోతే భవిష్యత్తులో మరింత తీవ్రమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరు ప్రభుత్వం తీసుకున్న ఈ కఠిన నిర్ణయాలు దేశంలోని ఇతర మహానగరాలకు కూడా ఆదర్శంగా మారే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
